ప్రభుత్వాలు పగబట్టవచ్చునా?

ABN , First Publish Date - 2022-10-20T06:04:04+05:30 IST

ప్రభుత్వాలకు ఉద్వేగాలు, ఉత్సాహాలూ ఉండవంటారు. వాటి స్పందనలు యాంత్రికంగా మానవీయ స్పర్శ లేకుండా ఉంటాయి. నిజానికి అట్లా ఉండడంలో ఒక సానుకూల కోణం...

ప్రభుత్వాలు పగబట్టవచ్చునా?

ప్రభుత్వాలకు ఉద్వేగాలు, ఉత్సాహాలూ ఉండవంటారు. వాటి స్పందనలు యాంత్రికంగా మానవీయ స్పర్శ లేకుండా ఉంటాయి. నిజానికి అట్లా ఉండడంలో ఒక సానుకూల కోణం కూడా ఉంది. వాటి పనితీరులో వ్యక్తుల రాగద్వేషాలు కాక, విధినిర్వహణ మాత్రమే వ్యక్తమవుతూ ఉంటుంది. మంచి జరిగినా చెడు జరిగినా రూపం లేని ఒక యంత్రాంగం ద్వారానే జరిగినట్టు ఉంటుంది. ఉరితాడు తొడిగే తలారి కూడా, అది తాను ఇష్టంగా సంకల్పించి చేస్తున్న పని కాదని, కర్తవ్యం మాత్రమే నిర్వహిస్తున్నానని చెబుతాడు.


అధికారంలో ఉన్న రాజకీయవాదులు అట్లా ఉండకపోవచ్చు. వాళ్లు ప్రత్యర్థి రాజకీయవాదులను విమర్శిస్తారు, దూషిస్తారు. పరిపాలనను ఇబ్బంది పెడుతున్నారనుకునే ఉద్యమాలను, ఉద్యమకారులను అణచివేయాలని చూస్తారు. అసహనం ఉంటుంది. అధికారాన్ని అదుపు లేకుండా ఉపయోగించుకుంటారు. అంటే నిర్బంధం అమలు కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో పరిపాలనా యంత్రాంగం ద్వారానే జరుగుతుంది. అంతిమఫలితం మీదనే దృష్టి ఉంటుంది తప్ప, అందులో వ్యక్తుల మీద వ్యక్తిగతమైన గురి ఉండదు. ప్రభుత్వాల ఆదేశంతో చట్టవ్యతిరేకంగా కాల్చిచంపే పోలీసుకు కూడా హతుడిపై కార్పణ్యం ఉండదు.


కానీ, ప్రజలలో ఉన్న విభాగాలను ఆధారం చేసుకుని, ఒకరిపై ఒకరికి అసహనం కలిగించడం ద్వారా, ద్వేషాన్ని ఆసరాగా చేసుకుని మెజారిటీ జనంలో సమ్మతిని సంపాదించుకుని, అపరిమిత అధికారాన్ని చెలాయించేవారు తీవ్రమైన భావోద్వేగాలతో రగిలిపోతూ ఉంటారు, ఫాసిస్టులంటారో నియంతలంటారో ఆధిపత్యవాదులంటారో కానీ, వారు నిర్దాక్షిణ్యతను ఒక విధానంగా భావిస్తారు. ప్రభుత్వ యంత్రాంగానికి కూడా రాగద్వేషాలను రంగరించిపోస్తారు. ప్రత్యర్థుల మీద, ప్రతిపక్షం మీద పాలకులు, పాలనావ్యవస్థ కూడా కసితో, పగతో వ్యవహరిస్తుంటారు. దాన్ని వారు దాచుకోనుకూడా దాచుకోరు. బాహాటంగా ప్రదర్శిస్తూ ఉంటారు.


జి.ఎన్. సాయిబాబా అనే మేధావి, హక్కుల కార్యకర్త, కవి, రచయిత విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు, బాధాకరమైన దిగ్భ్రాంతిని కలిగించింది. ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన జైలులో ఉన్నారు, ఐదు సంవత్సరాల నుంచి నిర్ధారిత దోషిగా నిర్బంధంలో ఉన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆయన చేసుకున్న అప్పీలు మహారాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగి, తీర్పు రావడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది. ఆయనను ఊపా చట్టం కింద అరెస్టు చేసిన తీరును తప్పు పడుతూ, తక్షణం ఆయనను విడుదల చేయాలని హైకోర్టు చెప్పింది. ప్రక్రియాపరమైన దోషాన్ని ఎత్తిచూపుతూనే, దేశభద్రత పేరుతో మానవహక్కుల ఉల్లంఘన చేయడంలోని అసమంజసత్వాన్ని న్యాయమూర్తులు తప్పుపట్టారు. సాయిబాబా మీద మోపిన అభియోగాలు వాస్తవమైనవి కావని, ఆదివాసీ ఉద్యమాలతో సహా వివిధ ప్రజా ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తున్నందునే, కేంద్రప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను వేధించడానికి కేసులు పెట్టాయని అనేకమంది ప్రజాస్వామికవాదులు, పౌరసమాజం పెద్దలు అభిప్రాయపడ్డారు, నిరసనలు తెలిపారు, విజ్ఞాపనలు పంపారు. తొంభైశాతం వైకల్యం ఉన్న వ్యక్తిని నాగపూర్‌లో అండాసెస్‌లో నిర్బంధించడం, ఆయన అనారోగ్యాన్ని ఖాతరు చేయకపోవడం, ఆయనకు ఉండే ప్రత్యేక అవసరాల విషయంలో తీవ్రమైన అలక్ష్యం వహించడం, చివరకు తల్లి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు కూడా అనుమతించకపోవడం, సాయిబాబాను దేశంలో నెలకొని ఉన్న నిర్బంధ వాతావరణానికి ఒక చిహ్నంగా మార్చాయి. అందువల్లనే, ఆయన మీద కేసు కొట్టివేసినప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. న్యాయం గెలిచిందని కొందరికి, ఆయన కష్టాలు గట్టెక్కాయని కొందరికి ఊరట కలిగింది. ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తూ, జీవితఖైదు విధింపు తరువాత తొలగింపునకు గురి అయిన సాయిబాబాకు స్వాగతం చెప్పడానికి, ఆ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు.


సాయిబాబా తీర్పు వచ్చిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం మొదట సుప్రీంకోర్టులో మౌఖికంగా స్టే కోసం అడిగింది. దొరకలేదు. తరువాత, సొలిసిటర్ జనరల్ ద్వారా పిటిషను దాఖలు చేయించి, వెంటనే దాన్ని వినాలని ప్రత్యేకంగా సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఫలితంగా, మరునాడు శనివారం సెలవు అయినప్పటికీ, మహారాష్ట్ర పిటిషన్‌ను ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ విన్నది. ప్రభుత్వం కోరినట్టుగా స్టే లభించింది. సాయిబాబా విడుదల కాలేదు. ఢిల్లీ యూనివర్సిటీ సభను పోలీసులు భగ్నం చేశారు.


తీర్పు, అప్పీలు అనే ప్రక్రియలో అభ్యంతరకరమైనది ఏమీ లేదు. తనకు జీవిత ఖైదు విధించిన కింది కోర్టు తీర్పు మీద సాయిబాబా కూడా అప్పీలు చేసుకున్నారు. హైకోర్ట్ కూడా జీవితఖైదును సమర్థించి ఉంటే, ఆయన సుప్రీంకోర్టులో కూడా అప్పీలు దాఖలు చేసి ఉండేవారు. కాబట్టి, మహారాష్ట్ర ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై అప్పీలు చేసుకోవడం సహజమే. కానీ, ఈ మొత్తం క్రమంలో కనిపించిన వేగం, ఆత్రుత, కసి ప్రత్యేకమైనవి. సాయిబాబా విడుదల జరగనిచ్చి, ఆ తరువాత ప్రాసిక్యూషన్ అప్పీలు చేసుకుని, విచారణ క్రమంలో తిరిగి అరెస్ట్‌ను కోరి ఉండవచ్చు. కానీ, ఒక్క పూట కూడా ఆయన స్వేచ్ఛగా ఉండడానికి వీలులేదన్న పట్టుదల ప్రాసిక్యూషన్‌లో కనిపించింది. మునుపు కూడా అంతే, కేసు విచారణదశలో కూడా ఆయన ఎడతెగని నిర్బంధంలోనే ఉన్నారు. ఒకటి రెండుసార్లు బెయిల్ పొందినా, పోరాడి మరీ ప్రాసిక్యూషన్ దాన్ని ముగింపచేసింది. ఇదంతా సాయిబాబా మీద వ్యక్తిగతమైన కోపంతో జరిగిందనలేము, ఆయన ఒక్కడిని చూసి ప్రభుత్వం భయపడి చేసిందనీ అనుకోలేము. కానీ, అది సాయిబాబా వంటి వారందరి మీదా కక్షతో కార్పణ్యంతో జరిగింది. ఒక సందేశాన్ని, ఒక కాఠిన్యపు సందేశాన్ని వ్యాపింపజేయడానికే జరిగిందని అనిపిస్తుంది. వైకల్యం ఉన్న వ్యక్తి అయినా, అనారోగ్య బాధితుడు అయినా, గృహనిర్బంధంలో ఉండడానికి సిద్ధపడిపోయినా, అతడు ప్రమాదకారియే అని ప్రాసిక్యూషన్ వాదిస్తుంది. శరీరం వికలమైతేనేమి, మెదడే కదా సకలం అన్నసత్యం ఆవిష్కృతమవుతుంది. 


బిల్కిస్ బానో మీద సామూహిక అత్యాచారం చేసి, చిన్నారిని నేలకేసి కొట్టిచంపి, ఆమె కుటుంబసభ్యులను ఊచకోత కోసిన నేరస్థులు వారి మెదడు, శరీరమూ రెండిటితో సహా విడుదలయ్యారు. టెర్రరిజంగా చెప్పవలసిన ఆ నేరాన్ని మళ్లీ చేయడానికి వారి శరీరాలు పనికిరాకుండా పోయాయా లేక వారు ఆ నేరం తిరిగి చేయకుండా మారుమెదళ్లు పొందారా తెలియదు. వారి విడుదల ప్రభుత్వాలకు ఎటువంటి ఆందోళనా కలిగించదు. ఆందోళన ఏమిటి, వారి సత్ప్రవర్తనకు మురిసి ముక్కలైపోయి, కేంద్రమూ, రాష్ట్రమూ రెండూ స్వయంగా ఆమోదించి అనుమతించి, స్వతంత్ర భారత అమృతోత్సవ సందర్భంగా విడుదల చేశాయి. ఎంతో గొప్ప పనిచేసి జైలునుంచి విడుదల అయినందుకు, గుజరాత్ విశ్వహిందూ పరిషత్ వారు ఆ ఖైదీలకు పూలమాలలతో స్వాగతం చెప్పారు. సాయిబాబా విడుదల విషయమై జరిగిన హడావిడిని చూసినప్పుడు బిల్కిస్ బానో రేపిస్టుల ఉదంతం గుర్తుకు రాకుండా ఉంటుందా? ప్రపంచం దృష్టిలో పలుచన అయ్యే భారతదేశ ప్రతిష్ఠ, బాధితుల మనసులో న్యాయపాలన గురించి చెలరేగే కలవరపు ప్రశ్నలు అత్యవసరంగా పరిగణించవలసినవి కాకపోగా, బస్తాల కొద్దీ వాదనలతో గుజరాత్ ప్రభుత్వం చేసిన విన్యాసానిదే పై చేయి అయింది. పర్వాలేదు, ఆ రేపిస్టులు నవంబర్ చివరిదాకా స్వేచ్ఛగా ఉండవచ్చు.


తాను తప్ప మరొకటేమీ మిగలగూడదని, తక్కినవన్నిటినీ తొక్కిపారేయాలని అనుకునే రాజ్యానికి, కర్కశత్వం, కాఠిన్యం కూడా సానుకూల విలువలే. ఆగ్రహాలను, అసమ్మతిని అణచివేయడానికి రాజ్యాంగబద్ధ హక్కులు అడ్డం వస్తే, ప్రక్రియనే శిక్షలుగా మార్చడం ఒక పద్ధతి. మునుపటి ప్రధాన న్యాయమూర్తే గుర్తించారు కదా ఆ వ్యూహాన్ని! చట్టాల కింద శిక్షించడం పెరగాలి, శిక్షలు సాధ్యం కాకపోతే, బెయిల్ లేని పెరోల్ లేని నిర్బంధాలే శిక్షలు కావాలి! సాయిబాబా మీద కేసు కొట్టివేసినప్పుడు, నిర్దోషి అయి ఉండీ ఆయన అనుభవించిన శిక్షకు పరిహారం ఏది అని అమాయకమైన ప్రశ్నలు వచ్చాయి. తీర్పులు నిమిత్తమాత్రం. కొట్టివేసినా సరే, కొనసాగే శిక్షే వాస్తవం.


ఈ కాఠిన్యం సార్వజనీనం కాదు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తెలుసు కదా, మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు. కోర్టులో ఆమె చక్రాల కుర్చీలోనే కనిపించేది. ఆమె అనారోగ్యాన్ని ప్రాసిక్యూషన్ ఎంతో సానుభూతితో అర్థం చేసుకున్నది. ఆమె కబడ్డీ ఆడుతున్న వీడియోలు, ఏ అనారోగ్యం లేకుండా చలాకీగా ఉన్న ఫోటోలు మీడియాలో వచ్చాయి కానీ, ఆమె మెదడు, శరీరమూ రెండూ ప్రమాదరహితమైనవిగా పరిగణన పొందాయి. ఆమెకు జాతీయ అధికారపార్టీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చి పార్లమెంటుకు పంపింది. ఎవరి విషయంలో సానుభూతితో ఉండాలో, ఎవరి విషయంలో కఠినంగా ఉండాలో కూడా ప్రభుత్వాలకు తెలుసు. కర్కశత్వం ఒక రాజకీయ విధానమైనప్పుడు, కర్కశులకు అధికారం అందినట్టే. నేరమే అధికారమయ్యే ఈ ప్రక్రియ వల్ల ఎంతటి అప్రతిష్ఠ వచ్చినా సరే, అభ్యంతరం లేదు. ఉక్కుపిడికిట దేశాన్ని పాలించాలనుకునే వారికి, అపకీర్తి కూడా ఆయుధమే. దళితయువతిపై అత్యాచారాన్ని, హత్యను రిపోర్టు చేయడానికి వెడుతున్న ఒక పాత్రికేయుడిని రెండు సంవత్సరాలపాటు ఊపా కింద బంధించారు కదా, ఇప్పుడు తాజాగా, ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ బహుమతిని అందుకోవడానికి అమెరికా వెళ్లవలసిన కశ్మీరీ ఫోటోజర్నలిస్టు సనా ఇర్షాద్‌ను దేశం విడిచివెళ్లకుండా ఢిల్లీ విమానాశ్రయంలో నిరోధించారు. కొవిడ్ సమయంలో కశ్మీర్ జనజీవనాన్ని ఫోటోలు తీసినందుకే ఆమెకు ఈ ఖ్యాతి, ఈ నిర్బంధమూ కూడా.


దీన్నే జీరో టాలరన్స్ అంటారు. ఉగ్రవాదం మీద, తీవ్రవాదం మీద దాన్ని ఎక్కుపెడతామని చెబుతారు కానీ, ఆ పూర్తి సహనశూన్యత ప్రజాస్వామ్యం పైనే, ప్రతిపక్షంపైనే. జనం భయపడాలి. అన్యాయాన్ని ప్రశ్నించేవారూ నిర్వాసితులకు న్యాయం కోరేవారూ అర్బన్ నక్సలైట్లు కాబట్టి, వారికి అందరూ దూరంగా ఉండాలి. లేకపోతే, కనికరమే దొరకని కారాగారవాసం చేస్తారు!


కె. శ్రీనివాస్

Updated Date - 2022-10-20T06:04:04+05:30 IST