కీచురాయి

ABN , First Publish Date - 2022-03-21T07:15:10+05:30 IST

ఈ మొఖంతో కాలు బైట పెడితే అడుగు అడుక్కి గవాయిని వెతుక్కోవాల్సిందే..

కీచురాయి

ఈ మొఖంతో కాలు బైట పెడితే

అడుగు అడుక్కి గవాయిని వెతుక్కోవాల్సిందే

కీసలనిండా వొదిగిన ఉత్తచేతులే తొవ్వ పొంట వంగివంగి సలామ్‌ కొడుతయి

పాపం ఒక్కత్తే చీకటి ఎంత కాలమని కీచురాయికి కాపలాగాత్తది?

నాలుగు గింజలు విసిరి పిట్టల కువకువల్ని వినాలనుకున్న చెట్టును 

కాళ్ల కింది భూకంపం ఓ రోకు నిస్సహాయంగా పడదోస్తుంది

పులిచారలు గీసుకునో

తోడేలు మొఖం తొడుక్కునో

పూటకో వేషం అప్పడిగి 

గర్జించో  గాండ్రించో గాసం సంపాయించడం అలవాటయ్యాక..

ఉలిక్కిపడని ఒక్క రాత్రినైనా వరం అడగాలనుంటుంది

దేన్నీ ఏమార్చలేం

ఏ మొఖంతో ఇంటికి చేరుకుంటామో 

అద్దం ముందు నిలబడ్డంక గానీ 

పోల్చుకోలేనితనం వెక్కిరిస్తుంది

ఈరోజుకైతే నన్నెవరూ గుర్తుపట్టలేదు

నిజానికి ఏ రోజూ గుర్తుపట్టే అవసరముండదు


బండారి రాజ్‌ కుమార్‌

89195 56560

Updated Date - 2022-03-21T07:15:10+05:30 IST