సమగ్ర కవి

ABN , First Publish Date - 2022-10-10T06:52:51+05:30 IST

అన్నవరం దేవేందర్‌ ఇవాళ తెలంగాణాలో పట్టనంత పెద్దకవి. మంచి కవి, విశిష్ట కవి లాంటి విశేషణాలు చిన్నవైపోయిన కవి....

సమగ్ర కవి

అన్నవరం దేవేందర్‌ ఇవాళ తెలంగాణాలో పట్టనంత పెద్దకవి. మంచి కవి, విశిష్ట కవి లాంటి విశేషణాలు చిన్నవైపోయిన కవి. సంతకంలేకున్నా కవిత చదివి గుర్తు పట్టగలిగిన స్వీయ వ్యక్తిత్వ సంపన్నుడు. నేను దేవేందర్‌ను 16యేళ్ళ క్రితం మొదటిసారి సిరిసిల్ల పట్టణంలో రంగినేని ట్రస్టు ఆవరణలో దగ్గరగా చూశాను. సాహిత్యగోష్టిలో ఎటు చూసినా అతని సందడే. తాను తాజాగా రాసిన నానీలను వినిపిస్తున్నాడు.


దొర గడిని చూస్తేనే

ఉచ్చ పడేది

ఇప్పుడు అండ్లనే

పోస్తన్నం. (బుడ్డపర్కలు)


సిక్సర్‌ కొట్టిన నానీ ఇది. దీనిలో ఓ వందేళ్ల చరిత్ర గర్భితమై వుంది. అవి ‘మంకమ్మతోట లేబర్‌ అడ్డా’ (2005) కవిత్వ పుస్తకం ఢంకా బజాయిస్తున్న రోజులు. దానిలో ముట్టుకుంటే వెచ్చగా తగిలే అక్షరాలున్నాయి. ‘ఎల్లలు ఎన్ని దాటినా/ నా మట్టివాసన నాకు పులకరింత./ పెనవేసుకున్న ఊరిబంధం/ దూరం పెరిగిన కొద్దీ పెరుగుతుంది./ నా ప్రాదేశికత ముందు/ ప్రపంచీకరణ గుడ్డ పేలిక’. 


ఈ పుస్తకానికి ముందే ‘తొవ్వ’, ‘నడక’ లాంటి సంపుటాలు వేశాడు. ‘మంకమ్మతోట’తో కవిగా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు. మరో రెండేళ్లకు ‘బొడ్డుమల్లె చెట్టు’ను ప్రచురించాడు. యాభయ్యవ జన్మదినం సందర్భంగా వాటి మూల్యాంకనం కూడా జరిగింది. తర్వాత మరో ఏడు పుస్తకాలు. వాటిలో ‘బువ్వకుండ’ అనేది అతడు మాత్రమే రాయగలిగిన దీర్ఘకవిత. రెండు ఆంగ్లానువాద పుస్తకాలు అతని కవిత్వాన్ని తెలుగు సరిహద్దులు దాటించినై. 


అన్నవరం అనగానే తెలంగాణా నుడికారంతో రాసే కవి అనేది ప్రసిద్ధి. నిజమే, తెలంగాణా జీవ భాష అతనిలో పోయినన్ని సొగసులు తక్కువ మందిలో కనపడతాయి. ఇది ఉద్యమాల వల్ల వచ్చింది కాదు. ఉద్యమాలకు ముందే అతని నరనరాన సహజరమ్యంగా ఉద్భవించింది. అతడు మాట్లాడినా రాసినా నడకలో నడతలో, భావ రీతిలో అంతా తెలంగాణా భాష, తెలంగాణా శైలి. శైలి కవిత్వానికి ముకురం లాంటిది. తను ఎన్నుకున్న వస్తువు వైపు ఆకర్షించే గురుత్వా కర్షణ శక్తి అది. పైగా ఏవో కొన్ని తెలంగాణ పదాలను కూర్చడం కాదు. అది అతని భావ ధార, స్వభావ జీర. అందుకే అంత స్వాభావిక పథాల్లో అది గమిస్తున్నది. జీవనాడిగా శ్వాసిస్తు న్నది. నిజానికి తెలంగాణా భాష కొన్ని మాట ల్లోనే కాదు వాక్య విన్యాసంలో, జీవన విధాన విశిష్టరీతుల్లో, హావభావాల్లో, ఇలా ఇదొక సజీవ శబ్దరాశి. కొన్ని అమూల్యమైన మాటల్ని క్రమంగా పోగొట్టుకుంటున్నాం. ఇదిగో నేనున్నాను అని దేవేందర్‌ తన కవిత్వంలోకి చేదుకుంటున్నాడు.


భాషాపరంగా ఈ కవి ప్రత్యేక బాణీ అయినా వస్తుపరంగా విశాలమైన చైతన్యం. బాల్యం నుండి అనేక అనుభవాలు ఎరువుగా ఎదిగిన చెట్టు దేవేందర్‌. వృత్తికారుల కుటుంబం నుంచి వచ్చి ఆ మట్టితో బహుజనుల జీవనాకృతులు మలి చాడు. పల్లీయ గోసకు మూలాలు వెతికాడు. కుల వ్యవస్థలోని కుట్రను గుర్తించాడు.


‘వర్ణపంకిలాన్ని తెగనరికి/ అంతరాల దొంతర లను పగులగొట్టి/ ఆధిపత్యాల రహదారిని/ విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి’ అని కుండ బద్దలు గొట్టి చెప్పాడు. వామపక్ష ఉద్యమాల ప్రభావం దేవేందర్‌ కొక ప్రాపంచిక దృక్పథాన్ని ప్రసాదించింది. ‘తొవ్వ’ను ఏర్పరిచింది: ‘దేశదే శాల్లో దేశాన్ని తాకట్టు పెట్టినవాళ్లు/ నేలనేలంతా అప్పులమయం/ చేసినవాళ్లు ఉన్నారనీ/ అప్పుల ఊబిలో దిగిన ఓ రైతన్నా/ వేలాడుతున్న ఉరి తాడును/ కొడవలితో కొయ్యి’ అని పిలుపుని చ్చాడు. ‘మరి బర్రెకు/ తౌడు కుడితి నేను పెడుతాంటే/ పాలు వెన్న నువ్వు మింగవడితివి’ అంటూ ప్రజల శ్రమదోపిడిని ఎత్తి చూపాడు.



దేవేందర్‌ పాత్రికేయ వృత్తి అతన్ని ఎంతో విస్తృత పరిచింది: ‘కరీంనగర్‌ పల్లె/ గాయమై కలవరిస్తున్న పెయ్యి/ ఒర్రి బొంగురు పోయిన బొండిగ/ కొలిమిలోంచి తెచ్చిన గొడ్డలిచిప్ప/ తల్లడిల్లు తున్న తనువు/ సబ్బండ వర్ణాల తల్లి.’- అంటూ నేటి పల్లెల దుస్థితిని వర్ణించాడు. అవగాహనలో క్రమంగా ఒక స్పష్టతను సాధించాడు.


‘అస్తిత్వాల బహుముఖాలు/ ఆలోచనలు పలు కోణాలు’ అంటూ మనిషి మనుగడలోని మర్మా లను విశ్లేషించాడు. సందేహం లేదు దేవేందర్‌ది ధిక్కార స్వరమే. రాజీలేదు అనటానికి ‘ముచ్చటే లేదు’ అంటాడు. అట్లాని అతని కవిత్వంలో సున్ని తత్వం లేదని కాదు. ఈ కవితను చూడండి: ‘పొద్దున్నే లేచి ఏం చేస్తా/ అప్పుడే పూస్తున్న బంతి పూలను పలకరిస్తా/ అవి చిరునవ్వుల జల్లు కురిపిస్తవి.’ -ఇట్లాంటి కవితలెన్నో ఇటీవలే వెలు వడిన ‘జీవన తాత్పర్యం’ కవితా సంపుటిలో దొరు కుతాయి. ఒకమ్మాయి అచ్చం తన చిన్ననాటి స్నేహితురాలి లానే వుందనే చిన్న వస్తువును తీసుకొని: ‘వయసు చూస్తేనేమో సగంలో సగం/ మనిషి చూస్తే చిర పరిచయ రూపం/ బూటింగ్‌ నామరూపాల మనో ఫలకం’ అని రాస్తాడు. 


‘జీవన తాత్పర్యం’లో దేవేందర్‌ కవిత్వం మలుపు తిరుగుతున్నట్టనిపిస్తుంది. అది అతని పరిణా మంలో భాగంగా భావిస్తున్నాను. ధిక్కార స్వరంలో ప్రేమ వచ్చి చేరినట్టుగా వుంది. భావుకత పక్వ దశకు చేరుతున్న వైనం దీనిలో కనిపిస్తుంది.


తెలంగాణ ఎప్పటికీ ఒక స్వప్నమే. కొత్త తెలివిడిని దానిలోకి ఒంపుకోక తప్పదు. విశ్వీ కరణాన్ని ధిక్కరిస్తూనే దానికి లొంగిపోతున్న సన్నివేశంలో వున్నాము. మన పిల్లల తరాన్ని గురించి ఆలోచించవలసిన సరిహద్దులో వున్నాము.


దేవేందర్‌కు అప్పుడే అరవయ్యేళ్ళు నిండాయి. అలా అనిపించడు. తన కవిత్వాన్ని పాఠకులను విస్తృత పరచుకోవాలని నా కోరిక. అన్ని ప్రాంతా ల్లోని భావుకులను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అతన్ని సమగ్ర కవి అంటున్నాను.

ఎన్‌. గోపి

93910 28496

Updated Date - 2022-10-10T06:52:51+05:30 IST