అగ్రిగోల్డ్‌ బాధిత ఏజెంట్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-17T10:20:36+05:30 IST

అగ్రిగోల్డ్‌ సంస్థకు ఏజెంట్‌గా పనిచేసిన వృద్ధురాలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై నాగమల్లేశ్వరరావు కథనం మేరకు..

అగ్రిగోల్డ్‌ బాధిత ఏజెంట్‌ ఆత్మహత్య

కంభం, అక్టోబరు 16: అగ్రిగోల్డ్‌ సంస్థకు ఏజెంట్‌గా పనిచేసిన వృద్ధురాలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై నాగమల్లేశ్వరరావు కథనం మేరకు.. రావిపాడుకు చెందిన గంధవల్ల నాగసుబ్బులు (70) గతంలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో గ్రామంలో పలువురి నుంచి సంస్థకు డబ్బు కట్టించారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్‌ బోర్డు తిప్పేసింది. డబ్బులు కట్టిన వారు వాటి కోసం నాగసుబ్బులుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె గ్రామంలో పలువురి వద్ద వడ్డీకి అప్పు తెచ్చి కొంతమందికి చెల్లించారు. మిగిలిన వారికి త్వరలో తీరుస్తానని హామీఇచ్చారు. ఈ క్రమంలో నాగసుబ్బులు కుమార్తెకు వివాహమైంది. నాగసుబ్బులు గ్రామంలో ఓ ఇల్లు నిర్మించుకుంది. ఆ ఇంటితోపాటు తనపేరు మీద ఉన్న 64 సెంట్ల పంట పొలాన్ని కూతురు, అల్లుడి పేరిట రాసింది. రెండు నెలలక్రితం పొలాన్ని రూ.8.50 లక్షలకు అమ్మి కుమార్తెకు ఇచ్చినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న రుణదాతలు, అగ్రిగోల్డ్‌ బాధితులు తమ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచారు. దీంతో తాను చేసిన రూ.50లక్షలకు పైగా అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆమె మనోవేదన చెందారు. ఆదివారం  పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Updated Date - 2022-10-17T10:20:36+05:30 IST