‘ఆర్యుల దండయాత్ర’ ఓ కట్టుకథ, కుట్ర కథ!

ABN , First Publish Date - 2022-10-02T06:47:45+05:30 IST

ఆర్యులు భారతదేశంలో అనాదిగా నివసిస్తున్న ప్రజలు కాదని, పచ్చికబయళ్లను వెదుక్కొంటూ, పశువుల మందలను తోలుకొంటూ 2500 సంవత్సరాల కిందట బయట నుంచి వచ్చిన దేశదిమ్మరులని...

‘ఆర్యుల దండయాత్ర’ ఓ కట్టుకథ, కుట్ర కథ!

ఆర్యులు భారతదేశంలో అనాదిగా నివసిస్తున్న ప్రజలు కాదని, పచ్చికబయళ్లను వెదుక్కొంటూ, పశువుల మందలను తోలుకొంటూ 2500 సంవత్సరాల కిందట బయట నుంచి వచ్చిన దేశదిమ్మరులని, వాయవ్య సరిహద్దు దాటుకొని దండెత్తి వచ్చి అప్పటికే బాగా అభివృద్ధి చెందిన సింధూనాగరికతను ధ్వంసం చేసి క్రమంగా దేశమంతా విస్తరించారనే ఒక వికృత సిద్ధాంతాన్ని యూరోపియన్లు చరిత్ర గ్రంథాల్లో ఎక్కించారు. ప్లాసీ యుద్ధం తర్వాత, అనగా ప్రత్యక్ష బ్రిటిష్‌ పాలన ప్రారంభమైన తర్వాత ఈ చరిత్ర వక్రీకరణ ప్రారంభమైంది. ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ మాక్స్‌ముల్లర్‌ 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో వేదాలను, ఉపనిషత్తులను ఇంగ్లీషులోకి అనువదించాడు. ఆర్యుల తొలి సాహిత్యాన్ని తాను కాచి వడబోశాననే నమ్మకాన్ని కలుగజేసి, వేదాలనే రుజువులుగా చూపి ఆర్యులు మధ్యాసియాలోని సమర్‌ఖండ్‌ నుంచి వలస వచ్చారని సిద్ధాంతీకరించాడు. అప్పటి నుంచి ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి మేధావులు భాషాశాస్త్రము, పురావస్తుశాస్త్రము, మానవలక్షణ శాస్త్రము, జన్యు శాస్త్రము, పర్యావరణ శాస్త్రములలో ఆధారాల కోసం అన్వేషిస్తూ ఇదే సిద్ధాంతాన్ని రకరకాల మలుపులు తిప్పారు. కొందరు ఉత్తర ధృవం నుంచి వలస వచ్చారన్నారు. తూర్పు యూరపులోని హంగెరీ ప్రాంతం (స్పెప్పె) అని మరికొందరు వాదించారు. కాదు బాల్టిక్‌ తీరంలోని లిథువానియా అనే మరుగుజ్జు దేశం అని మరికొందరు స్కాలర్లు సిద్ధాంత గ్రంథాలు రూపొందించారు. వేర్వేరు సిద్ధాంతాలైనా వీటన్నిటికీ ఈ క్రింది తర్కమే మూలాధారం:


1. సంస్కృత పదాలకు, యూరోపియన్‌ భాషల పదాలకు మధ్య సారూప్యత ఉంది. 2. వేదాల్లో ఆర్యులు ప్రస్తావించిన వృక్ష, జంతు, పక్షి జాతులు తూర్పు యూరపుకు సంబంధించినవి. 3. అనాదిగా సింధూలోయలో ఉంటున్న మూలవాసులు పరిణితికి చెందిన నాగరికతను రూపొందించుకొన్నారు. ఆర్యుల తండాలు ఆ నాగరికతను ధ్వంసం చేశాయి.


భారతీయ పండితులు అనేకమంది ఈ వాదనలను తిప్పికొట్టారు. యం.యం. గంగాధర ఝా ఆర్యుల తొలినివాసం ‘బ్రహ్మర్షిదేశం’గా నిర్ధారించాడు. డి.యన్‌. త్రివేద ముల్తాన్‌ సమీపంలోని దేవికా నదీ ప్రాంతమని సూచించాడు. యల్‌.డి. కల్లా కాశ్మీర్‌, హిమాలయ ప్రాంతం అని పేర్కొన్నాడు. యన్‌.ఆర్‌. వరాడ్‌పాండే (ఆక్స్‌ఫర్డ్‌ పట్టభద్రుడు) యూరోపియన్‌ స్కాలర్ల వాదనలన్నిటినీ తోసిపుచ్చుతూ కూలంకషంగా, సమగ్రంగా తన ‘ఆర్యన్‌ ఇన్వేషన్‌ ఎ మిత్‌’ గ్రంథంలో సమాధానం ఇచ్చాడు.


పైన పేర్కొన్న మూడు తర్కాల్లో భాషా సారూప్యాల అంశమే అత్యంత ప్రధానమైనది. ఈ సందర్భంలో రెండంశాలు ముఖ్యంగా ప్రస్తావించబడుతున్నాయి. 1. సంస్కృతం, యూరోపియన్‌ భాషల పదమూలాల (ధాతువుల) మధ్య సారూప్యత ఉంది. ఇది ధ్వని ప్రధానమైనది. ఈ భాషల్లో ధాతువుల నుంచి నామవాచకాలను, క్రియలను రూపొందించే పద్ధతి కూడా ఒక్కటే. 2. కుటుంబపరమైన బాంధవ్యాలను సూచించే ‘అమ్మ’, ‘అన్న’, వంటి పదాల విషయంలోనూ సాధారణ అంకెల విషయంలోనూ ఎంతో సారూప్యత ఉంది.


ఉదాహరణకు అమ్మను సంస్కృతంలో ‘మా’ అనగా, ఇంగ్లీషులో ‘మదర్‌’, ఫ్రెంచ్‌లో ‘మెరె’, జర్మన్‌లో ‘మట్టర్‌’ అంటారు. మకారం మీద ఆధారపడిన ధ్వని రూపాలివి. సంస్కృతంలో మూడును ‘త్రయ’ అనగా, ఇంగ్లీషులో ‘త్రి’, ఫ్రెంచ్‌లో ‘ట్రయస్‌’, జర్మన్‌లో ‘ట్రయి’ అంటారు.


ఏ భాషకైనా మూడు పార్శ్వాలుంటాయి. పదజాలం, వ్యాకరణం, లిపి. భారతీయ భాషలకు లిపి తప్ప మిగిలిన రెండు పార్శ్వాలు ఒక్కటే. అందుకే బెంగాలీ మాట్లాడేవారు తెలుగును, తెలుగు మాట్లాడేవారు బెంగాలీని సులభంగా సంభాషించడం ద్వారా నేర్చుకోగలుగుతున్నారు. రాయలేకపోవచ్చు. చాలా భారతీయ భాషల ‘లిపి’ల మధ్య కూడా సారూప్యత ఉంది కానీ మాట్లాడగలరు. ఇదేవిధంగా తెలుగు మాట్లాడేవారు ఫ్రెంచ్‌ని, ఫ్రెంచ్‌ మాట్లాడేవారు తెలుగును నేర్చుకోలేరు.


ధ్వనులను (శబ్ద ఉచ్చారణలను) వ్యక్తం చేయడానికి సంస్కృతం, ఇతర భారతీయ భాషల్లో (తమిళం తప్ప) 56అక్షరాలను ఉపయోగిస్తారు. యూరోపియన్‌ భాషల్లో కేవలం 26 అక్షరాలతోనే అన్ని శబ్దాల ఉచ్చారణలను వ్యక్తం చేస్తారు. లిపి విషయంలో యూరోపియన్‌ భాషలకు, సంస్కృతానికి ఏరకమైన సారూప్యత లేదు.


సంస్కృతానికి యూరోపియన్‌ భాషలకు మధ్య వ్యాకరణాలకు సంబంధించిన విషయంలో కూడా ఏరకమైన సారూప్యం లేదు. వ్యాకరణాలు పూర్తిగా భిన్నమైనవి. కొన్ని సర్వనామాల విషయంలో ధ్వని సారూప్యత ఉన్నంతమాత్రాన సంస్కృత, లిథువానియన్‌ మొదలగు యూరోపియన్‌ భాషల మూలాలు ఒకటే అని చెప్పడం సాధ్యం కాదు. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఒక భాషలోని పదాలు మరొక భాషలోకి చేరుతుంటాయి. గ్రీకు భాష పుట్టడానికన్న కొన్ని వేల యేండ్ల ముందే సంస్కృతం పరిణితి చెందిన భాషగా రూపొందింది. అందుచేత సంస్కృత పదాలు కొన్ని గ్రీకు భాషలోకి, గ్రీకు భాష ద్వారా ఇతర యూరోపియన్‌ భాషల్లోకి చేరడం సహజమే.


ప్రాచీన మెసపటోమియాకు చెందిన హిట్టైట్‌ భాష 1500 పూ.సా.శ నాటిదని ఆ భాషలోని శాసనాలను బట్టి చరిత్రకారులు నిర్ధారించారు. అప్పటికే వేదనాగరికత ఉన్నత దశకు చేరుకుని ఉంది. సంస్కృతం హిట్టైట్‌ భాషలో నుంచి ఆవిర్భవించడం హాస్యాస్పదం. హిట్టైట్‌ శాసనాలలోనే ఋగ్వేద దేవతలను పోలిన (మిత్ర, వరుణ, ఇంద్ర) పేర్లున్నాయి.


వలసపోయినవారు తమ పూర్వీకుల సీమలను అంత సులభంగా మర్చిపోరు. పర్షియాను ఇస్లాం ఆక్రమించుకోగా, మతం మారడానికి ఇష్టపడని పార్శీలు భారత్‌కు వలసవచ్చారు. వారు వెయ్యేండ్లుగా పర్షియాను (నేటి ఇరాన్‌) మర్చిపోలేదు. ప్రాచీన ఈజిప్షియన్లు, ఫోనీసియన్లు తమ పూర్వీకుల ప్రదేశాలను సరిగ్గా గుర్తించలేకపోయినా, శతాబ్దాల పాటు వాటిని స్మరించుకుంటూనే వచ్చారు. యూదులు రెండువేల యేండ్లుగా ఇజ్రాయేల్‌ను మర్చిపోలేదు. వలసపోయినవారు తమ పూర్వనివాసస్థానాల పేర్లను కొత్తచోట పెట్టుకొంటుంటారు. న్యూ ఆర్లియన్సు, న్యూయార్క్‌, న్యూ ఇంగ్లాండ్‌, న్యూ సౌత్‌వేల్స్‌ పేర్లు అటువంటివే. ఆర్యులు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఉంటే, ఆ ప్రదేశాల పేర్లు ఏదో రూపంలో ప్రస్తావించి ఉండేవారు. ఋగ్వేదంలో ఒక్కచోట కూడా భారతదేశానికి వెలుపల ఉన్న ఒక్క నదిని కాని, పర్వతాన్ని కాని, పట్టణాన్ని కాని, సరస్సును కాని పేర్కొనలేదు. ఋగ్వేదంలోని పేర్లన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఇతర భాషలకు చెందిన పేరు ఒక్కటి కూడా వేదాల్లో లేదు.


ఋగ్వేదంలో ఎక్కడా పర్షియా ప్రస్తావన లేదు. కాని పర్షియన్ల అవెస్తా గ్రంథంలో సప్తసింధు ప్రస్తావన ఉంది. మైనాక పర్వతం, హైరవతి, హరయు నదుల ప్రస్తావనలున్నాయి. హిమాలయాల్లోని ఒక పర్వతం మైనాక. సరస్వతికి బదులు హైరవతి, సరయుకు బదులు హరయు అవెస్తాలో పేర్కొనబడ్డాయి.


శ్రీకంఠశాస్త్రి– యజ్ఞ దేవత సోముడి జన్మస్థానం గురించి అనుమానాలను నివృత్తి చేశాడు. ‘‘సంహితలు సంకలనం చెయ్యబడడానికి ముందే యజ్ఞాల కర్మకాండ ఏర్పడింది. అందుచేత సోముడి జన్మస్థానం ఉత్తర పంజాబ్‌లోని ముజవంత, లేక ముజవంత పర్వత ప్రాంతం. అక్కడే యజ్ఞకుండంలో బలియిచ్చే ఆచారం ప్రారంభమైంది’’ అని తార్కికంగా చూపించాడు.


గంగ నుంచి సింధూనది వరకు విస్తరించిన సప్తసింధు ప్రాంతమే తమ పూర్వీకుల నివాసస్థానమని ఋగ్వేదంలో ఆర్యులు పేర్కొన్నారు. సప్తసింధును ‘దేవ నిర్మితం’ అని ‘దేవకృతయోని’ అని కీర్తించారు. బయటి నుంచి వచ్చినవారు ఇక్కడి నదులను, పర్వతాలను అంతటి భక్తిశ్రద్ధలతో పూజించలేరు. ఇక్కడి భూమి పట్ల వారిలో మాతృభావన నిర్మాణం కాదు.


పరిణితికి చెందిన ఒక నాగరికత, ఒక విశిష్ట సంస్కృతి ఋగ్వేద సూక్తాలలో దర్శనమిస్తాయి. ఉపనిషత్తుల్లో ఉన్నత శిఖరాలకు చేరిన మేధోవికాసపు వెలుగులు కనిపిస్తాయి. ఖగోళశాస్త్రం వంటి సంక్లిష్ట భౌతిక విజ్ఞానశాస్త్రాలు కూడా వారు అభివృద్ధి చేసుకున్నారు. వలస వచ్చి, తాత్కాలిక నివాసాల్లో (గూడెంలలో) ఉండేవారు. ఇంతటి నాగరికతను రూపొందించుకొనడం, దాని వివరాలను గ్రంథస్తం చెయ్యడం సాధ్యమయ్యే పనికాదు. ఋగ్వేద భాషా పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకొన్నా తండాల్లో నివసించేవారు అలాంటి భాషను రూపొందించడం అసంభవం.


సంస్కృత సాహిత్యంలో ఎక్కడా ‘జాతి’ని సూచించడానికి ‘ఆర్య’ పదాన్ని ఉపయోగించలేదు. దాన్ని గుణవాచకంగానే వాడారు. సభ్యతగలవాడిని, ధర్మాన్ని అనుసరించేవాడిని ఆర్యుడని నిర్వచించారు. భార్య భర్తను ‘ఆర్య’ లేక ‘ఆర్యపుత్ర’ అని సంబోధించడం ఆచారంగా ఉండేది. భారతీయ భాషల్లో ఉత్తరాలు రాసుకునేటప్పుడు ‘ఆర్యా’ అని ప్రారంభించే ఆచారం నేటికీ ఆచరణలో ఉంది. యోగవాశిష్టం (శ్రీరామునికి వశిష్ట మహర్షి బోధించిన తత్త్వశాస్త్రం)లో ఆర్యుడెవరో నిర్వచించబడింది. ‘‘ఏది చెయ్యవలెనో అది చేసేవాడు, ఏది చెయ్యగూడదో అది చెయ్యనివాడు, వక్రమార్గంలో పోనివాడు ఆర్యుడు.’’


ఇటీవలి కాలంలో కొందరు పాశ్చాత్య విద్వాంసులు కూడా ‘ఆర్యుల దండయాత్ర’ సిద్ధాంతం అవాస్తవమని తోసిపుచ్చుతున్నారు. బ్రిటిషు చరిత్రకారుడు, జి.యర్దోసి ‘సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌’ జర్నల్‌లో ఒక పరిశోధనా వ్యాసం రాశాడు (1989). దానిలో ‘ఆర్య’ వాచకం జాతిని సూచించదని, వారిని నిందించడానికే ఈ ‘ఆర్యజాతి’ వాదాన్ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టాడు. ఆర్యులు భారత్‌పై దండెత్తి రాలేదని కూడా పేర్కొన్నాడు. కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన కె.ఎ.యఫ్‌. కెనడీ, ప్రముఖ ఆన్త్రపాలజిస్టు (మానవ లక్షణ శాస్త్రవేత్త) సరస్వతి–సింధు–నాగరికతకు సంబంధించిన స్థలాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన కొన్ని అస్థిపంజరాలపై పరిశోధనలు జరిపాడు. ఎలాంటి ఆయుధాల ప్రయోగం వల్ల తగిలిన గాయాల వల్ల వీరు చనిపోలేదని స్పష్టంగా చెపుతున్నాడు.


వేరే జాతికి చెందిన ఆర్యులు సింధూ లోయపై దాడి చేసి ఉంటే, శిథిలాల్లో బయటపడిన అస్థిపంజరాల్లో ఒక్కటైనా దాడిచేసిన వారిదై ఉండదా? దాడిలో ఒక్కడైనా ప్రాణాలు కోల్పోయి ఉండడా? వేరే జాతికి చెందిన అస్థిపంజరం ఒక్కటి కూడా తవ్వకాల్లో బయటపడలేదు.

యస్.వి.శేషగిరిరావు

ఇటీవల విడుదలైన ‘సంక్షిప్త భారతదేశ చరిత్ర–సంస్కృతి (వేదకాలం నుండి 1947 వరకు)’ పుస్తకంలోని 

ఒక భాగం ఇది.


ప్రచురణ: ఇతిహాస సంకలన సమితి (భారతీయ) తెలంగాణ, 

3–4–376/6/3, వసంత విహార్ కాలనీ, లింగంపల్లి, హైదరాబాద్–500027

వెల: రూ. 600

Read more