‘పబ్జీ‘ తెచ్చిన తంటా
ABN , First Publish Date - 2022-02-02T16:15:41+05:30 IST
తిరుప్పూరులో రాత్రంతా ‘పబ్జీ’ ఆడుతూ కేకలు పెడుతున్న యువకుడిపై పక్కింటిలో ఉంటున్న వృద్ధుడు కత్తితో దాడి జరిపిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తిరుప్పూరు పారైక్కాడు ప్రాంతానికి చెందిన కార్తీక్ (19)
- యువకుడిపై వృద్ధుడి దాడి
చెన్నై: తిరుప్పూరులో రాత్రంతా ‘పబ్జీ’ ఆడుతూ కేకలు పెడుతున్న యువకుడిపై పక్కింటిలో ఉంటున్న వృద్ధుడు కత్తితో దాడి జరిపిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తిరుప్పూరు పారైక్కాడు ప్రాంతానికి చెందిన కార్తీక్ (19) తారాపురంలోని ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్నారు. ఇతడికి పబ్జీ అంటే చాలా ఇష్టం. రాత్రిపూట తన స్నేహితులతో కలిసి ఇంటి వెనుకున్న బండపై కూర్చుని సెల్‌ఫోన్‌లో పబ్జీ ఆడుతూ బిగ్గరగా కేకలు పెడుతుండేవాడు. ఆ కేకలు పక్కింటిలో నివసిస్తున్న రామస్వామి (65) అనే వృద్ధుడి నిద్రకు భంగం కలిగిస్తుండేది. ఈ విషయమై రామస్వామి పలుమార్లు రాత్రిపూట పబ్జీ ఆడవద్దని కార్తిక్‌ను మందలించాడు. అయినా ఆ వృద్ధుడి మాటలు పట్టించుకోకుండా కార్తీక్ రాత్రిళ్ళు ఆడుతూ కేకలు పెట్టడం మానలేదు. రోజూ రాత్రి తొమ్మిది నుంచి వేకువజాము మూడు గంటల వరకూ స్నేహితులతో కలిసి పబ్జీ ఆడుతునూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కార్తీక్ యథావిధిగా సెల్‌ఫోన్‌లో పబ్జీ ఆడుతూ కేకలు పెట్టాడు. అది విన్న రామస్వామి కోపంగా కత్తిని పట్టుకుని వచ్చి కార్తీక్‌పై దాడి చేయగా, యువకుడి చేతికి గాయాలయ్యాయి. కార్తీక్‌ను చికిత్స నిమిత్తం కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రామస్వామిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో రామసామి ఓ హత్యకేసులో జైలు శిక్ష అనుభవించి మూడేళ్ళ క్రితమే విడుదలయ్యాడని తెలుసుకున్నారు.