‘రేషన్’ వ్యవస్థ రద్దుకే ‘నగదు బదిలీ’ కుట్ర!

ABN , First Publish Date - 2022-04-27T09:19:28+05:30 IST

ఈనెల 25 నుంచి రాష్ట్రంలో ఐదు మున్సిపాలిటీల్లో (గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల) నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది...

‘రేషన్’ వ్యవస్థ రద్దుకే ‘నగదు బదిలీ’ కుట్ర!

ఈనెల 25 నుంచి రాష్ట్రంలో ఐదు మున్సిపాలిటీల్లో (గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల) నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 16 నుంచి 23 వరకు లబ్ధిదారులతో అంగీకార పత్రాలు తీసుకుని 25 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. కార్పొరేటు శక్తులకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం పేదల సబ్సిడీలను పూర్తిగా కుదించడానికి చేస్తున్న కుట్రలో భాగమే ఈ నగదు బదిలీ పథకం. బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండరుకు సబ్సిడీ ద్వారా రూ.600 నగదు బదిలీ చేస్తామని ప్రారంభంలో చెప్పింది. పేదలతోపాటు మధ్యతరగతి ప్రజలు కూడా బీజేపీ మాటలు నమ్మారు. క్రమేపీ బహిరంగ మార్కెట్టు ధరలతో ముడిపెట్టి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా తగ్గిస్తూ నేడు సిలిండరుకు రూ.5 నుంచి రూ.10 మాత్రమే సబ్సిడీని ఇస్తోంది. రూ.350కు ఇస్తున్న వంట గ్యాస్‌ను రూ.1000లకు పెంచి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసింది. రేపు ప్రజాపంపిణీ వ్యవస్థలో కూడా ఇదే జరుగుతుంది.


నగదు బదిలీ అంటే ఏమిటి? రేషన్‌ కార్డు ద్వారా అందించే నిత్యావసర సరుకులు బియ్యం, పప్పు, పంచదార, నూనె మొదలగు వాటి స్థానంలో నగదును చెల్లించడం. రేషన్‌ కార్డుదారులకు మార్కెట్‌ ధరలతో సంబంధం లేకుండా నేడు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం ధాన్యాన్ని ఎంతకు కొంటున్నదనేది కార్డుదారుకు సంబంధం లేదు. ఆ భారమంతా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ రేషన్‌ స్థానంలో నగదును బదిలీ చేస్తామని చెబుతుంది. అంటే ప్రభుత్వం మార్కెట్‌లో కొనే ధాన్యం డబ్బును వినియోగదారులకు చెల్లిస్తుంది. ఈ డబ్బు తీసుకొని మనం ఏమైనా చేసుకోవచ్చు. ఈ రహస్యం తెలియనివాళ్ళకి ఇది బాగానే కనిపిస్తుంది. రానున్న కాలంలో ప్రభుత్వం ధాన్యం సేకరించాల్సిన అవసరం లేకుండా పోతుంది కాబట్టి ప్రజా పంపిణీ కూడా అవసరం లేదు. బహిరంగ మార్కెట్‌లో కొనుక్కోవాలి. కిలో బియ్యం 60–70 రూపాయలు కావొచ్చు. ఇంకా ఎంతైనా కావొచ్చు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చే నగదు బదిలీ ఇప్పుడు ఎంతైతే నిర్ణయించిందో అంతే చెల్లిస్తుంది. ఉదా– ప్రస్తుతం బియ్యానికి బదులు కిలోకి 12 నుంచి 15 రూపాయలు నగదుగా ఇవ్వొచ్చు. అంటే 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబానికి 250–300 రూపాయలు రావొచ్చు. ఈ డబ్బుతో బహిరంగ మార్కెట్టులో ఐదు కిలోలు కూడా రావు. అప్పుడు ఉన్న కార్డులు రద్దయి రూపాయికి కిలో బియ్యం పథకం ఉండదు. దీనివల్ల పెద్ద ఎత్తున ఆహార కొరత ఏర్పడి పేదల్లో ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. వరదలు, కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర రేషన్‌ నిలువ లేక పేదలకు ఇవ్వడానికి కూడా ఆహార ధాన్యాలు ఉండవు. ప్రజా పంపిణీ పోయిన తరువాత రైతుల ధాన్యాన్ని కొనాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉండదు. ఈ కారణంగా బహిరంగ మార్కెట్‌లో రైతుల ధాన్యాన్ని కొనే దిక్కు లేక మరిన్ని రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతాయి. లేదా ఆ రైతులు వ్యవసాయాన్నే మానుకునే పరిస్థితి రావొచ్చు. ఇదే జరిగితే మొత్తం ప్రజానీకానికే ఆహార కొరత ఏర్పడుతుంది.


ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అంగీకారం మేరకే నగదు బదిలీని అమలు చేస్తామని చెబుతోంది. అంతేగాకుండా ఇప్పటికే కేంద్ర ఆహార భద్రతాచట్టం ద్వారా లబ్ధి పొందుతున్నవాళ్ళు ఈ నగదు బదిలీకి రావాలంటే ఆ చట్టం నుంచి బయటకు వస్తేనే నగదు బదిలీకి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది పాడి గేదెను వదులుకొని రావడం లాంటిది. ప్రజలు తెలియక మోసపోయి అంగీకరించిన తరువాత ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని అనివార్యంగా తగ్గిస్తారు. అంతేగాకుండా బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలకు, నగదు బదిలీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ కారణంగా పేదలకు రేషన్‌ షాపు ద్వారా బియ్యం అందక, ప్రభుత్వం నుండి సహాయం అందక, మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర సరుకులు కొనలేక, అర్ధాకలితో అలమటించే పరిస్థితి వస్తుంది. బ్రెజిల్‌లో నగదు బదిలీ ప్రవేశపెట్టినప్పుడు  ముందు ఇలాగే చెప్పారు. మొత్తం బదిలీ అమలులోకి వచ్చిన తరువాత లబ్ధిదారులు నగదు పొందాలంటే తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లు, ఆ కుటుంబాలు ప్రభుత్వం వైద్యం పొందుతున్నట్లు సర్టిఫికేట్లు ఇవ్వాలి. అప్పుడే బిపిఎల్‌ కింద గుర్తించి నగదు బదిలీ చేశారు. నేడు బీజేపీ ప్రభుత్వం కుట్ర కూడా ఇదే.


కేంద్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ, వంట గ్యాస్‌, విద్యుత్‌ మొదలగు పేదలకు ఇస్తున్న సబ్సిడీలన్నింటిలో నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టి రానురాను కోత విధిస్తూ, చివరకు మొత్తాన్నే రద్దు చేసి పేదలకు తీవ్రమైన ద్రోహం చేయాలని చూస్తుంది. బీజేపీ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో పడి వైఎస్సార్‌సిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నష్టం చేయొద్దని కోరుతున్నాము.


భారతదేశంలో ప్రజాపంపిణీకి గొప్ప చరిత్ర ఉంది. కరువు కాటకాలలోను, సంక్షోభ సమయాలలోను, ఈ మధ్య ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కోవిడ్‌ లాంటి విపత్కర సమయంలోను ప్రజాపంపిణీ ద్వారా పేదలకు ఎంతో ఉపశమనం కలిగింది. పేదలను, రైతాంగాన్ని, దేశ ప్రజానీకాన్ని ఆదుకోవడానికి 1956లో మొట్టమొదట మన దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ఏర్పడిరది. కేరళ లాంటి రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం ఈనాటికీ చౌక ధరలకు 14 రకాల నిత్యావసర సరుకులు అందిస్తూ పేదలను ఆదుకుంటున్నది.


ప్రజాపంపిణీ కోసం అనివార్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సిఐ) ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించాల్సి వస్తోంది. రైతులు ప్రైవేటు మార్కెట్‌ దోపిడీకి గురి కాకుండా ఉండడానికి కొంతవరకైనా దోహదపడుతుంది. రేపు ఈ ప్రజాపంపిణీ వ్యవస్థ రద్దయితే రైతుల ధాన్యం కొనే దిక్కు లేక కార్పొరేట్‌ సంస్థలు, కాంట్రాక్టర్లు, మధ్య దళారీల ఇష్టానుసారానికి వదిలేయాల్సి వస్తుంది. ఇప్పటికే రబీలో ధాన్యం కొనలేదు. ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ధాన్యం అమ్ముడుపోక ఆందోళనలు సాగుతున్నాయి. రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై మరిన్ని ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. వరదలు, కరువుకాటకాలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాలున్నా పేదలను ఆకలి చావుల నుండి రక్షించడానికి రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నాయి. రేపు ప్రజాపంపిణీ వ్యవస్థ రద్దైన తరువాత ప్రభుత్వం ఆహార ధాన్యాలుసేకరించదు. ధరలు పెరుగుతాయి. ఆకలి కేకలు పెరుగుతాయి.


నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టడం అంటే పేదలకు ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టి ప్రభుత్వాలు తమ బాధ్యతనుండి తప్పించుకోవడమే. అంతేగాకుండా ఈ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను డీలర్లు, ట్రాన్స్‌పోర్టు, ముఠాకార్మికులు లక్ష కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. రేపు వీరంతా ఉపాధిని కోల్పోయి రోడ్డున పడతారు. సామాన్య ప్రజలకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా నష్టం కలిగించి ఆహార కొరతను సృష్టించే నగదు బదిలీ పథకాన్ని వెంటనే రద్దు చేసి, ఆహార భద్రతా చట్టాన్ని, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత బలపరచాల్సిన అవసరం ఉన్నది.

వి. వెంకటేశ్వర్లు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం

Updated Date - 2022-04-27T09:19:28+05:30 IST