ప్రవీణ్ బాటలో బహుజనోద్యమం

ABN , First Publish Date - 2022-03-05T06:51:06+05:30 IST

మన ప్రధానమంత్రులలో ఒక్క మన్మోహన్‌ సింగ్‌ మినహా మిగతా వారందరూ అగ్రవర్ణాల వారే. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ అగ్రవర్ణాల వారే కావడం యాదృచ్ఛికమేమీ కాదు. ఈ వాస్తవాలను గ్రహించిన బహుజన మేధావులు క్రమంగా మేల్కొన్నారు....

ప్రవీణ్ బాటలో బహుజనోద్యమం

మన ప్రధానమంత్రులలో ఒక్క మన్మోహన్‌ సింగ్‌ మినహా మిగతా వారందరూ అగ్రవర్ణాల వారే. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ అగ్రవర్ణాల వారే కావడం యాదృచ్ఛికమేమీ కాదు. ఈ వాస్తవాలను గ్రహించిన బహుజన మేధావులు క్రమంగా మేల్కొన్నారు.


కాన్షీరామ్‌ నాయకత్వంలో యూపీ మోడల్‌ పాలన తెలంగాణ లోనూ సాధ్యమేనన్న ఆశ వారిలో చిగురించింది. అయితే, అనేక రాజకీయ పరిణామాల మధ్య నాయకత్వ అలసత్వం ఆ కలను కలగానే మిగిల్చింది. దీనికి తోడు యూపీలో నాలుగు సార్లు అధికారాన్ని సంపాదించిన బీఎస్పీ ఆ తరువాత అధికారాన్ని కోల్పోవడం కూడా తెలుగు సమాజపు బహుజనోద్యమంపై పడింది. మళ్లీ నెమ్మదిగా కోలుకొని నిలబడుతుందని ఆశిస్తున్న సమయంలో కాన్షీరామ్‌ అకాల మరణం ఈ దేశ బహుజనులకు ఊహించని షాక్‌ను కలిగించింది. కొంతకాలం వరకు నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. అవకాశవాదులు బీఎస్పీని వీడి తమ దారి తాము చూసుకున్నారు. దీంతో ఒక స్తబ్ధత బహుజనోద్యమంలో అనివార్యంగా నెలకొంది. 


అంబేడ్కర్‌ సంఘాలు బహుజనులను రాజకీయంగా ఏకం చేయలేకపోయాయి. ఈ లోటును పూడ్చడానికి మళ్లీ ఒక నాయకుడు అవసరమయ్యాడు. దేశవ్యాప్తంగా కాకపోయినా తెలంగాణ రాష్ట్రం వరకైనా నూటికి 93 శాతంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీలకు కాన్షీరామ్‌లా ఆశాజనకమైన నాయకత్వం అవసరమైంది. ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన నాయకుడే డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. 


తాను ఒక ఐపీఎస్‌ అధికారి అయ్యి ఉండి మొదటి నుంచీ ప్రజాసేవకు ప్రాధాన్యమిచ్చిన వాడు ప్రవీణ్ కుమార్. తనను ఈ దేశానికి అందించిన గురుకులాల్లో వెలుగులు నింపడానికి ఆయన అంకితమయ్యాడు. దీంతో గురుకులాల చరిత్ర ప్రవీణ్‌ కుమార్‌కు ముందు, తరువాతలా రూపుదిద్దుకుంది. సమస్యల నిలయంగా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలను తొమ్మిది సంవత్సరాల పాటు ఓ వెలుగు వెలిగించాడు. గురుకులాల పిల్లలను వందలాదిమందిని డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దాడు. యావత్‌ దేశమే తలతిప్పి చూసేలా చేశాడు. కడుపేద బీద బిడ్డలు ఖండాంతరాలు దాటి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా శ్రమించాడు. మరోవైపు స్వేరోస్‌ నెట్‌ వర్క్‌ స్థాపించి బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయమైన పే బ్యాక్‌ టు ది సొసైటీ నినాదాన్ని ఆచరించి చూపాడు. వందలాదిమంది నాయకత్వాన్ని తయారు చేశాడు. అవమానాలు పడిన చోటే ఆత్మగౌరవంతో జీవించడం నేర్పించాడు. 


సమాజం అర్థం కావాలంటే అద్దాల కార్లు, ఏసీ బంగ్లాలు దాటి నేల మీదికి రావాలి. ఆ సమాజాన్ని అట్లా ప్రజల్లోకి వెళ్లి చూశాడు ప్రవీణ్‌ కుమార్‌. నూటికి తొంభై శాతంగా ఉన్న బహుజనుల జీవితాలు ఎందుకు డెభై ఐదేండ్లుగా మారలేదో అధ్యయనం చేశాడు. సకల సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారంలోనే ఉందని గ్రహించాడు. అందుకే బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరాడు. ఏ నల్లగొండ గడ్డ మీది నుంచైతే మాన్యుడు కాన్షీరామ్‌ బహుజనులకు దిశానిర్దేశం చేశాడో... అక్కడి నుంచే ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ‘ఇప్పటిదాకా ఒక అధికారిగా నేను పని చేసింది ఒక్క శాతం మాత్రమే, నేను ఇంకా చేయాల్సింది తొంభై తొమ్మిది శాతం ఉందని’ తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు. 


ప్రవీణ్‌ కుమార్‌ రాకతో తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అనేది కూడా కీలకాంశంగా మారింది. అప్పటి వరకు కేవలం అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాత్రమే పోటీ ఉంది. కానీ, ప్రవీణ్‌ కుమార్‌ రాకతో ఇది బద్దలయింది. తెలంగాణ రాజకీయాల్లో వాతావరణం మారింది. త్రిముఖ పోటీ దశ నుంచి మరింత విస్తృతమై కాంగ్రెస్‌లాంటి పార్టీలు సైతం తమ వేగం పెంచుకునే పరిస్థితి ఏర్పడింది. బహుజనుల్లో మాత్రం మళ్లీ కాన్షీరామ్‌ కాలం నాటి ఆత్మవిశ్వాసం వెల్లివిరిసింది. 


ప్రవీణ్ కుమార్‌ బీఎస్పీలో చేరిన ఈ ఆరునెలల్లో తెలంగాణ అంతటా బహుజన రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేసియార్‌ పట్ల ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ప్రవీణ్‌ కుమార్‌ స్పీడ్‌ను గమనించి రకరకాల యాత్రలు చేశాయి. అయితే, వాటి లక్ష్యం మళ్లీ అగ్రవర్ణ పాలనను పదిలం చేసుకోవడమే. ప్రవీణ్‌ కుమార్‌ మాత్రం బహుజనుల జీవితాలను సమూలంగా మార్చాలన్న సంకల్పంతో ముందుకు కదిలాడు. యువతను కదిలించగలిగాడు. తెలంగాణ జనాభాలో సామాజికంగా బలమైన సమూహమైన బీసీలను బీఎస్పీకి చేరువ చేసే ప్రయత్నం చేశాడు. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల సిరిసిల్లలో అర్ధరాత్రి వరకు కూడా వందలాదిమంది ప్రవీణ్‌ కుమార్‌ రాకకోసం ఎదురుచూడడం పెరుగుతున్న బహుజనోద్యమ విస్తృతికి నిదర్శనం. ప్రజల పక్షం వహిస్తూ నిత్యం ప్రజాసమస్యలపై స్పందిస్తూ తెలంగాణ ముప్పయిమూడు జిల్లాలూ పర్యటించాడు. ఈ రకంగా కాన్షీరామ్‌ కాలం నాటి చైతన్యం మరోసారి పురివిప్పడానికి ఆర్‌ఎస్పీ ఆధారంగా నిలిచాడన్నది బహుజన శ్రేణుల సునిశ్చిత అభిప్రాయం. 


ఇప్పటికే రెండు సార్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సైతం ప్రస్తుతం ఎన్నికల వ్యూహరచనలో పడింది. కుటుంబ పాలనను చేజార్చుకోకూడదనుకున్న కేసియార్‌ కొత్తకొత్త ఎత్తులు వేస్తూ ప్రశాంత్‌ కిషోర్‌ వంటి వారిని రంగంలోకి దించాడు. ఈ పరిణామాలు కేసియార్‌లోని అభద్రతను సూచిస్తున్నాయి. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని తీరుపట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొని ఉంది. రైతులు, ఇలాంటి సమయంలో బీఎస్పీ పార్టీ ముఖ్య సమన్వయకర్త డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ బహుజన రాజ్యాధికార యాత్రకు సిద్ధం కావడం తెలంగాణ బహుజనోద్యమ చరిత్రలో కీలకంగా మారనుంది.


రాజకీయం సంపన్న కులాల జన్మహక్కు కాదని నిరూపిస్తూ కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా చేయాలని ప్రతినబూనడం, ఆనాటి సర్వాయి పాపన్న గౌడ్‌ పోరాటతత్వాన్ని, ఆత్మగౌరవ పంథాని అందిపుచ్చుకోవడమే. ఇంకా ఉన్న ఆరున్నరేళ్ల ఐపీఎస్‌ సర్వీస్‌ను తృణప్రాయంగా త్యాగం చేసి వచ్చిన ప్రవీణ్‌ కుమార్‌ను ఆదరించి, అండగా నిలవాల్సిన బాధ్యత బహుజన కులాల ముందున్నది.

 డా. పసునూరి రవీందర్‌

(రేపు జనగామ జిల్లా ఖిలాషాపురంలో ప్రవీణ్‌ కుమార్‌ 

నేతృత్వంలో ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ ప్రారంభం)

Updated Date - 2022-03-05T06:51:06+05:30 IST