OMG: దండుపాళ్యం బ్యాచ్ కంటే డేంజర్‌గా ఉన్నాడుగా.. పోలీసులే విస్తుపోయే విషయాలు బయటపెట్టాడు..!

ABN , First Publish Date - 2022-11-27T22:27:18+05:30 IST

కరడుగట్టిన హంతకుడిని ఎస్వీయూ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఎస్వీయూ పోలీస్‌ స్టేషన్‌లో వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప మీడియాకు వివరాలను తెలియజేశారు. తిరుపతి-చంద్రగిరి మార్గంలో..

OMG: దండుపాళ్యం బ్యాచ్ కంటే డేంజర్‌గా ఉన్నాడుగా.. పోలీసులే విస్తుపోయే విషయాలు బయటపెట్టాడు..!

తిరుపతి: కరడుగట్టిన హంతకుడిని ఎస్వీయూ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఎస్వీయూ పోలీస్‌ స్టేషన్‌లో వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప మీడియాకు వివరాలను తెలియజేశారు. తిరుపతి-చంద్రగిరి మార్గంలో ఎస్వీయూ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోని బస్టా్‌పలో ఈనెల 15వ తేదీ రాత్రి ఓ యాచకుడిని తల పగలగొట్టి దారుణంగా హత్య చేశారు. 16వ తేదీ ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన వ్యక్తి ధరించిన చొక్కా జేబులో దొరికిన ఆధార్‌, ఓ చీటీతో ఆయన విజయవాడకు చెందిన రేపాకుల లక్ష్మణరావు (70) అని, భార్య, పిల్లలున్నారు. అయితే శ్రీవారి పాదాల చెంత తిరుపతిలోనే తాను చనిపోవాలనే కుటుంబానికి దూరంగా ఉంటూ భిక్షగాడిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పది రోజుల్లోనే నిందితుడిగా ఆర్ముగం మణిరత్నం అలియాస్‌ రాజు (34)గా గుర్తించారు. గురువారం వెస్ట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. పోలీసులే విస్తుపోయే విషయాలు తెలియజేశాడు.

మూడు హత్యలు, రెండు దొంగతనాల్లో నిందితుడు

మణిరత్నం తండ్రి పేరు త్యాగరాజు. శ్రీలకంకు చెందినవాడు. స్పిన్నింగ్‌ మిల్లుల్లో పనిచేసేవాడు. చెన్నైలోని మిల్లులో పనిచేయడానికి శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చాడు. అక్కడే ఓ యువతిని పెళ్లి చేసుకుని, కాపురాన్ని గుంతకల్లుకు మార్చాడు. అక్కడి స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేస్తున్నప్పుడే మణిరత్నంతోపాటు మరో కుమారుడు, ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వీరిలో మణిరత్నం తొలి నుంచీ నేర స్వభావంతో ఉండేవాడు. 2011లో ఓ స్నేహితుడితో కలిసి గుంతకల్లులో ఓ హత్యకు పాల్పడ్డాడు. కోర్టులో ఆ కేసు వీగిపోయింది. 2013లో గుంతకల్లులోనే మరో వ్యక్తిని హత్య చేశాడు. ఆ కేసునూ కొట్టేశారు. తర్వాత కసాపురంలో ఓ దొంగతనం చేశాడు. అది కూడా వీగిపోయింది. దాని తర్వాత రాజమండ్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ చేశాడు. అదే ప్రాంతం బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మసీదులో ఓ వ్యక్తిని చంపేసి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు అక్కడున్న వస్తువులన్నీ కాల్చేశాడు. ఈ కేసు అప్పట్లో ఓ సంచలనమైంది. ఆధారాలన్నీ చెరిపేసినా పోలీసులు ఇతడిని గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో చాలాకాలంగా రాజమండ్రి జైల్లో ఉన్నాడు. గాంధీ జయంతి రోజున బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అనంతరం హుబ్లీ, గుంతకల్లు వెళ్లి బంధువులను కలిశాక తిరుపతికి వచ్చాడు. నగరంలో చిత్తు పేపర్లు ఏరుకుంటూ.. లేదా చిత్తు పేపర్లు ఏరే వారి నుంచి వాటిని కొనుగోలు చేసి తిరిగి గుజరీ వారికి విక్రయిస్తూ జీవిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీ రాత్రి 9.45 గంటలకు ఎస్వీయూ సమీపంలోని బస్టాప్‌లో పడుకుని ఉన్న లక్ష్మణరావు వద్దకొచ్చి అగ్గిపెట్టె అడిగాడు. లేదని చెప్పడంతో బెదిరించాడు. దాంతో లక్ష్మణరావు పోలీసులకు చెప్తానంటూ ఎస్వీయూ స్టేషన్‌ వైపునకు బయల్దేరాడు. ఆగ్రహించిన మణిరత్నం.. ‘ఇక్కడినుంచి పారిపో.. లేదంటే చంసేస్తా’ అంటూ వెళ్లిపోయాడు. లక్ష్మణరావు తిరిగొచ్చి బస్టాప్‌లో పడుకున్నాడు. మణిరత్నం మాత్రం రాత్రి 11.30 గంటలకు తిరిగి బస్టాప్‌ వద్దకొచ్చి బండరాయితో లక్ష్మణరావు తలపగులగొట్టి హత్య చేశాడు. పథకం ప్రకారం సీసీ కెమెరాలకు దొరక్కుండా హత్య చేశాక రక్తం అంటిన దుస్తులను వెస్ట్‌ రైల్వేస్టేషన్‌వద్ద తగులబెట్టేశాడు. కొత్త దుస్తులను ధరించి.. మళ్లీ బస్టాప్‌ వద్దకొచ్చి లక్ష్మణరావు మృతదేహాన్ని చూసి వెళ్లిపోయాడు. ఈ కేసును లోతుగా దర్యాప్తుచేసిన ఎస్వీయూ సీఐ రవీంద్రనాథ్‌, ఎస్‌ఐ అనిత, ఏఎస్‌ఐ దాము, కానిస్టేబుళ్లు ఈశ్వర్‌ తదితరులను నిందితుడిని గుర్తించి.. పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-11-27T22:27:36+05:30 IST