అవర్ణావరణం

ABN , First Publish Date - 2022-01-10T05:39:03+05:30 IST

నీ చేతుల కంటిన సీతాకోక చిలుకల రంగే మెరుస్తోంది కలల్లోనూ పరుగులు తీసే కాలం కాళ్ళలోనూ...

అవర్ణావరణం

నీ చేతుల కంటిన

సీతాకోక చిలుకల రంగే

మెరుస్తోంది కలల్లోనూ

పరుగులు తీసే కాలం కాళ్ళలోనూ.


వెన్నెలొక్కటే కురుస్తుంది

నీ కనులపైనా నాగుండెల్లోనూ

ఒకే వర్షం కురుస్తుంది 

నా కనుల్లోనూ నీ గుండెల పైనా


నీ పాదాలు ప్రవేశించిన ద్వారాల్లో 

పారాణి స్వరాలు పారాడుతున్నాయి 

సుగంధ దరహాస ధ్వనులీ

గాలుల్లోనే తిరుగాడుతున్నాయి


నీవైన అలికిడులీ ఆవరణలోనే 

నడిఝాము నిశావర్ణంలో

దోబూచులాడుతున్నాయి


యుగ కాలాల లోతులలో 

వెతుకులాడుతాను

యావజ్జీవితమూ నిను నా

రెండంటే రెండు నేత్రాలతో


కాలవృక్షం 

నీలో కొమ్మలెన్ని తొడిగిందో

ఆ లేత చివురు మోమే 

మిగిలి ఉంది నాలో


నిత్య వేదనావృత హృదయం

కవితాక్షతాలను స్రవిస్తుంది కానీ,


మూసిన కనురెప్పల

దిగువన దిగులు

చప్పుళ్ళను చప్పిళించే దెవరు.

బడుగు భాస్కర్‌ జోగేష్‌

98666 02325


Updated Date - 2022-01-10T05:39:03+05:30 IST