అభివృద్ధికి ఎన్నికలే కొలమానమా?

ABN , First Publish Date - 2022-10-07T05:57:48+05:30 IST

ప్రజల సమ్మతితో ఏర్పడిన ప్రభుత్వాలు నేడు ప్రజల కేంద్రంగా గాకుండా కొంతమంది వ్యక్తుల కేంద్రంగా, వ్యక్తిగత ఆకాంక్షల కోసం నడుస్తున్నాయి....

అభివృద్ధికి ఎన్నికలే కొలమానమా?

ప్రజల సమ్మతితో ఏర్పడిన ప్రభుత్వాలు నేడు ప్రజల కేంద్రంగా గాకుండా కొంతమంది వ్యక్తుల కేంద్రంగా, వ్యక్తిగత ఆకాంక్షల కోసం నడుస్తున్నాయి. నేడు వ్యక్తుల కోసమే ఎన్నికలు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక అటువంటిదే. సర్వసాధారణంగా ఉప ఎన్నికలు అభ్యర్థి మరణం వంటి అనూహ్యపరిస్థితుల్లో తప్ప రాకూడదు. 2018 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు నాలుగు ఉప ఎన్నికలు జరిగితే ఇందులో రెండు అక్కడి ప్రజాప్రతినిధులు మరణించినందువల్ల వచ్చినవే. కానీ, హుజూర్‌నగర్ ఉప ఎన్నిక మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం. ఎమ్మెల్యేగా ఉన్నవారిని రాజీనామా చేయించి ఎంపీ బరిలో నిలబెట్టడం కంటే, ఎంపీ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చి ఉంటే ఆ ఉప ఎన్నిక వచ్చేది కాదు, వందల కోట్ల ప్రజాధనం వృధా అయ్యేది కాదు. హుజురాబాద్ ఉప ఎన్నికకు కారణం అక్కడి ఎమ్మెల్యేకు కేసీఆర్‌కు మధ్య వచ్చిన వైరం. ఇది తన ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఎన్నిక తరుముకొచ్చింది. ఈ వరుసలో ఐదో ఉప ఎన్నిక మునుగోడు. ఇక్కడి ఎమ్మెల్యే తన రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరి, ఇదంతా మునుగోడు అభివృద్ధి కోసమే అంటున్నారు. మునుగోడుకంటే, ఇప్పటికే బిజెపి ఎమ్యేల్యేలున్న ప్రాంతాలలో అభివృద్ధి ఏమైనా ఏరులైపారుతున్నదా? మునుగోడు ఉపఎన్నిక ప్రజల కోరుకుంటేనో, వారి అభివృద్ధి కోసమో వచ్చింది కాదని అందరికీ తెలుసు. అక్కడి ప్రజలు మీ రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతదని పోరాటాలేమీ చెయ్యలేదు. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ రెండూ ప్రతిపక్ష పార్టీలే. కాంగ్రెస్‌లో ఉంటే జరగని అభివృద్ధి బిజెపిలోకి పోతే జరుగుతుందా? ఈటెల రాజేందర్ బిజెపి ఎమ్యేల్యే అయిన తర్వాత హుజురాబాద్‌లో ఏమైనా అదనంగా అభివృద్ధి జరిగిందా? హుజురాబాద్, దుబ్బాక ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి ఏమైనా అదనంగా నిధులు తీసుకొచ్చారా? 


ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలని రాజ్యాంగం చెబుతుంది. కానీ, ఆయారాం, గయారాం పద్ధతితో రాజకీయ పార్టీలు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాయి. ధనస్వామ్యానికి, అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాల నిర్మాణం ప్రజల హక్కు. పాలకపక్షం తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వివక్షత చూపుతున్నదని అడ్డగోలువాదనలతో కొంతమంది రాజకీయ టూరిస్టులు ప్రజలను మాయచేస్తున్నారు. రాజకీయపార్టీలు భూబకాసురులను ఎన్నికల్లో నిలబెట్టి వారు గెలిస్తేనే మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందంటూ ప్రజలను మోసగిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం మందబలం, ఆర్ధికబలంతో గ్రామాలపై పడి ప్రజల మధ్య విద్వేషాలు పెంచి నాయకులు లబ్ధి పొందుతున్నారు. నియమిత కాలం పూర్తి కాకుండానే ప్రభుత్వాలను అర్ధాంతరంగా రద్దు చేయడం, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం సరికాదు. ఈ రాజీనామాల వలన కలిగే నష్టాన్ని బుద్ధిజీవులు ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అభ్యర్థుల గుణగణాలకు, వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతుంది. ఆ దిశగా మునుగోడు ప్రజలు ఆలోచన చేయాలి. 

పందుల సైదులు

తెలంగాణ విద్యావంతుల వేదిక

Updated Date - 2022-10-07T05:57:48+05:30 IST