కఠిన నాయకులు కావాలా?

ABN , First Publish Date - 2022-03-05T06:26:59+05:30 IST

ఆదిత్యనాథ్ మళ్లీ యూపీ ముఖ్యమంత్రి కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్టు ఆయన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్లిష్ట కాలానికి ఆదిత్యనాథ్ వంటి ‘కఠిన’ నాయకుడు అవసరమని మోదీ భావిస్తున్నారు...

కఠిన నాయకులు కావాలా?

ఆదిత్యనాథ్ మళ్లీ యూపీ ముఖ్యమంత్రి కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్టు ఆయన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్లిష్ట కాలానికి ఆదిత్యనాథ్ వంటి ‘కఠిన’ నాయకుడు అవసరమని మోదీ భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ప్రజలు ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటారో నాకు తెలియదు. ఆ ఐదు రాష్ట్రాలలో ఏ ఒక్క దానిలోనైనా నాకు ఓటుహక్కు ఉంటే మృదుస్వభావి, వివేకశీలి అయిన నాయకుడికే నేను ఓటు వేస్తాను.


‘కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపాల్, శాపాల్ ’ ఎదురయినప్పుడు దృఢ మనస్కులు ఏం చేస్తారు? కఠినంగా వ్యవహరిస్తారు. కఠోర నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతికూల పరిస్థితులను సాధ్యమైనంతగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. చాలామందికి జీవిత పరిస్థితులు ఎంత గజిబిజిగా ఉంటాయో రాజ్య వ్యవహారాలు సంబంధిత బాధ్యులకు అంత సంక్లిష్టంగా ఉంటాయి. కఠిన నాయకులు మాత్రమే సమస్యలను పరిష్కరించగల సమర్థులనే అభిప్రాయం ఒకటి గట్టిగా ఉంది. ఇంతకూ ‘కఠిన’ అనే మాటలకు అర్థమేమిటి? భిన్న సందర్భాలలో భిన్న అర్థాలను స్ఫురింప చేసే పదమది. దృఢ వైఖరి, ఎటువంటి కష్టాలనైనా భరించగల నేర్పు, ఓర్పు, క్లిష్టత, మొండిగా వ్యవహరించడం మొదలైనవన్నీ ‘కఠినత్వం’ కిందకే వస్తాయి. అంతేకాదు కరకుతనం, కజ్జాకోరు, హింసాత్మక ప్రవృత్తితో ప్రవర్తించేవాడు మొదలైన అర్థాలు కూడా చెప్పదగినవే. మరి కఠిన నాయకులు అనేవారు దరిద్ర నారాయణులను నిజంగా ఆదుకుంటున్నారా? వారి బతుకుల బాగుకు అంకితమవుతున్నారా? 


సాధారణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న తరువాత పదవి నుంచి నిష్క్రమించేందుకు ఇష్టపడడు. పైగా ‘కఠిన’ నేతగా పరిణమిస్తాడు. ప్రజా కంటక పాలన చేయడం కద్దు. నేను పుట్టక ముందు అడాల్ఫ్ హిట్లర్ అటువంటి నాయకులలో అగ్రగణ్యుడు. బాల్య, కౌమారాల నుంచి యవ్వనంలోకి ఎదుగుతున్న కాలంలో జవహర్‌లాల్ నెహ్రూకు సన్నిహిత మిత్రులైన నాయకులు జాతి విమోచనకారుల స్థాయి నుంచి ‘కఠిన’ నాయకులుగా మారిపోవడం నాకు ఆశ్చర్యం, కలవరం కలిగించాయి. క్వామే నెక్రూమా (ఘనా), జోసెఫ్ బ్రాజ్ టిటో (యూగోస్లేవియా), గమాల్ అబ్దేల్ నాసర్ (ఈజిప్ట్ ) గురించి నేను ప్రస్తావించాను. ఈ మహామహులలో ప్రతి ఒక్కరూ తమ దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా అత్యున్నత అధికార పదవికి ఎన్నికయ్యారు. ప్రజల విశేష ఆదరాభిమానాలను పొందారు. అయినా అంతిమంగా ‘కఠిన’ నాయకులుగా, మరింత స్పష్టంగా చెప్పాలంటే నియంతలుగా పరిణమించారు. ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేశారు. తమ సమున్నత వారసత్వాన్ని కళంకపరచుకున్నారు.


ప్రపంచ శాంతిని ఉద్ఘోషించిన ‘పంచశీల’ ఒప్పందంపై సంతకం చేసిన ఐదుగురు నాయకులలో నియంతృత్వ పాలన చేయని ఏకైక నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే. భారత ప్రధానమంత్రిగా ఆయన హయాం- 1952, 1957, 1962-లో జరిగిన ప్రతి సార్వత్రక ఎన్నిక ఒక పరిపూర్ణ ప్రజాస్వామ్య సమరమే. ఎన్నికల ప్రచారంలో నెహ్రూ ప్రసంగాలు అన్నీ విలువైన ప్రజాస్వామ్య పాఠాలు. ఆ సభలకు వచ్చిన అశేష ప్రజలకు నెహ్రూ ఆంగ్ల వచో విభవం అర్థంకాకపోవచ్చు గానీ ఆయన మాట్లాడేది తప్పకుండా ప్రజాస్వామ్యం, లౌకికవాదం, జాతి నిర్మాణ కర్తవ్యాలు, పేదరికం నిర్మూలన, ప్రభుత్వ విధ్యుక్త ధర్మాలు మొదలైన అంశాల గురించేనన్న విషయం వారికి బాగా తెలుసు. ‘భగవంతుని ప్రేమాస్పద పుత్రుడు’ అయిన నెహ్రూ భారత ప్రజల అనురాగాన్ని అనంతంగా పొందిన ఉదాత్తుడు. అయినా ఆయన దేశ పాలనలో ‘కఠిన’ మార్గాలలో నడవలేదు, నియంత కాలేదు.


వర్తమాన ప్రపంచంలో కఠిన నాయకులు కోకొల్లలు. ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహిస్తే వారిలో ఏ ఒక్కరూ ఎన్నికయ్యే అవకాశమే లేదు. బోల్సొనారో (బ్రెజిల్), ఎర్డోగన్ (టర్కీ), అబ్దుల్ అల్-సిసి (ఈజిప్ట్), విక్టర్ ఒర్బాన్ (హంగరీ), అలెగ్జాండర్ లుకాషెంకో (బెలారస్), కిమ్ జోంగ్- (ఉత్తర కొరియా), ఇంకా పలువురు నాయకులు ఈ బాపతు పెద్ద మనుషులే. వీరిలో ఏ ఒక్కరూ తమ దేశం వెలుపల, తమ ఖండం వెలుపల విఖ్యాతులైన వారు కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక విలక్షణ నాయకుడు. తనకుతానే సాటి. అలాగే చైనా అధినేత క్సి జింగ్ పింగ్ కూడా. ఉభయులూ కఠిన నాయకులే. తమ యావజ్జీవితమూ దేశ పాలకులుగా ఉండాలని ఆరాటపడుతున్నవారే. నేనీ వ్యాసం రాస్తున్న సమయంలో పుతిన్ తమ పొరుగున ఉన్న నిస్సహాయ ఉక్రెయిన్‌పై రాకెట్ల, బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో నేడు 52 దేశాల ప్రభుత్వాలను నిస్సంకోచంగా నియంతృత్వ ప్రభుత్వాలుగా వర్గీకరించవచ్చు.


మనకు కఠిన నాయకులు అవసరమా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటువంటి అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచార సభలలో ఆయన ఈ అభిప్రాయాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నారు. బహ్‌రైచ్‌లో జరిగిన ఒక ఎన్నికల సభలో మోదీ ఉద్ఘాటన నొకదాన్ని ఉటంకిస్తాను. ‘ప్రపంచం గందరగోళంలో ఉన్నప్పుడు భారత్ శక్తిమంతంగా ఉండవలసిన అవసరముంది. అవును, కష్టకాలానికి కఠిన నాయకుడు అవసరం’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీరు ఒక వాస్తవాన్ని కూడా తెలుసుకోవాలి. నీతి ఆయోగ్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో పేదరికం నిష్పత్తి 70 శాతం కంటే అధికంగా ఉన్న మూడు జిల్లాల్లో బహ్‌రైచ్‌ కూడా ఒకటి! యూపీలో బీజేపీ నాయకుడు ఆదిత్యనాథ్ మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్టు ఆయన ఉద్ఘాటనలు చాలవరకు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్లిష్ట కాలానికి ఆదిత్యనాథ్ వంటి ‘కఠిన’ నాయకుడు అవసరమని మోదీ భావిస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించే పాలకుడు ఆదిత్యనాథ్. ఈ విషయంలో ఎటువంటి వ్యతిరేకతను ఆయన సహించడు. ఆయన పాలనలో ‘ఎన్‌కౌంటర్ల’కు అధికారిక అనుమతి ఉన్నది మరి!


సున్నిత మనస్కులు, మృదుస్వభావులు అయిన నాయకులే ఉత్తమ నాయకులు అని నేను భావిస్తాను. అటువంటి నేతలు వివేకశీలురు. ప్రజలు చెప్పుకునేదాన్ని సావధానంగా వింటారు. సంస్థలను కాపాడతారు. చట్టాన్ని పాటిస్తారు. సమాజంలోని వైవిధ్యాన్ని గౌరవించి, ఆదరిస్తారు. ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తారు. పదవీకాలం ముగిసిన తరువాత నిశ్శబ్దంగా నిష్క్రమిస్తారు. ప్రజల జీవితాలను వారు మెరుగుపరుస్తారు.


ఉద్యోగాలను సమకూరుస్తారు. నాణ్యమైన విద్యను, ఆరోగ్యభద్రతను అందిస్తారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తారు. వాతావరణ మార్పు మొదలైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటారు. ప్రపంచంలో ఇటువంటి ఉత్కృష్ట నాయకులు గతంలో ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. సాటిలేని మహోన్నత నాయకుడు నెల్సన్ మండేలా అటువంటి వారిలో అగ్రగణ్యుడు. జర్మనీ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, న్యూజీలాండ్ ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్, నెదర్లాండ్స్ ప్రధాని మాఝరఝ్క్ రట్టె, ఇంకా మరికొంతమంది ఆదర్శనాయకులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ప్రజలు ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటారో నాకు తెలియదు. ఆ ఐదు రాష్ట్రాలలో ఏ ఒక్క దానిలో నైనా నాకు ఓటుహక్కు ఉంటే మృదుస్వభావి, వివేకశీలి అయిన నాయకుడికే నేను ఓటు వేస్తాను. 

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)



Updated Date - 2022-03-05T06:26:59+05:30 IST