వ్యవసాయ భూమిని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2022-12-31T01:08:10+05:30 IST

ఒకప్పుడు కేవలం నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు పల్లెలకు కూడా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి.

వ్యవసాయ భూమిని కాపాడుకోవాలి

ఒకప్పుడు కేవలం నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు పల్లెలకు కూడా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు ప్లాట్లుగా మారిపోతున్నది. పారిశ్రామిక అభివృద్ధి, ఇతర అభివృద్ధి పనుల కోసం వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిపోతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి, బీడు భూములుగా మారిపోతున్న భూముల వల్ల దేశ వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, వ్యవసాయేతర భూమిగా 22.23 లక్షల ఎకరాలు మారిపోయింది. గత పదేళ్లలో 11.95 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిందంటే ఎంత వేగంగా వ్యవసాయం తగ్గుతూ వస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక ధరలు పెట్టి వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తామని వస్తుండటంతో రైతులు భూములు అమ్మడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అద్భుతమైన పథకాల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు. పెట్టుబడిగా భావించి ఈ ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్లాట్లలో ఎక్కువ శాతం నిరుపయోగంగా ఉంటున్నాయి. హైదరాబాద్ సమీప జిల్లాల్లో ఈ పరిస్థితి అత్యధికంగా ఉన్నది. మరోవైపు వ్యవసాయంపై ఆధారపడి జీవించిన రైతులు, రైతుకూలీలు ఉపాధికి దూరమవుతున్నారు.

వ్యవసాయ భూములు తగ్గిపోవడాన్ని నిలువరించడానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని కఠిన నిబంధనలు విధించి, విజయవంతంగా అమలు చేస్తున్నాయి. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ భూములు కేవలం వ్యవసాయదారుడు మాత్రమే కొనుగోలు చేసేలా చట్టాలు ఉన్నాయి. కేరళలో పాడీ ఆండ్ వెట్‌ల్యాండ్ కన్సర్వేషన్ యాక్ట్–2008 ప్రకారం వ్యవసాయేతర అవసరాల కోసం గరిష్ఠంగా 10 ఎకరాల భూమిని మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ 10 ఎకరాల భూమిలోనూ నాలుగు ఎకరాలు మాత్రమే ఏదైనా నిర్మాణం చేపట్టాలి అని నిబంధనలు ఉన్నాయి. ఇటువంటి చట్టాలు మరింత మెరుగ్గా తీసుకువచ్చి వ్యవసాయ భూములు తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలి.

ఒక పరిమితిని విధించుకొని ఆ పరిమితిని దాటి వ్యవసాయ భూమి తగ్గకుండా చూడాలి. ఇష్టారాజ్యంగా భూములు లే అవుట్లుగా మారకుండా అవసరమైనంత వరకే అనుమతులు ఇవ్వాలి. ఏ అవసరం కోసం అయితే వ్యవసాయ భూమిని మార్చుకున్నారో ఆ పనిని పూర్తి చేసేందుకు కాల పరిమితి విధించాలి. ఉదాహరణకు ఎవరైనా ఒక పరిశ్రమ ఏర్పాటుకు వ్యవసాయ భూమిని మార్పు చేయించుకుంటే ఆ పరిశ్రమ ఏర్పాటుకు కాలపరిమితిని విధించాలి. కాలపరిమితిని దాటినా పరిశ్రమ స్థాపించకపోతే ఆ భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా మార్చేలా నిబంధనలు ఉండాలి, తద్వారా వ్యవసాయ భూములను రక్షించుకోగలుగుతాం.

– దండంరాజు రాంచందర్ రావు

Updated Date - 2022-12-31T01:08:11+05:30 IST