అస్తిత్వ ఉద్యమాల ఆత్మబంధువు

ABN , First Publish Date - 2022-09-27T06:31:18+05:30 IST

ఆధునిక కాలంలోని పలు విప్లవాలు, ఉద్యమాలు ప్రముఖుల జీవితాలతో పెనవేసుకుని ఉన్నాయి. తమ ప్రజలను సామ్రాజ్యవాద, వలసవాదుల బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడానికి...

అస్తిత్వ ఉద్యమాల ఆత్మబంధువు

ఆధునిక కాలంలోని పలు విప్లవాలు, ఉద్యమాలు ప్రముఖుల జీవితాలతో పెనవేసుకుని ఉన్నాయి. తమ ప్రజలను సామ్రాజ్యవాద, వలసవాదుల బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడానికి పలువురు నిర్విరామ కృషి జరిపారు. అలాంటి కోవకు చెందినవారే కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్రోద్యమం, నైజాం వ్యతిరేక ఉద్యమం, సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమాలతో మమేకమైన నేత కొండా లక్ష్మణ్. నమ్మిన సిద్ధాంతాల కోసం ఏకంగా 75 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రజాఉద్యమాలను నిర్వహించి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన నాయకుడు.


కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో ఒక చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించారు. చదువు కోసం 80 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు రావడమే గొప్ప. అట్లా హైదరాబాద్‌కు వచ్చిన బాపూజీ న్యాయశాస్త్రం పూర్తిచేసి పేద ప్రజలకు అండగా నిలిచాడు. జాతీయ నాయకుల పేర్లు ఉచ్చరించడాన్ని నిషేధించిన 1930 నాటి రోజుల్లో బొంబాయి ప్రాంతంలోని చంద్రగిరి (నాటి చాందా) పట్టణంలో గాంధీజీ పర్యటించిన సందర్భంలో రహస్య మార్గం ద్వారా వెళ్లి ఆయన్ని దర్శించుకున్నారు. ఆయన ప్రసంగానికి ప్రభావితుడై తన తెల్ల షరాయిని చించి గాంధీ టోపీగా చేసుకుని ధరించాడు. ఆ రోజుల్లో నైజాం రాజ్యంలో గాంధీటోపీ ధరించడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. పాలకులపై తిరుగుబాటుకు చిహ్నమైన గాంధీటోపీని ధరించినందుకు బాపూజీని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో అబిడ్స్ బ్రిటిష్ పోస్టాఫీస్‌పై, కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సిపై జెండా ఎగరవేసి ఒకవైపు నిజాం నిరంకుశ పాలనకు, మరోవైపు బ్రిటిష్ సామ్రాజ్యవాద కర్కశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో ధిక్కారస్వరాన్ని ఎక్కుపెట్టిన ఏకైక నాయకుడు కొండా లక్ష్మణ్. బాపూజీ నిరంతర కృషి ఫలితంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్ 1968లో ఏర్పాటయింది. ఈ కమిటీ నిర్ణయాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. తెలుగు నేలపై పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తొలి నాయకుడు బాపూజీ. 1961లో మూసీ నదికి వరదల వల్ల అపార నష్టం సంభవించినప్పుడు ఆయన నిర్వహించిన 220 మైళ్ల పాదయాత్ర అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజల వద్దకు పాలన నినాదం ఆయనదే. దళిత బహుజనులకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో బాపూజీ నవసమాజ్ పార్టీ స్థాపించారు. చేనేత, గీత, చర్మ, మత్స్య సహకార సంఘాల ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించి ‘సహకార రత్న’గా ప్రసిద్ధుడయ్యారు.


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి బాపూజీకి విడదీయరాని అనుబంధం ఉంది. తొలి దశ తెలంగాణ ఉద్యమ బీజప్రాయ సమయంలో ఆంధ్ర గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా 1969 ఫిబ్రవరి 21న తన పదవికి రాజీనామా చేశాడు. తెలంగాణ ఉద్యమకారులపై కాల్పులు జరపడానికి నిరసనగా 12 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టారు. రాజీనామాను ఉపసంహరించుకుంటే ఉపముఖ్యమంత్రిని చేస్తానని అప్పట్లో బ్రహ్మానందరెడ్డి, ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఇందిరాగాంధీ పదవులకు ఎరవేసినా సున్నితంగా తిరస్కరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. 1996లో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయన ఊపిరి పోశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు తన నివాసమైన జలదృశ్యం వేదికగా చేసి చంద్రశేఖర్‌రావుకు ఉద్యమ భరోసానిచ్చారు. జీవితం మలిసంధ్యలోనూ ఎక్కడ తెలంగాణ టెంటు వెలిస్తే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉద్యమకారులకు, యువకులకు స్ఫూర్తినిచ్చారు. తెలంగాణ జెండా ఎత్తిన వారందరికీ అన్ని పార్టీలకు పెద్దదిక్కుగా నిలిచి దిక్సూచి అయ్యారు. 97ఏళ్ల పండు వయసులోను ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రాష్ట్ర సాధనకై సత్యాగ్రహ దీక్ష బూనారంటే ఈ ప్రాంత విముక్తి పట్ల దృఢ సంకల్పాన్ని అర్థం చేసుకోవచ్చు. పదహారేళ్ల ప్రాయంలో అందిపుచ్చుకున్న ఉద్యమ జీవితాన్ని 97ఏళ్ల పండు వయస్సు (2012 సెప్టెంబర్ 21) వరకు కొనసాగించి ముగించారు. చరిత్రకారుడు అడప సత్యనారాయణ అన్నట్లు తన జీవితంతోను, జీవన సరళితోను,  నిబద్ధతతోను, నిమగ్నతతోను తనకు తానే చరిత్ర లిఖించుకున్న మహోదాత్త నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన పరితపించిన సామాజిక తెలంగాణ, దళిత బహుజన సాధికారత ఇంకా సుదూర స్వప్నాలుగానే ఉన్నాయి.

అంకం నరేష్

(నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి)

Read more