రాష్ట్ర సమైక్యతపై గొడ్డలి వేటు

ABN , First Publish Date - 2022-10-07T06:01:17+05:30 IST

అధికార బలంతో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు మూడు ప్రాంతాల్లో నాటుతున్న విష బీజాలు, చేస్తున్న అబద్ధపు ప్రచారం రాష్ట్ర సమైక్యతకు గొడ్డలి వేటుగా...

రాష్ట్ర సమైక్యతపై గొడ్డలి వేటు

అధికార బలంతో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు మూడు ప్రాంతాల్లో నాటుతున్న విష బీజాలు, చేస్తున్న అబద్ధపు ప్రచారం రాష్ట్ర సమైక్యతకు గొడ్డలి వేటుగా మారతాయన్న భయాందోళనలు మేధావులు, ఆలోచనాపరుల మెదళ్ళను దొలిచేస్తున్నాయి. తాను పట్టిన మూడు రాజధానుల పంతాన్ని  నెగ్గించుకునేందుకు ఏకంగా రాష్ట్ర రాజధాని అమరావతినే బలిపీఠంపై పెట్టారు. రాజధాని కొరకు భూములు ఇచ్చిన రైతులు 1020 రోజులు నుంచి ఉద్యమిస్తున్నా, అన్ని విపక్ష పార్టీలు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపినా, అత్యున్నత న్యాయస్థానం రాజధాని అమరావతి మార్పు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పినా వినేందుకు కానీ, సమీక్షించుకునేందుకు కానీ సి.యం. సిద్ధంగా లేరు. ఏ అర్ధరాత్రి కలగన్నారో ఏమో మంత్రులను కానీ, సిఆర్‌డిఏ ఒప్పందంలో ఉన్న రైతులతో కానీ, ప్రతిపక్ష పార్టీలతో కానీ సంప్రదింపులు చేయకుండా తనదైన ‘మూడు ముక్కల’ పంతాన్ని 2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి వికేంద్రీకరణ ముసుగు తొడిగారు. నాటి నుంచి రాష్ట్రం రగులుతూనే ఉంది. ఒక ప్రక్క భూములు ఇచ్చిన రైతులు రోడ్లపాలయ్యారు. రాజధాని లేకపోవటంతో ప్రజలు, మేధావులు కలత చెందారు. అమరావతిని ‘కల్లోలిత’ ప్రాంతం చేసి అల్లకల్లోలం చేశారు. ఇంత చేసినా అమరావతి ఉద్యమ బాలుడు ఆగలేదు. గత ఏడాది నవంబర్‌ ఒకటో తేదీ నుండి డిసెంబర్‌ 17వ తేదీ వరకు దాదాపు 450 కిలోమీటర్ల దూరం న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర నిర్వహిస్తే, ఏకైక రాజధాని అమరావతి నినాదానికి మూడు ప్రాంతాల ప్రజలు నీరాజనాలు పట్టారు. ఇప్పుడు మళ్ళీ, న్యాయస్థానాన్ని మాయచేసి, ‘మూడు ముక్కల’ ఆట తిరిగి మొదలుపెట్టడంతో, అమరావతి రైతులు మరోమారు అరసవల్లి వరకు రెండో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర ఎదిగితే తన పరిపాలన పగ్గాలు చేజారతాయోమోనని భయపడి మూడు ప్రాంతాల్లో విష బీజాలు నాటేందుకు జగన్ ఉపక్రమించారు. రౌండ్‌ టేబుల్‌ మీటింగులతో దుష్ప్రచారం వేగం చేశారు. పాదయాత్రను రెచ్చగొట్టేలా ‘ఎగరేసి నరుకుతాం’ అంటూ ఫ్లెక్సీలు కట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక ప్రాంతంపై మరో ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయించడం రాష్ట్రానికి క్షేమమా? అభివృద్ధిని అభివృద్ధిగా చూడటం, అన్ని ప్రాంతాలకు వెలుగు ప్రసరింపజేయడం ప్రభుత్వాల బాధ్యత కాదా? ఒక ప్రాంతంలో నిర్మించిన రాజధానిని, గత ప్రభుత్వం మూడేళ్ళు, ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్ళు పాలన జరిగాక విభజించి మరో రెండు ప్రాంతాలకు తరలిస్తామన్న వైఖరి రాష్ట్ర సమైక్యతకు గొడ్డలి వేటు. ఇలా అనుకుంటే, రాయలసీమలో కియా మోటార్స్‌ను, విశాఖ ఉక్కు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, రైల్వే జోన్‌ ఇలా అన్నీ వివాదాస్పదమే అవుతాయి. అమరావతిపై జగన్ రాజకీయాన్ని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు జిల్లాల మధ్యాంధ్రప్రదేశ్‌  ప్రజలు క్షమించరు. ఇప్పటికీ ప్రత్యేక రాయలసీమ స్వరం వినబడుతూనే ఉంది. దీనికి తోడు మధ్యాంధ్ర స్వరం కూడా గర్జిస్తే, విభజింపబడ్డ ఆంధ్రప్రదేశ్‌ మరిన్ని ముక్కలవుతుంది. అటువంటి పరిస్థితిని పాలకులు తీసుకురావడం సరికాదు. 

పోతుల బాలకోటయ్య

అమరావతి బహుజన జెఎసీ అధ్యక్షులు

Read more