ఎనిమిదేళ్ల విద్వేష పర్వం!

ABN , First Publish Date - 2022-06-11T07:23:34+05:30 IST

ఎనిమిదేళ్ళ భారతీయ జనతా పార్టీ పాలన ఈ దేశానికి ఏమిచ్చింది? దేశభక్తి, స్వదేశీ నినాదంతో వచ్చిన పార్టీ ఈ దేశ ప్రజల దైనందిన జీవితంలో ఏమైనా మార్పులు తీసుకువచ్చిందా?

ఎనిమిదేళ్ల విద్వేష పర్వం!

ఎనిమిదేళ్ళ భారతీయ జనతా పార్టీ పాలన ఈ దేశానికి ఏమిచ్చింది? దేశభక్తి, స్వదేశీ నినాదంతో వచ్చిన పార్టీ ఈ దేశ ప్రజల దైనందిన జీవితంలో ఏమైనా మార్పులు తీసుకువచ్చిందా? వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చగలిగిందా? లేక తనకే సొంతమైన బ్రాహ్మణీయ హిందుత్వ ప్రవాహంగా బలపడిందా? ఏ పాలకవర్గానికైనా ఎనిమిదేళ్ళ సమయం చాలా ఎక్కువ. నరేంద్ర మోదీ ఏకధాటిగా ఎనిమిదేళ్ళు ఈ దేశ ప్రధానిగా ఉన్నారు. దేశ ప్రజల జీవితాలలో సమూలమైన మార్పు తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారపీఠంపై కూర్చున్నారు.


ఈ దేశం శ్రామికులు, రైతులు కలగలిసిన ఆర్థిక నమూనాతో నడుస్తుంది. కాని కాలం గడుస్తున్నకొద్దీ పాలకవర్గాలు సామ్రాజ్యవాద పెట్టుబడికి గులాములయ్యాయి. రైతులను, శ్రామికులను కేవలం తిండి, కట్టుబట్టల కొరకు బతికేవారిగా మార్చాయి. మానవాభివృద్ధిలో కనీస జీవన అమరిక ఈ దేశ పేదల సొంతం కాలేదు. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. కాంగ్రెస్‌ నాయకత్వం అవినీతి పునాదులపై తమదైన భవిష్యత్తును నిర్మించుకున్నారు. గాంధీ కుటుంబ వారసత్వాలు ఈ దేశ మానవుల్ని ఎముకల గూళ్లుగా మిగిల్చాయి. 


భారతదేశం గమ్యం నూత్న ప్రజాస్వామిక ఆకాంక్ష. ఎలాంటి భయాలకు తావులేదని భారత రాజ్యాంగం హామీ పడింది. అయినా సంఘ్‌ పరివార్‌ నీడలో విస్తరించిన భారతీయ జనతా పార్టీ ఆర్థిక అసమానతలకు పరిష్కారం కోసం కృషి చేయాల్సింది పోయి బడాపెట్టుబడిదారుల పంచన చేరి సేదతీరుతున్నది. భారతదేశ శ్రమ సంపద, ఆర్థికవనరులు గుప్పెడుమంది పెట్టుబడిదారుల వశం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న మోదీ ప్రయత్నం చేస్తున్నారు. సఫలీకృతం అయినారు కూడా. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగసంస్థలను నడపడం ప్రభుత్వ విధానం కాదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం అనేది ఒకానొక సేవాసంస్థగానే పనిచేయాలన్న నమ్మకంతో బీజేపీ పాలకవర్గం పని చేస్తున్నది. కేవలం అధికారవర్గం, చట్టం, న్యాయంపై ఆధారపడే వ్యవస్థలను నిర్వహించటానికి మాత్రమే అది పరిమితమవుతున్నది.


భారతదేశ ప్రజలు ఇవాళ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. సరియైన ఉపాధి మార్గాలు లేక ఆర్థిక లేమితో భారతదేశ కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. ఎవరి ముఖాల్లోనూ చిరునవ్వులు లేవు. బతుకుపై భరోసా లేదు. తమ వేతనాలకి, పెరిగిన ధరలకు పొంతన లేదు. ఇవాళ గ్రామాలు విధ్వంసమై నగరబాట పడుతున్నాయి. పాలకులకు ఈ విషయం తెలియక కాదు. వ్యవసాయం, పరిశ్రమలు ఇక ఎంతమాత్రం ఉపాధి మార్గం కాదని భారతీయ యువత భావిస్తున్నది. దీనికి పరిష్కారమేమిటి? గంభీరమైన మాటలు, తేనె పూసిన ప్రసంగాలు మాత్రమే సరిపోవు. మోసపూరిత చర్చల నుంచి బయటకు రావాల్సిన సమయంలో– బీజేపీ  తన రాజకీయ ఎజెండాతో ప్రజలను విడదీయటం కోసం విద్వేష పూరిత రాజకీయాలకు పునాదిని వేసింది. 2014 నుంచి నేటి వరకు ఆ పార్టీ అనేక దుందుడుకు చర్యలకు పాల్పడింది. భారత సమాజంలోని అనేక పొరలకు సంబంధించిన అంశాలను పక్కనపెట్టి తన బ్రాహ్మణీయ హిందూత్వ సంస్కృతిని ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ప్రగతిశీలవాదులను భౌతికంగా నిర్మూలించింది. గౌరీ లంకేష్‌ను అత్యంత కిరాతకంగా చంపడానికి వెనకాడలేదు. అదే సమయంలో వేముల రోహిత్‌ను మానసికంగా వేధించి, మృత్యువు వరకు తోయగలిగింది.


రామజన్మభూమి, కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి, ఎన్‌.ఆర్‌.సి. వంటి ఆలోచనలు చేయడం ద్వారా ఇక ఎంతమాత్రం భారతదేశం అల్పసంఖ్యాక వర్గానిది కాదు అనే సూత్రాన్ని అమలు చేసింది. అదే సమయంలో ముస్లిం అస్తిత్వాన్ని బలహీనపరచాలన్న తన నిర్ణయాలకు సమ్మతిని కూడగట్టే ప్రయత్నం చేసింది. భారతదేశం కేవలం ఆధిపత్య వర్గాలదే అని నిరూపించుకోవడానికి, మెజారిటీవాదాన్ని బలపరుచుకోవడానికి ఒక రాజకీయ అజెండాను బీజేపీ రూపొందించుకున్నది. నిజానికి భారత సమాజం శ్రమజీవుల సంగమం. ద్వేషపూరిత ఆలోచనలు భారత ప్రజలకు లేవు. ప్రజల వైపు నుంచి ఏ విద్వేషపూరిత ఆలోచనలూ లేవు. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావమే ఈ దేశానికి పట్టిన దుర్గతి.


ఒక పక్కన రామజన్మభూమి గుడి నిర్మాణం వేగంగా నడుస్తుండగానే, ఇప్పుడు జ్ఞానవ్యాపి, మధుర దేవాలయాల చర్చను ముందుకు తెస్తున్నది బీజేపీ. అలా మరో దుర్మార్గమయిన రాజకీయ క్రీడను ఆరంభించింది. భారత ప్రజాస్వామ్యం రూపొందించుకున్న దేవాలయాల, మసీదుల, ప్రార్థనా మందిరాల యథాతథ స్థితిని పక్కన పెట్టి తన రాజకీయ ఎజెండాను, మత ఎజెండాను ముందుకు తెస్తున్నది. ప్రపంచమంతటా మనుషులు సృజనాత్మకతతో, శ్రమ సంస్కృతితో తమ జీవితాల్ని నిర్మించుకొంటున్న దశలో భారతదేశం మాత్రం గుడులు కట్టుకోవటంలో నిమగ్నమై ఉన్నది.


భారతదేశ పురోగమనంలో బుల్‌డోజర్‌ చాలా ముఖ్య భూమిక నిర్వహించింది. సాంస్కృతిక అభివృద్ధి లేని కాలంలో బుల్‌డోజర్‌ రూపం వేరే ఉండవచ్చు. ఇవాళ అదొక ఆధునిక యంత్రం. కోట్లాది మంది శ్రామికులను నిర్వాసితులను చేసింది. ఇవాళ బుల్‌డోజర్‌ కొత్త పని విధానంలోకి వెళ్ళింది. ఈ దేశ అల్పసంఖ్యాక వర్గాల వైపు బుల్‌డోజర్‌ దారి మళ్లించుకొంది. వారి జీవికను, వారి ఇళ్ళను, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసి కొత్త రహదారి వేసుకుంటున్నది.


నిజానికి భారతదేశానికి ఇవాళ కావాల్సిందేమిటి? ఈ దేశ అభివృద్ధి కోసం శ్రమను కేంద్రంగా చేసుకుని సకల రంగాల్లోనూ పనిచేస్తున్నవారికి నాణ్యమైన జీవితం అమరాలి. ఒక నూత్న భారత సమాజపు కల సాకారం కావాలి. ఆ స్వప్నంలో ఆకలి, అవమానం లేని నూత్న సంస్కృతి రూపొందాలి. చిట్టచివరి మనిషికి భారత పాలకవర్గాలు తమ ప్రయోజనం కోసం పని చేస్తున్నాయనే భరోసా కలగాలి. ఏ వివక్షా లేని భారతదేశం రూపొందాలి. జైళ్ళు, నిర్బంధం, హింస లేని దేశంలో నూతన మానవుడు ఆవిష్కరింపబడాలి. ఈ దేశం కొందరిది మాత్రమే కాదు, అందరిదీ అనే భావన ఏర్పడనంత కాలం భారతదేశం నిజమైన అభివృద్ధి సాధించినట్టు కాదు.


అరసవిల్లి కృష్ణ (విరసం)

Updated Date - 2022-06-11T07:23:34+05:30 IST