బతుకమ్మ పాట సంస్కృతి గిది కాదు

ABN , First Publish Date - 2022-09-29T06:04:37+05:30 IST

తెలంగాణ బతుకమ్మ పాట ఇలా ఎందుకయ్యింది? తెలంగాణ కన్నీటి కావ్యం, తెలంగాణ బతుకు గాథే బతుకమ్మ పాట. బతుకును దేవతలా కొలిచే పాట..

బతుకమ్మ పాట సంస్కృతి గిది కాదు

తెలంగాణ బతుకమ్మ పాట ఇలా ఎందుకయ్యింది? తెలంగాణ కన్నీటి కావ్యం, తెలంగాణ బతుకు గాథే బతుకమ్మ పాట. బతుకును దేవతలా కొలిచే పాట. కాని, బతుకమ్మ పాట నేడు డిస్కో పాట అయ్యింది. తెలంగాణ సంప్రదాయం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ. కాని సంప్రదాయ కళ తప్పి, కృత్రిమ పోకడలను ఎందుకుపోతున్నది? సహజత్వాన్ని కోల్పోతున్న తీరుకు కారణం ఎవరు? టీవీ వాళ్ల కోసమా బతుకమ్మ బాణీలను మారుస్తున్నది? సహజత్వాన్ని చెడ గొడుతున్నది ఎవరు? బతుకమ్మ పాట అంటే రేలా రేలా అంటూ అల్లిన పాట కాదు కదా! ఎగురుడు, దుంకుడు పాట కాదు కదా! సభ్యత, సంస్కృతిని మరచిపోయి పాడే పాట కాదు కదా! బతుకమ్మ పాటలు, బాణీలు జనుల నోళ్ళ లోంచి శతాబ్దాలుగా బతికి వచ్చినవి, వివిధ సామాజిక అంశాలతో నిండి ఉన్నవేకదా! తెలంగాణ బతుకులోని కష్టాలు కన్నీళ్లే బతుకమ్మ పాటలు! ఆ కష్టాలకు, కన్నీళ్లకు ఊరడింపే బతుకమ్మ ఆట, పాట! నాడు నా తెలంగాణ ఆడబిడ్డలను రజాకార్లు బరిబాత బతుకమ్మలు ఆడించిండ్రు అని తెలిసి ఏ బతుకు గీతం పాడుకుందాం? ఆనాటి గోసను ఎవరితో చెప్పుకుందాం? బతుకమ్మ డిజె మోతతో కలిసి రంగురంగుల సింగిడీలు ఎందుకు పోతున్నది? బతుకమ్మ పాటల్లో జాతి, సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పే రామాయణ, భారత, భాగవత కథలు, సతీ ధర్మాలు, కుటుంబ జీవనం మొదలుకొని, ఉమ్మడి కుటుంబ ప్రయోజనాలు, ఆరోగ్య సూత్రాలు, వివిధ సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయి లోతుగా గమనించి చూస్తే. ఈతి బాధలచ్చినా, కరువు కాటకాలు వచ్చినా మూసికి వరదలచ్చినా, రఘనాథపల్లి రైలు బ్రడ్జి కూలిపోయినా, రజాకార్ల, దొరల, దేశముఖ్‌ల కబంధ హస్తాల్లో బతుకులెన్నో నలిగిపోయినా, తల్లుల మాన ప్రాణాలు మంటగలిసిపోయినా, వలసవాద పాలనలో తల్లడిల్లిపోయినా ఆ కన్నీటి గాథలన్నీ బతుకమ్మ పాటలై వచ్చినయి. ప్రజలు కష్టాల కథలు చెప్పుకున్నరు, వెతలు వెళ్లబోసుకున్నరు, బతుకును దేవత చేసి కొలిచిండ్రు నాడు. బతుకమ్మ కరుణ రసాత్మకమైన పాట, ఆర్ద్రతతో నిండిన పాట. సంప్రదాయం, సంస్కృతిని నిలబెట్టే ఈ పండుగ తన విలువనెందుకు పోగొట్టుకుంటున్నది. బతుకమ్మ సంస్కృతిని కాపాడుకుందాం, బతుకులో వెలుగును నింపుకుందం. బతుకమ్మకు దాదాపుగా యెనిమిది వందల ఏండ్ల చరిత్ర ఉంటది. అది శతాబ్దాలుగా ప్రజల నోళ్లల్లో, లోగిళ్లలో బతుకుతూ వచ్చింది. సామూహిక గీతంగా వర్ధిల్లుతూ వచ్చింది. ప్రచారాల కోసం, ఆర్భాటాల కోసం అర్రులు చాచలేదు. ఎనుకట దొరల, దేశ్‌ముఖ్‌ల గడీల ముందు బతుకమ్మలను పెట్టించి ఆడబిడ్డలు ఆడుతుంటే వాళ్ల అందాలను ఆస్వాదించే దుష్ట సంస్కృతిని జ్ఞాపకం చేసుకుందామా మళ్లీ నేడు? ఆశ్చర్యం మొగవాళ్లు కూడా బతుకమ్మలు ఆడుతున్నరు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఆడుతున్నరు. కుర్చీలు వేసుకొని బతుకమ్మలను వీక్షిస్తున్నరు. బతుకమ్మను బంధించకండి, స్వేచ్ఛను పోగొట్టకండి, ఆడబిడ్డలను స్వేచ్ఛగా, సహజంగా ఆడుకోనీయండి. ఉత్తర భారతదేశ కోలాటం వేరు, దాండియా వేరు, బతుకమ్మ వేరు. బతుకమ్మ తెలంగాణలో స్వేచ్ఛగా ఆడుకునే స్త్రీల పండుగ, పూల పండుగ, ప్రకృతి పండుగ. బతుకమ్మను స్వేచ్ఛగా బతుకనిద్దం, నేటికీ, ఎప్పటికీ.

– సబ్బని లక్ష్మీనారాయణ

Read more