ఉత్తమ గురు స్మరణ

ABN , First Publish Date - 2022-02-25T06:36:53+05:30 IST

శ్రీనాగళ్ల గురుప్రసాదరావు వేళ్లమీద లెక్కపెట్టదగిన తెలుగు దేశపు మహాపండితుల్లో ఒకరు. దేశవిదేశాల్లో అసంఖ్యాక శిష్యసంపద కలిగినవారు...

ఉత్తమ గురు స్మరణ

శ్రీనాగళ్ల గురుప్రసాదరావు వేళ్లమీద లెక్కపెట్టదగిన తెలుగు దేశపు మహాపండితుల్లో ఒకరు. దేశవిదేశాల్లో అసంఖ్యాక శిష్యసంపద కలిగినవారు. 1933లో కావూరులో పుట్టి, కౌమారంలోనే తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి వంటి దిగ్గజ కవి సాన్నిహిత్యంతో తెలుగు భాషపై మక్కువ గలిగి, మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ చదివేటప్పుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ సాన్నిహిత్యంతో చరిత్రపై ఆసక్తి పెంచుకొని, ఉత్తమ అధ్యాపకులుగా, మహావక్తగా, కళాసేవకులుగా రాణించినవారు.


మాస్టారి బోధనాకళ ప్రత్యేకంగా ఉండేది. ధారణాశక్తి అపారం. వేల పద్యాలు నాలుకమీదే ఉండేవి. నాలుగు పద్యాలు రాగయుక్తంగా పాడి విద్యార్థుల్ని మెప్పించే కాలంలో ఒకటికి రెండుసార్లు పదవిభాగంతో, అన్వయక్రమంతో చదివి, అర్థ తాత్పర్యాలతో పాటు లోలోతుల కవి హృదయాన్ని అవగతం చేసేవారు. అభినవగుప్తపాదుడు చెప్పిన సహృదయత (కవితో సమానమైన హృదయధర్మం) పాటించేవారు. ఆ విషయలీనత వల్ల విద్యార్థులమూ పాఠంలో తదేకంగా లీనమయ్యేవాళ్లం. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో ఆర్నెల్లపాటు కళాశాలలు మూతబడ్డాయి. అయితే మాస్టారు మా బిఏ (స్పెషల్‌ తెలుగు) విద్యార్థుల్ని ఇళ్లకు పోనియ్యకుండా అంతకాలం తన ఇంట్లోనే వసుచరిత్ర, బాల వ్యాకరణం చెప్పి గట్టెక్కించారు. ఆ క్రమంలో గుంటూరు జెకెసి కళాశాలకు తొలిసారిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ స్వర్ణపతకం రావటానికి (నా నిమిత్తంగా) పరోక్ష హేతువయ్యారు. శిష్యుల పట్ల ఎంత వాత్సల్యమో. ఎవరినైనా ‘ఏరా!’ అనటమే. అందరి సందేహాలూ తీర్చేవారు. ఆర్థికంగా సాయపడేవారు. జీవిత గమనంలో సలహాలిచ్చేవారు. శిష్యులపై అపార వాత్సల్యం ఉన్నా ఏనాడూ ఎవ్వరినీ మితిమీరి మెచ్చుకోలేదు. మహా అయితే ఒక్క మాట. అంతే. నా ‘తల్లీ! నిన్ను దలంచి’ (ప్రాచీన పద్యాల లోవెలుగులు) ‘ఉత్తమ గురువు నాగళ్ల గురుప్రసాదరావు గారికి’ అంకితం చేసి, గురురుణం కాస్త తీర్చుకున్నాను.


తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి నాగళ్ల వారికి గురు సమానులు. ఎన్నో యేళ్లు వారితో ఆత్మీయత నెరపిన నాగళ్ల తుమ్మలవారి నుంచి తెలుగు భాషాభిమానమే కాక, నిజాయితీతో కూడిన సాహిత్య సంరంభ జీవనాన్ని అలవరుచుకున్నారు. మహాకవి తిక్కన ఆయన అభిమాన కవి. తిక్కన కవితా కళానైపుణ్యం ఆయనకు బాగా తెలుసు. బియ్యేలో విరాటపర్వం చెప్పినప్పుడే ఆ విషయం మాకర్థమైంది. తిక్కన తెలుగుదనం, ప్రయోగ విశేషాల గురించి కాని, ‘కళ్యాల పదిలంబు గాని గుర్రంబుల క్రొత్తముట్టున కియ్యకొలుపు వెరవు’ వంటి చోట్ల ‘క్రొత్త ముట్టు’ (ఏకునుంచి సాగదీసి కదురుకంటించే నూలు) వంటి ప్రత్యేక పదజాలం గూర్చి కాని ఆయనకెంతో అవగాహన ఉంది. తిక్కన పద్యాల్లో ఒక్కొక మాట అటూ ఇటూ రెండు వైపులా అన్వయించే విలక్షణ గుణం ఉంటుంది. ‘పగ యడగించుటెంతయు శుభం–బది లెస్స–యడంగునే పగం బగ–వగ గొన్న’ అంటూ పండితులు వ్యాఖ్యానించే తావున, ‘పగ యడగించుటెంతయు శుభం–బది లెస్స యడంగునే పగం?–పగ వగ గొన్న’ అని విడదీసి కవి హృదయాన్ని సరిగ్గా ఆవిష్కరించారు. ప్రాచీన కవుల్లో కవిత్రయం, శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన వంటి కవులను అభిమానించేవారు. అష్టదిగ్గజాల కన్న రాయలే మహాకవి అని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆధునిక కవుల్లో పింగళి–కాటూరి, జాషువ, తుమ్మల, దువ్వూరి రామిరెడ్డి ఆయనకు బాగా నచ్చుతారు. ‘సౌందరనందము’, ‘ముంతాజ మహలు’ వంటి రచనల గురించి కంటి చెమ్మ లేకుండా ప్రసంగించలేరు. రామిరెడ్డి కవిత్వాన్ని (నా తోడ్పాటుతో) పునర్ముద్రణ చేయించారు. శ్రీశ్రీ కన్న చెరబండరాజును అభినందించటం అశ్చర్యం కలిగించేది. విమర్శకుల్లో కట్టమంచి, రాళ్లపల్లి తనకెంతో ఇష్టులు. ఆయనది తలస్పర్శి పాండిత్యం, ఉపరితల పాండిత్యం కాదు. చాలకాలం ఆయన శుద్ధ గ్రాంథికవాది. బాల వ్యాకరణం ఆయనకు (ఆయన ద్వారా నాకు) కంఠోపాఠం. భాషలో తెలుగుదనం పట్ల ఆయనకు చాలా పట్టింపు. తెలుగును రాచి రంపాన బెట్టే ఏలికల పట్ల ఏవగింపు.


భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, స్రవంతి మొదలైన పత్రికల్లో 1960, 70, 80 దశాబ్దాల్లో వందకు పైగా పరిశోధక వ్యాసాలు రాశారు. అరవై ఏళ్ల ఆంధ్ర సాహిత్యము, రవీంద్ర కవీంద్రుని భారత దర్శనము, రస సిద్ధాంతము, ప్రాచీన సాహిత్యము–విమర్శ, నవ్యాంధ్ర కవిత్వము–మానవతావాద దృక్పథము, సౌందరనందము, తెలుగులోని రామాయణాలు– ఇవి ఆయన పరిశోధక వ్యాసాల్లో కొన్ని మాత్రమే. తిక్కన, ఎర్రన, రాయలు, పెద్దన, సూరన, తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి, వేమన, గురజాడ, కట్టమంచి, గిడుగు, త్రిపురనేని రామస్వామి, పింగళి–కాటూరి, సురవరం, జాషువ, తుమ్మల, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ మొదలైన కవిపండితుల మీద మరెన్నో వ్యాసాలు రాశారు. ‘శాక్యసింహ’ వంటి పేర్లతో 300కు పైగా కూలంకషమైన పుస్తక సమీక్షలు చేశారు. ఆకాశవాణిలో ఎందరో కవుల మీద ప్రసంగించారు. దేశ విదేశాల్లో పలు సాహిత్యోపన్యాసాలు చేశారు. ఎక్కడా స్వోత్కర్ష ఉండదు. మొహమాటం (ఆయన మాటల్లో మోమాటం) ఉండదు. విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహుల భావజాలాన్ని ఎదుర్కోవటంలోను నదురు, బెదురు ఉండవు.


గుంటూరు అరండల్‌పేటలో ఉండగా నేను వారి ఇంట్లోనే కొంతకాలం ఉండటం చేత నార్ల వెంకటేశ్వరరావు లాంటి సంపాదకులు, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వంటి పండితులు, పొడుగాటి సిగరెట్‌ సమేతంగా ‘మో’ వంటి కవులు, స్నేహంతో అధ్యాపకులు, సందేహాలతో శిష్యులు వస్తూ పోతూ ఉండటం గమనించేవాడిని. తుమ్మలవారు సరే సరి. ‘భారతి’ సంపాదకులు శివలెంక శంభుప్రసాద్‌ ఆయననెంతో అభిమానించే వారు. తెలుగు, హిందీ క్లాసికల్‌ సినిమాల పట్ల తనకెంతో అవగాహన ఉండేది. బి.ఎన్‌.రెడ్డి గారితో స్నేహం. (మద్రాసులో వారి ఇంటికి కూడా వెళ్లాము.) వారితోను, ఇంకా రాళ్లపల్లి, వెంపరాల వంటి హేమాహేమీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి.


‘ఇద్దరు మహాకవులు’ అనే పుస్తకంలో తిక్కన, తుమ్మల కవితా విశిష్టత గురించి వివరించారు. ఆపైన సాహిత్య అకాడెమీ ప్రచురణగా ‘ఇరవయ్యో శతాబ్ది తెలుగు కవుల్లో విలక్షణ కవి తుమ్మల సీతారామమూర్తి’ మోనోగ్రాఫ్‌ రచించారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణగా ‘శాలివాహనుడు’ అనే రచన వెలువడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన మహాభారతం అశ్వమేధ పర్వానికి, మహాభాగవతం ద్వాదశ స్కంధానికి వారు చేసిన వ్యాఖ్యానాలు ప్రామాణికమైనవి. చివరలో తాళ్లపాక తిరువెంగళప్ప రచన ‘శృంగారామరు కావ్యము’నకు వ్యాఖ్య రాయటం నాకు రుచించలేదు. తన పాండిత్యాన్ని పుస్తకరూపంలో ఆవిష్కరించాల్సినంతగా ఆవిష్కరించలేదు. 


అభిప్రాయ దృఢత్వం వేరు, అభిప్రాయ కాఠిన్యం వేరు. ఈ రెండో లక్షణం వల్ల ఆయన రచనల్లో నిర్దుష్టతతో పాటు నచ్చని వాటిపట్ల కరుకుదనం ఉండేది. కనుక వ్యతిరేకాలతో తలపడుతూ తన శక్తిని కొంత వ్యర్థం చేశారనే చెప్పాలి. ‘చిత్తశుద్ధి, కార్యదీక్ష సాహితీవేత్తకవసరం. అవి లేనినాడు అతడు అనర్హుడు. విమర్శ వద్ద ఏ మోమాటమూ పనికి రాదు. అత్యంత జాగరూకతతో విషయాన్ని దోషరహితంగా చెప్పాలి’ అనేవారు. సాహిత్య అకాడెమీ ‘భాషా సమ్మాన్‌’ వంటి విశిష్ట గౌరవాలూ, ‘సుధీరత్న’ వంటి బిరుదులూ, గుంటూరులో మేం చేసిన ‘విశాలసాహితీ సత్కారం’ వంటివీ వారిలో ఏ మాత్రమూ స్వాతిశయం కల్గించలేకపోయాయి.


విజయవాడ సిద్ధార్థ కళాపీఠం కార్యదర్శిగా, అధ్యక్షులు ముమ్మనేని సుబ్బారావు గారి ప్రోత్సాహంతో 20 ఏళ్లపాటు (1990, 2000 దశాబ్దాలు) ఆయన చేసిన కళాసేవ అనితర సాధ్యం. అది కళాతృష్ణ కూడా. ఎన్నెన్ని శాస్త్రీయ, జానపద కళా ప్రదర్శనలు! మూలనబడ్డ విలాసినీ నాట్యం వంటి వాటినీ వేదిక మీదికి తెచ్చారు. రొమిల్లా థాపర్‌ లాంటి ప్రఖ్యాత చరిత్రకారులేమిటి, బిస్మిల్లాఖాన్‌ లాంటి మహాసంగీత విద్వాంసులేమిటి, సచ్చిదానందన్‌ వంటి ప్రసిద్ధ సాహిత్యకారులేమిటి, అఖిల భారత కవి సమ్మేళనాలేమిటి, అవధానాలేమిటి, ఆధ్యాత్మిక ప్రసంగాలేమిటి– బెజవాడ సాంస్కృతిక చరిత్రలో అది స్వర్ణయుగం. తన అభిరుచికి భిన్నమైన కార్యక్రమాలనూ విశాల దృక్పథంతో నిర్వహించారు.


ఇంకా ఇంకా జ్ఞాన సముపార్జనే ఆయన ఏకైక వ్యసనం. ఇంటినిండా తెలుగు, ఆంగ్లం, చరిత్ర, తత్త్వ శాస్త్రాలకు చెందిన వేలకొలది పుస్తకాలు. నిరంతర పఠనం. సంగీతంలో సేద దీరటం. పూర్తి లౌకికవాద దృక్పథం. బౌద్ధ ధర్మం పట్ల అనురక్తి. భారతీయ చరిత్ర సంస్కృతులలోని బహుముఖీనతని బాగా అర్థం చేసుకున్నారు. అమెరికా, యూరప్‌, చైనా, పాకిస్థాన్‌ పర్యటించి తన భావజాలాన్ని విశాలం చేసుకున్నారు. ‘ఈ దేశానికి చైనా వల్ల, పాకిస్థాన్‌ వల్ల ప్రమాదం లేదు. దేశంలోని మేధావులవల్లే ప్రమాదం’ అనేవారు. రాజకీయ అవినీతి పోకడల పట్ల అసహ్యం ఉండేది. స్థూలంగా లోకం పోకడ పట్ల ఒక అసమ్మతి. ఎవరినీ తొందరగా విశ్వసించలేని మనస్థితి. చివరికి జీవితాంతం మునిగి తేలి సాధించిన జ్ఞానాన్నీ అందుకు సాధనమైన పుస్తక ప్రపంచాన్నీ disown చేసుకున్నారు.


‘సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?’ అని నా ‘సముద్రం’ కథలో అపార జ్ఞాన సంపన్నుడు అనుకుంటాడు, చివరి దశలో. ఆ పాత్ర కల్పనలో మా మాస్టారి వంటి జ్ఞాన సంపన్నులే ఉన్నారు. మహామహుల అంతర్గత జ్ఞానసంపద వారితోనే అంతం కావటం అనే అనివార్యత నన్నెప్పుడూ బాధిస్తుంది. మేధావుల మనస్సుల్లోకి జొరబడి, జీవిత పర్యంతం వాళ్లు సాధించిన జ్ఞానాన్ని పొరలు పొరలుగా వెలికి తీసి భవిష్యత్‌ తరాల కోసం భద్రపరిచే సాంకేతికత ఎప్పటికైనా వస్తుందా? ఏమో. నాగళ్ల గురుప్రసాదరావు అనే ఒక మహాజ్ఞాని, అంతిమ నిర్లిప్తతతో, సముద్రాన్ని ఎక్కడో పారబోసి, నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.

డా. పాపినేని శివశంకర్‌

Updated Date - 2022-02-25T06:36:53+05:30 IST