20 lakhs: ‘హలో.... బాగున్నావా’...!

ABN , First Publish Date - 2022-12-08T09:28:12+05:30 IST

ఓ ప్రైవేటు సంస్థ అధికారితో ఆడ గొంతుతో మాట్లాడి, వివాహం ఆశ చూపించి రూ.20.90 లక్షల మోసానికి పాల్పడిన మెడికల్‌ రిప్రజెంటే

20 lakhs: ‘హలో.... బాగున్నావా’...!

- ఆడ గొంతుతో మాట్లాడి రూ.20 లక్షల మోసం

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 7: ఓ ప్రైవేటు సంస్థ అధికారితో ఆడ గొంతుతో మాట్లాడి, వివాహం ఆశ చూపించి రూ.20.90 లక్షల మోసానికి పాల్పడిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ కటకటాలపాలయ్యాడు. స్థానిక పుళిదివాక్కం భజన ఆలయ వీధికి చెందిన రఘురాం (39) నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు కంపెనీలో నిర్వహణాధికారిగా పనిచేస్తున్నాడు. ఆయనకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, గత మే నెలలో రఘురాం తండ్రి బాలసుబ్రమణియన్‌(Balasubramanian) సెల్‌ఫోన్‌కు కాల్‌ చేసిన వ్యక్తి, తన పేరు కల్యాణరామన్‌ అని, సేలంలో ఉంటున్న తన సోదరుడి కుమార్తె ఐశ్వర్యకు తగిన వరుడు కోసం చూస్తున్నట్లు, రఘురాం వివరాలు పంపాలని కోరాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన బాలసుబ్రమణియన్‌ తన కుమారుడు వివరాలు, ఫొటోలు పంపాడు. అనంతరం రఘురాంకు ఐశ్వర్య నుంచి కాల్‌ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన సెల్‌ఫోన్‌ పరిచయం ప్రేమగా మారింది. ఓ రోజు తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, చికిత్సకు డబ్బులు కావాలని ఐశ్వర్య కోరగా, రఘురాం గూగుల్‌ పే ద్వారా రూ.8 వేలు పంపాడు. అనంతరం మెరుగైన వైద్యం చేయించాలనే ఐశ్వర్య కోరడంతో పలుమార్లు మొత్తం రూ.20.90 లక్షలు పంపించాడు. కొద్దిరోజుల తర్వాత వివాహ విషయం అడిగితే ఐశ్వర్య సరిగా సమాధానం చెప్పకపోవడం గుర్తించిన రఘురాం నుంగంబాక్కం పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో, సేలం చిన్న తిరుపతి అన్నామలై నగర్‌కు చెందిన దత్తాద్రి (49), ఐశ్వర్య పేరుతో ఆడ గొంతుతో రఘురాంతో మాట్లాడి నగదు మోసానికి పాల్పడినట్లు తెలియడంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. మెడికల్‌ రిప్రంజెంటేటివ్‌గా పనిచేస్తున్న దత్తాద్రి, మోసం చేసిన నగదుతో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి నష్టపోయినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

Updated Date - 2022-12-08T09:28:14+05:30 IST