పాపం.. రూపాయి

ABN , First Publish Date - 2022-09-24T08:18:34+05:30 IST

భారత కరెన్సీ విలువ సరికొత్త ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో మారకం రేటు శుక్రవారం మరో 30 పైసలు బలహీనప డి రూ.81.09 వద్ద స్థిరపడింది.

పాపం.. రూపాయి

సరికొత్త ఆల్‌టైం కనిష్ఠానికి భారత కరెన్సీ విలువ 

ఇంట్రాడేలో రూ.81.23కి డాలర్‌తో మారకం రేటు 

30 పైసల క్షీణతతో రూ.81.09 వద్ద ముగింపు 

భారత కరెన్సీ విలువ సరికొత్త ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో మారకం రేటు శుక్రవారం మరో 30 పైసలు బలహీనప డి రూ.81.09 వద్ద స్థిరపడింది. ఒక దశలో రూ.81.23కి చేరుకున్నప్పటికీ, మళ్లీ కాస్త కోలుకోగలిగింది. అంతర్జాతీయంగా డాలర్‌ విలువ పుంజుకోవడంతో పాటు ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ)లు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఉపసంహరించుకోవడం రూపాయిని మరింత బలహీనపరిచాయి. గురువారం కూడా డాలర్‌తో రూపాయి మారకం విలువ గడిచిన ఏడు నెలల్లో ఎన్నడూ లేనంతగా 83 పైసలు బలహీనపడి రూ.80.79 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ తగ్గడం వరుసగా ఇది మూడో రోజు. గడిచిన 3 సెషన్లలో 135 పైసలు క్షీణించింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ తీవ్రత మళ్లీ పెరగడం, అమెరికా సహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు ధరలను కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను అధిక స్థాయిల్లో పెంచుతుండటం, ఈక్విటీ మార్కెట్ల నష్టాలు వంటి పరిణామాలు మన కరెన్సీకి ప్రతికూలంగా మారాయని ఫారెక్స్‌ మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. మున్ముందు డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.82కు చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి. 

Read more