మన చరిత్రలో ఒక విస్మృత అధ్యాయం

ABN , First Publish Date - 2022-04-05T07:22:32+05:30 IST

నాలుగున్నర దశాబ్దాల నాటి మాట. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భమది. ‘Babu Beats Bobby’ -ఇది, ప్రతిపక్షాల ప్రచారం సందర్భంగా...

మన చరిత్రలో ఒక విస్మృత అధ్యాయం

నాలుగున్నర దశాబ్దాల నాటి మాట. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భమది. ‘Babu Beats Bobby’ -ఇది, ప్రతిపక్షాల ప్రచారం సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా ప్రచురితమైన వార్త. ఇందులో బాబూ- జగ్జీవన్‌ రామ్‌ కాగా, ‘బాబీ’ అప్పట్లో బాక్సాఫీస్ హిట్ బాలీవుడ్ సినిమా. ఇటీవల మరణించిన రిషి కపూర్ ఆ సినిమా హీరో. ఆ వార్త నేపథ్యం ఏమిటంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షాల్లో జగ్జీవన్‌ రామ్‌ ఒక ప్రధాన నాయకుడు. ఎమర్జెన్సీ విషయమై ఇందిరా గాంధీతో విభేదించి, జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వయంగా ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ అనే పార్టీని జగ్జీవన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన సభకు జనాలు వెళ్ళకుండా ఉండాలని నాటి కాంగ్రెస్ నాయకులు దూరదర్శన్ (అప్పటి ఏకైక న్యూస్ కమ్యూనికేషన్ సాధనం)లో సూపర్ హిట్ మూవీ ‘బాబీ’ని ప్రసారం చేయించారు. జగ్జీవన్ సభకు వెళ్ళకుండా జనాలను ఆపాలనేది వారి ఆలోచన. అయితే ప్రజలు తండోప తండాలుగా ఆయన సభకు వెళ్ళారు. ఆ మరుసటి రోజు ఒక వార్తా పత్రికలో వచ్చిన పతాక శీర్షికే ‘Babu Beats Bobby’. ఈ ఆసక్తికర ఉదంతం జగ్జీవన్‌ రామ్‌కు గల ప్రజాదరణకు మచ్చుకు ఒక ఉదాహరణ. 


కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకుడుగా జగ్జీవన్ ప్రధాన మంత్రి పదవికి పోటీపడ్డారు. అయితే నాటి భారత రాజకీయం ఆయనకు ఆ అవకాశాన్ని దక్కనివ్వలేదు. ప్రభుత్వంలో చేరడానికి విముఖత చూపగా సోషలిస్ట్ దిగ్గజం జయ ప్రకాష్ నారాయణ్ చొరవతో ఉపప్రధానిగా ఎన్నికయ్యారు. తన పార్టీని జనతా పార్టీలో విలీనం చేసారు. తరువాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ (జగ్జీవన్)ను ఏర్పాటు చేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 50 ఏళ్ళ చట్ట సభల జీవితం, 30 ఏళ్ళకు పైగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ, రక్షణ, రైల్వే, కార్మిక, కమ్యునికేషన్స్ తదితర శాఖలకు మంత్రిగా పని చేసిన జగ్జీవన్‌ రామ్‌ హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచనలో తనదైన విలక్షణ పాత్ర పోషించారు. అయితే ఈ దేశాన్ని ఏళ్ళ తరబడి పాలించిన ఇందిరాగాంధీకి ఎదురు తిరిగారు అన్న ఒకే ఒక్క కారణంతో ఆయన చరిత్ర మరుగున పడిపోయింది. తదనంతర పరిణామాల్లో జగ్జీవన్ కుమార్తె మీరా కుమార్ కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ స్పీకర్ దాకా ఎదిగారు. ఆమె కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే 2008లో జగ్జీవన్ రామ్ శత జయంతి సందర్భంగా ‘డాక్టర్ బాబూ జగ జీవన్ రాం ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. జగ్జీవన్ జీవిత చరిత్ర మీద పరిశోధన, ఆయన సిద్ధాంతాల వ్యాప్తి అనే లక్ష్యాలతో నెలకొల్పారు. అయితే అది కేవలం ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకే పరిమితమయిపోయింది. మీరా కుమార్ చొరవతో కొన్ని విశ్వవిద్యాలయాలలో బాబూ జగ్జీవన్ రామ్ అధ్యయన కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. అయితే అక్కడ కూడా సిబ్బంది కార్యకలాపాల లేమితో జగ్జీవన్‌పై పరిశోధన ఒక కలగా మిగిలిపోయింది. ఇప్పటికైనా జగ్జీవన్ జీవితం, నవ భారత నిర్మాణంలో ఆయన కృషిపై అవగాహన అందరిలో పెరగాలి. 1936 నుండి 1986 దాకా 50 ఏళ్ళ చట్ట సభల జీవితం, 1946 నుండి 1979 దాకా ౩౦ ఏళ్ళకు పైగా మంత్రిగా సేవలు, దేశ అభివృద్ధి విజయాల్లో కీలక పాత్ర, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, నాటి ఎన్నికలలో ప్రతిపక్షాలతో కలిసి పోరాడటం, దళితుల రిజర్వేషన్లు సరైన రీతిలో అమలయ్యేలా చర్యలు చేపట్టడం ఇవన్నీ వెలుగులోకి రావాలి. బాబూ జగ్జీవన్‌ రామ్‌ అంటే దళిత నేత మాత్రమే కాదు. 1936 నుంచి 1986 దాకా నడిచిన భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయం. ఒక సుదీర్ఘ అధ్యాయం. దురదృష్టవశాత్తూ ఆయన జీవితం దేశ ప్రజలకు అందుబాటులో లేని ఒక చరిత్ర. అశ్రద్ధకు గురైన ఒక పెద్ద అధ్యాయం. ఇప్పుడిప్పుడే ఆయన పేరు మీద పథకాలు, ఆయన జయంతికి సెలవు ఇవ్వడం మొదలైంది. పథకాలు సెలవులే కాదు, ఆయన జీవితం, కృషి మీద విస్తృత పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పచ్చల రాజేష్

(నేడు జగ్జీవన్ రామ్ జయంతి)

Updated Date - 2022-04-05T07:22:32+05:30 IST