Nick Read: వొడాఫోన్ సీఈవో పదవికి నిక్ రీడ్ గుడ్‌బై.. ఇకపై కొత్త అవతారంలో!

ABN , First Publish Date - 2022-12-05T16:47:01+05:30 IST

వొడాఫోన్ సీఈవో నిక్ రీడ్(Nick Read ) ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ మేరకు

Nick Read: వొడాఫోన్ సీఈవో పదవికి నిక్ రీడ్ గుడ్‌బై.. ఇకపై కొత్త అవతారంలో!
Nick Read

న్యూఢిల్లీ: వొడాఫోన్ సీఈవో నిక్ రీడ్(Nick Read ) ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ మేరకు వొడాఫోన్ (Vodafone)ప్రకటించింది. రీడ్ నాలుగేళ్లపాటు సీఈవోగా సేవలు అందించారు. కరోనా వంటి విపత్కర సమయంలోను సంస్థను సమర్థంగా ముందుకు నడిపించారు. కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని, ఈ విషయంలో బోర్డు నిర్ణయంతో తాను అంగీకరిస్తున్నట్టు రీడ్ పేర్కొన్నారు.

యూరప్, ఆఫ్రికాలో వొడాఫోన్‌ను విస్తరించేందుకు విశేష కృషి చేసిన రీడ్.. టవర్ మౌలిక సదుపాయాల వ్యాపారాన్ని ప్రత్యేక యూనిట్‌గా మార్చారు. పలు మార్పులు చేసినప్పటికీ వొడాఫోన్ షేర్లు మాత్రం మందగమనంలోనే ఉన్నాయి. అక్టోబరు 2018లో రీడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి షేర్లు 40 శాతానికి పైగా దిగాజారాయి. రెండు దశాబ్దాల క్రితం ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ట్రేడ్ అవుతుండడం గమనార్హం.

రీడ్ సీఈవోగా వైదొలగినా సంస్థతో మాత్రం అనుబంధం కొనసాగనుంది. వచ్చే ఏడాది మార్చి వరకు సలహాదారుగా వ్యవహరించనున్నారు. కాగా, రీడ్ స్థానాన్ని ఆ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ మార్గరిటా డెల్లా వల్లె (Margherita Della Valle) తాత్కాలికంగా భర్తీ చేస్తారు. కొత్త సీఈవో కోసం బోర్డు అన్వేషిస్తున్నట్టు సంస్థ పేర్కొంది.

Updated Date - 2022-12-05T16:47:02+05:30 IST