విషం పెట్టి భర్తను చంపిన భార్య
ABN , First Publish Date - 2022-06-16T15:20:17+05:30 IST
సేలం జిల్లా కొళత్తూరు, వీరభద్రన్ కోట్టైలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అన్నంలో విషం పెట్టి భార్య చంపేసింది. పోలీసులు కథనం మేరకు..

అడయార్(చెన్నై), జూన్ 15: సేలం జిల్లా కొళత్తూరు, వీరభద్రన్ కోట్టైలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అన్నంలో విషం పెట్టి భార్య చంపేసింది. పోలీసులు కథనం మేరకు.. జిల్లాలోని వీరభద్రన్ కోట్టై గ్రామానికి చెందిన శక్తివేల్ (37) రోజుకూలీగా జీవితం గడుపుతున్నాడు. ఈయన భార్య పుగళరసి (27)కి ముత్తుకుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శక్తివేల్కు తెలిసి భార్యను పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తన మార్చుకోకపోగా భర్త అడ్డు తొలగించుకునేందుకు తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. తన భర్తకు మద్యం అలవాటు ఉండటంతో పీకల వరకు తాగించి, అన్నంలో విషం పెట్టింది. మద్యంమత్తులో విషం కలిసిన ఆహారాన్ని తిన్న శక్తివేల్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో పుగళరసి, ముత్తుకుమార్లను అరెస్టు చేశారు.