బీసీ సంక్షేమం: అసలు లెక్కలు... పచ్చి నిజాలు!

ABN , First Publish Date - 2022-08-19T09:36:08+05:30 IST

తెలంగాణ వస్తే సబ్బండ వర్గాల బతుకులు బాగుపడ్తయ్‌, సామాజిక న్యాయం జరుగుతదని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఉద్యమ సమయంలో చెప్తుండేవారు....

బీసీ సంక్షేమం: అసలు లెక్కలు... పచ్చి నిజాలు!

తెలంగాణ వస్తే సబ్బండ వర్గాల బతుకులు బాగుపడ్తయ్‌, సామాజిక న్యాయం జరుగుతదని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఉద్యమ సమయంలో చెప్తుండేవారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లయింది. కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. బడుగుల జీవితాల్లో ఎటువంటి మార్పూ రాలేదని ప్రజా సంగ్రామ పాద యాత్రలో భాగంగా వివిధ గ్రామాలు సందర్శించినప్పుడు స్పష్టంగా కన్పిస్తోంది.


తెలంగాణలో టీఆర్‌ఎస్‌ రాజకీయం రోజురోజుకూ అప్రజాస్వామికంగా తయారవుతున్నది. సంపదనూ, అధికారాన్ని చేజిక్కించుకున్నవాళ్లు మరింత పొందాలని చూస్తున్నరుగానీ, వాటిని వెనుకబడిన వర్గాలతో పంచుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నరు. వారు బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులే నామమాత్రం కాగా, ఆ కేటాయించే నిధుల్లోనూ 10శాతం కూడా ఖర్చు పెట్టడం లేదు. ఇది సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా నేను పంపిన దరఖాస్తులకు అధికారికంగా వచ్చిన సమాధానం వెల్లడించిన నిజం.


‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగా బీసీ సబ్‌ప్లాన్‌ను పకడ్బంధీగా చట్టపద్ధతిలో తెస్తారా అని సభ్యులు అడుగుతున్నారు. తరువాతి ఫైనాన్షియల్‌ ఇయర్‌లో వందశాతం తెస్తాం. మన రాష్ట్రమే వీకర్‌ సెక్షన్‌ రాష్ట్రం. ఎవరికి శషబిషలు ఉండాల్సిన అవసరం లేదు. తరువాతి ఫైనాన్షియల్‌ ఇయర్‌లో బీసీ సబ్‌ప్లాన్‌ తెస్తం. చట్టం కూడా ఇదే సభలో పాస్‌ చేస్తం’. ఇదీ 2017 మార్చిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన. ఇప్పటికి ఐదేళ్లు కావొస్తున్నా అతీగతీ లేదు.


2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్‌‌ అలంకారప్రాయంగా మారింది. ప్రతీ బడ్జెట్‌లో రూ.1000కోట్లు కేటాయించి ఖర్చు చేయనున్నట్లు డబ్బా కొట్టుకున్న ప్రభుత్వం 2017–18 నుండి 2021–22 వరకు ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన బడ్జెట్‌కు, జరిగిన ఖర్చుకు పొంతనే లేదని ఆర్టీఐ సమాచారం ద్వారా స్పష్టమౌతోంది. గత నాలుగు బడ్జెట్లలో రూ.3000కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్‌ విభాగం ఆమోదం పొందింది రూ.350 కోట్లు మాత్రమే. దానిలో ఖర్చు చేసింది రూ.10 కోట్లకు మించి లేదు.


తెలంగాణలో బీసీలకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తూ కేసీఆర్‌ ‘బీసీ ద్రోహి’ అవతారమెత్తిన్రు. ఎనిమిదేండ్లలో 5.70లక్షల మంది బీసీలు స్వయం ఉపాధి లోన్లకు దరఖాస్తు చేసుకుంటే, కేవలం 50వేల మందికే లోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నరు. మిగిలిన 5.20 లక్షల మంది నేటికీ ఋణాల కోసం కళ్లు కాయలు కాసేల ఎదురు చూస్తున్నరు.


ఆర్టీఐ ద్వారా అందిన లెక్కల ప్రకారం ఎంబీసీ లోన్ల కోసం 13,369 మంది దరఖాస్తు చేసుకుంటే, 1,419 మంది మాత్రమే ఋణాలు పొందారు. ఎనిమిదేండ్లలో ఎంబీసీ కార్పొరేషన్‌కి కేటాయించిన బడ్జెట్‌ రూ.3,305కోట్లు కాగా, ఖర్చు చేసింది కేవలం రూ.77.46కోట్లు. నాయీ బ్రాహ్మణులకు మోడ్రన్‌ సెలూన్లు కట్టిస్తమని, సబ్సిడీపై పరికరాలు ఇప్పిస్తమని చెప్పిన్రు. దేవాలయంలోని కళ్యాణకట్టలో పని చేసే క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తమన్నరు. తీరా చూస్తే ఆ హామీలన్నిటికీ కేసీఆర్‌ కత్తెరేసిన్రు. ఆర్టీఐ ద్వారా నాయీ బ్రాహ్మణ సహకార సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఎనిమిదేండ్లలో ప్రభుత్వం వారి కోసం కేటాయించిన బడ్జెట్‌ రూ.660 కోట్లు, అందులో రూ.196 కోట్లు విడుదల చెయ్యగా, ఖర్చు చేసింది కేవలం రూ.60కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 35,651మంది నాయీ బ్రాహ్మణులు లోన్లకు దరఖాస్తు చేసుకుంటే, అందులో 7,375మందికే లోన్లు ఇచ్చిన్రు.


గొల్ల కురుమలను కోటీశ్వరులను చేస్తమని కేసీఆర్‌ కోటలు దాటే మాటలు చెప్పిన్రు. కానీ, గొర్రెల పంపిణీ పథకం మూలకుపడి మూడేండ్లయింది. యూనిట్ల కోసం రూ.31,250 చొప్పున డీడీలు కట్టిన మూడున్నర లక్షల మందికి ఎదురు చూపులే మిగిలినయ్‌. గొర్రెల పంపిణీకి పోయిన బడ్జెట్టులో వెయ్యి కోట్లు, ఈ బడ్జెట్టులో వెయ్యి కోట్లు కేటాయించినా... నయా పైసా విడుదల చెయ్యలే. రాష్ట్రంలో ఉన్న జలాశయాల్లో, చెరువుల్లో ప్రభుత్వమే ఉచితంగా చేపలు పోసి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తమని 2018 మేనిఫెస్టోలో చెప్పిన టీఆర్‌ఎస్‌, వాటిని కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టి మోసం చేసింది. ఫలితంగా ముదిరాజు, గంగపుత్ర సోదరులు సరైన ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోతున్నరు.


కల్లుగీత కార్మికులకు టెక్నాలజీ సాయం అందించి మరణాలను ఆపడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో 600 మంది గీత కార్మికులు తాటి చెట్ల మీద నుంచి పడి చనిపోయారు. 4వేల మంది వికలాంగులయిన్రు. ప్రతి గ్రామంలో 5 ఎకరాలు తాటి, ఈత వనాలకు కేటాయిస్తమని చెప్పిన 560 జీవో అమలుకే నోచుకోలే. 50 ఏండ్లు దాటిన గీతకార్మికుల పెన్షన్‌ దరఖాస్తులు నాలుగేండ్లుగా పెండింగులోనే పెట్టిన్రు. గౌడన్నలందరూ ప్రభుత్వం ఇస్తనన్న మోటరు సైకిండ్ల కోసం దరఖాస్తు పెట్టుకోగా అవి కాగితాలకే పరిమితమైనయ్‌.


ఆర్టీఐ ద్వారా పొందిన వివరాల ప్రకారం ఎనిమిదేండ్లలో సాగర ఉప్పర కార్పొరేషన్‌ 29.84 కోట్లు కేటాయిస్తే, అందులో ఖర్చు చేసింది 4.43 కోట్లు మాత్రమే. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆ సామాజిక వర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ నిర్వాకం వల్ల ఆ సామాజిక వర్గం బుక్కెడు బువ్వ కోసం కాంట్రక్టర్ల కింద కూలీలుగా నలిగిపోతూ, బతుకును బుగ్గి చేసుకుంటున్నది. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు వాల్మీకి బోయ కార్పొరేషన్‌‌కి రూ.30.46 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసింది రూ.5.98 కోట్లు మాత్రమే.


రజక సహకార సంఘాల సమాఖ్యకు ఈ ఎనిమిదేళ్లలో 56,850 మంది ఋణాల కోసం దరఖాస్తు చేసుకుంటే, కేవలం 5,720 మందికి చాలీచాలని ఋణాలు ఇచ్చారు. ఈ ఎనిమిదేండ్లలో రజకుల కోసం మొత్తం రూ.551 కోట్లు కేటాయిస్తే, ఖర్చుపెట్టింది అక్షరాల అరవై కోట్లే. నేతన్నలకు 50శాతం సబ్సిడీపై నూలు, 5లక్షల బీమా, హెల్త్‌ కార్డులిస్తమని చెప్పినా, ఏవీ అమలు కావడం లేదు. ఇన్నాళ్లు తిప్పలు పెట్టి, తీరా ఇయ్యాళ ఎన్నికల ముందు బీమా ఇస్తమని మొసలి కన్నీరు కారుస్తున్నరు. టీఆర్‌ఎస్‌ అసమర్థ పాలన వల్ల  తెలంగాణ వచ్చినప్పుడు 470 సహకార సంఘాలు ఉంటే, అవిప్పుడు 220కి తగ్గినయ్‌.


విశ్వబ్రాహ్మిణ్ కార్పొరేషన్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఎనిమిదేండ్లలో వారికి కేటాయించిన బడ్జెట్‌ రూ.86కోట్లు కాగా, ఖర్చు చేసింది కేవలం రూ.26.94కోట్లు. ఇక, గత మూడు బడ్జెట్‌లలో విశ్వబ్రాహ్మణులకు శూన్య హస్తమే చూపించారు. కుమ్మరి శాలివాహన కార్పొరేషన్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం గత ఎనిమిదేండ్లలో వారికి కేటాయించిన బడ్జెట్‌ రూ.55 కోట్లయితే, ఖర్చు చేసింది రూ.12 కోట్లు. ఆర్టీఐ ద్వారా భట్రాజ కార్పొరేషన్‌ పంపించిన సమాచారం ప్రకారం గత ఎనిమిదేండ్లలో భట్రాజ సామాజిక వర్గానికి కేటాయించిన బడ్జెట్‌ రూ.13.30కోట్లు కాగా, అందులో రూ.95లక్షలు ఖర్చు చేయడం సిగ్గుచేటు.


నేడు పాదయాత్రలో బీసీ వర్గాల గోసను నేను స్వయంగా చూస్తున్నా. కాయకష్టం చేసుకొని బతికే వారి జీవితం దినదిన గండంగా తయారైంది. వాళ్ల వృత్తులు నాశనమవుతున్నాయి. కాబట్టి, వారు ప్రత్యామ్నాయ జీవన ఉపాధి అవకాశాలు పొందేలా, ‘బీసీ బంధు’ ప్రకటించి, కేసీఆర్‌ తను బీసీలకు చేసిన మోసాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.


రాజ్యాధికారం తన కుటుంబం గుప్పెట్లో పెట్టుకొని బీసీలను రాజకీయంగా కూడా అణచివేస్తున్నరు. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు తెలంగాణ అసెంబ్లీలో కేవలం 22మందే  సభ్యులు ఉన్నరు. అందులో ముగ్గురికే మంత్రి పదవులు! స్థానిక సంస్థల్లో బీసీలకు ఉండాల్సిన 33శాతం రిజర్వేషన్లను కూడా టీఆర్‌ఎస్‌ 15శాతానికి తగ్గించడం, బీసీల బలాన్ని తగ్గించే కుట్ర కాదా?


బీజేపీలో ఇలాంటి కుటుంబ రాజకీయాలు నడవవు. బీసీ అయిన నరేంద్ర మోదీని రెండుసార్లు ప్రధానమంత్రి చేయడం ద్వారా, ఆ ప్రధానమంత్రి నలభైశాతం బీసీలతో మంత్రివర్గం ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఉన్న బీసీల్లో ఆత్మవిశ్వాసం నింపిన పార్టీ బీజేపీ. రేపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, బీజేపీ అన్ని వర్గాలకు సమానంగా రాజ్యాధికారాన్ని పంచుతుంది. కేసీఆర్‌ కుటుంబం అధికారంలో ఉన్నంత వరకూ మాత్రం బీసీల స్థితిగతులు మారవు.  


బండి సంజయ్‌ కుమార్‌

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2022-08-19T09:36:08+05:30 IST