Police: మాజీ ఎంపీ మస్తాన్‌ది హత్యే!

ABN , First Publish Date - 2022-12-31T09:12:12+05:30 IST

స్థానిక రాయపేటకు చెందిన డీఎంకే మాజీ ఎంపీ మస్తాన్‌(Former MP Mastan)ది హత్యేనని గూడువాంజేరి పోలీసులు నిర్ధారించారు.

Police: మాజీ ఎంపీ మస్తాన్‌ది హత్యే!

- నిర్ధారించిన పోలీసులు

- ఐదుగురి అరెస్టు

చెన్నై, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక రాయపేటకు చెందిన డీఎంకే మాజీ ఎంపీ మస్తాన్‌(Former MP Mastan)ది హత్యేనని గూడువాంజేరి పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి మస్తాన్‌ తమ్ముడి కుమారుడు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. డీఎంకే మైనారిటీ విభాగం కార్యదర్శిగా ఉన్న మస్తాన్‌ (66) ఈ నెల 22వ తేదీ రాత్రి కారులో వెళ్తుండగా గూడువాంజేరి వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. గుండెపోటు వచ్చి ఆయన మృతి చెందినట్లు కారు డ్రైవర్‌గా వున్న ఆయన తమ్ముడి కుమారుడు ఇమ్రాన్‌ తెలిపారు. అయితే తన కుమారుడి పెళ్ళి నిశ్చితార్థం జరగాల్సిన రోజే మస్తాన్‌ మృతి చెందటం, ముఖంపై గాయాలుండటంతో కుటుంబీకులకు అనుమానం కలిగింది. ఆ మేరకు తన తండ్రిది సహజమరణం కాదంటూ మస్తాన్‌ కుమారుడు గూడువాంజేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని కారు డ్రైవర్‌ ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు విషయం బయల్పడింది. మస్తాన్‌ తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న తమ్ముడి కుమారుడు ఇమ్రాన్‌ అవసరాల కోసం రూ.13 లక్షల వరకూ రుణంగా ఇచ్చి, ఆ డబ్బు తిరిగివ్వమంటూ పదేపదే ఒత్తిడి చేసేవారు. దీంతో ఆగ్రహించిన ఇమ్రాన్‌ అతడిని హత్యచేసేందుకు పథకం వేసుకున్నాడు. ఆ ప్రకారం ఈ నెల 22 రాత్రి కారులో మస్తాన్‌ను తీసుకెళ్తూ చెంగల్పట్టు సమీపంలో రోడ్డు పక్కగా కారు ఆపాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇమ్రాన్‌ అనుచరులు సుల్తాన్‌, నజీర్‌, తౌఫీక్‌, లోకేష్‌ కలిసి మస్తాన్‌ను గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్‌ మస్తాన్‌ మృతదేహాన్ని పక్కనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యులు చేత పరీక్ష చేయించాడు. అప్పటికే మస్తాన్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వివరాలను ఇమ్రాన్‌ చెన్నై(Chennai)లో ఉన్న కుటుంబీకులకు తెలిపాడు. గుండెపోటు వల్ల మస్తాన్‌ మృతి చెందాడని కపటనాటకమాటాడు. అయితే మస్తాన్‌ను గొంతునులిమి చంపేటప్పుడు హంతకుల గోళ్లు తగిలి గాయాలయ్యాయి. వాటిని చూసి అనుమానంతో మస్తాన్‌ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టయ్యింది. అరెస్టయిన ఐదుగురిని పోలీసులు శుక్రవారం జైలుకు తరలించారు.

Updated Date - 2022-12-31T09:12:14+05:30 IST