మా ఊరికేమి తక్కువ?
ABN , First Publish Date - 2022-08-09T08:38:14+05:30 IST
బేతవోలు గ్రామం నేటి సూర్యాపేట జిల్లాలో చిలుకూరు మండలంలో గల మేజర్ గ్రామపంచాయతీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
బేతవోలు గ్రామం నేటి సూర్యాపేట జిల్లాలో చిలుకూరు మండలంలో గల మేజర్ గ్రామపంచాయతీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉన్నపుడే 2006 నుంచి మేజర్ గ్రామపంచాయతీగా వినుతికెక్కింది. భౌగోళికంగా చాలా విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ ఓటర్లు పద్నాలుగు వార్డులకుగాను 7900 మంది కాగా, జనాభా 10వేల మంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో సమగ్ర కుటుంబ సర్వేనాటికి 10500 మంది జనాభాతో ఉంది. పూర్తిగా వ్యవసాయక ప్రాంతం. ఇక్కడ 619 ఎకరాల విస్తీర్ణంలో వీర్లదేవి అనే పెద్దచెరువు ప్రభుత్వ ఆధీనంలో ఉండగా, కోమటికుంట అనే చెరువు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సాగర్ ఎడమకాల్వ ద్వారా నీరు ఈ చెరువులకు అందుతుంది. ఈ రెండు చెరువుల ద్వారా గ్రామం నిత్యం పచ్చగా విరాజిల్లుతున్నది. హుజూర్‌నగర్ పట్టణానికి బేతవోలు పెద్ద చెరువు నుంచి పైప్‌లైన్ ద్వారా త్రాగు నీరు అందిస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న వీర్లదేవి చెర్వు గురించి ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠం ఉంది. ఎన్నో ఆటుపోట్లను, వైభవాన్ని చవిచూసి నిలబడిన బేతవోలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కేంద్ర బిందువు. దేశ స్వాతంత్య్ర సమయంలోనూ, తెలంగాణలో రజాకార్లపైనా ఏకకాలంలో బేతవోలు ప్రాంత ప్రజలు పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి నాయకులను అందించిన నేల బేతవోలు. ఇంత చేసినప్పటికీ ఈ గ్రామం నేటికీ మండలంగా రూపదాల్చలేదు. రాష్ట్రంలో బేతవోలు కంటే భౌగోళికంగా, జనాభాపరంగా అతి చిన్న గ్రామాలు మండలాలుగా రూపుదాల్చినప్పటికీ ఈ గ్రామం మాత్రం నేటికీ మేజర్ గ్రామపంచాయతీగానే మిగిలి ఉంది. బేతవోలు, మిర్యాలగూడెం నుంచి కోదాడ నియోజకవర్గానికి మారిన తర్వాత బరాఖత్‌గూడెం జాతీయ రహదారి నుంచి రాయినగూడెం వరకు మిర్యాలగూడ రహదారిని కలుపుతూ బి.టి రోడ్డు వేశారు. బేతవోలు గ్రామానికి చుట్టుపక్కల కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పది పదిహేను గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో జెర్రిపోతులగూడెం, కొమ్ముబండతాండ, సీతారాంతాండ, చెన్నారిగూడెం, ఆచార్యులగూడెం, కొండాపురం, మాధవగూడెం, ముకుందాపురం, ఆర్లేగూడెం, పోలేనిగూడెం, కట్టవారిగూడెం, కరక్కాయలగూడెం మొదలైన గ్రామాలు ఉన్నాయి. వీటితోపాటు మల్కాపురం, రంగాపురం, వెల్దండ కలుపుకుని బేతవోలు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తొంభైశాతం అక్షరాస్యతతో ఉన్నటువంటి అతిపెద్ద గ్రామం మండలంగా నోచుకోకపోవడం విచారకరమైన విషయమే. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విశిష్ట గ్రామాన్ని మండలంగా ప్రకటించాలి.
– వరకుమార్ గుండెపంగు