ఉద్యోగాల పేరిట మోసం

ABN , First Publish Date - 2022-12-15T10:12:13+05:30 IST

మదురై ఆవిన్‌ సంస్థ(Madurai Avin Institute)లో ఉద్యోగాలు వేయిస్తామంటూ రూ.12 లక్షలు వసూలు చేసి మోసగించిన కేసులో అనంతకృష్ణన్‌,

ఉద్యోగాల పేరిట మోసం

- ఇద్దరి అరెస్టు

చెన్నై, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మదురై ఆవిన్‌ సంస్థ(Madurai Avin Institute)లో ఉద్యోగాలు వేయిస్తామంటూ రూ.12 లక్షలు వసూలు చేసి మోసగించిన కేసులో అనంతకృష్ణన్‌, హరికృష్ణన్‌ అనేవారిని మదురై పోలీసులు అరెస్టు చేశారు. మదురై సమీపం చోళవందాన్‌ ప్రాంతానికి చెందిన అరుణాచలం (25), ఆయన బంధువు ముత్తురాజ్‌ ఉద్యోగాల కోసం తిరుగుతుండగా వారి బంధువులైన అనంత కృష్ణన్‌, హరికృష్ణన్‌, భైరవ జయపాండి అనే ముగ్గురూ రూ.12 లక్షలు ఇస్తే ఆవిన్‌ సంస్థలో ఉద్యోగాలు వేయిస్తామన్నారు. ఆ మేరకు అరుణాచలం, ముత్తురాజ్‌ చెన్నై వెళ్ళి ఆవిన్‌ సంస్థలో పనిచేస్తున్న మణిభారతి అనే ఉద్యోగిని కలిశారు. రూ.12 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఖాయమని మణిభారతి వారికి తెలిపాడు. ఆ మేరకు తొలి విడతగా రూ.10లక్షలు చెల్లించడంతో వారికి ఆవిన్‌లో ఉద్యోగాలు వచ్చాయంటూ నియామకపు ఉత్తర్వులు అందజేశారు. రెండు రోజుల్లోనే ఆ నియామకాలు రద్దయ్యాయని, మాట ప్రకారం మిగతా రెండు లక్షలు ఇస్తేనే మళ్ళీ నియామక ఉత్తర్వులు ఇస్తారని నమ్మించారు. చివరకు అరుణాచలం(Arunachalam) బ్యాలెన్స్‌ సొమ్ము రెండు లక్షలు కూడా హరికృష్ణన్‌, ఆయన వర్గీయులకు చెల్లించాడు. ఆ తర్వాత కొత్తగా ఇచ్చిన నియామక ఉత్తర్వులతో ముదరై ఆవిన్‌ సంస్థకు వెళ్ళిన అరుణాచలం, ముత్తురాజ్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. అవి నకిలీవని తేలడంతో దిగ్ర్భాంతి చెందిన అరుణాచలం, ముత్తురాజ్‌ మదురై తిరుమంగళం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హరికృష్ణన్‌, భైరవ జయపాండిని అరెస్టు చేశారు. ఈ మోసంలో సంబంధం కలిగిన మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-12-15T10:12:15+05:30 IST