ఈ ఏడాదీ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలే

ABN , First Publish Date - 2022-10-17T09:32:48+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత విమానయాన సంస్థలకు నష్టాలు తప్పేలా లేవు.

ఈ ఏడాదీ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలే

రూ.14,000 కోట్ల వరకు భారం: కాపా 

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత విమానయాన సంస్థలకు నష్టాలు తప్పేలా లేవు. ఈ నష్టాలు  ఎంత లేదన్నా 140 నుంచి 170 కోట్ల డాలర్ల (సుమారు రూ.13,160 కోట్ల నుంచి రూ.14,100 కోట్లు) వరకు ఉండే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీరుతెన్నులను గమనించే సీఏపీఏ (కాపా) సంస్థ తెలిపింది. ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్ఘలు ఇప్పటికే ఏప్రిల్‌-జూన్‌ మధ్య రూ.1,853.3 కోట్ల నష్టాలు ప్రకటించాయి. భారత విమానయాన కంపెనీల ఆర్థిక స్థితిగతులపై కాపా ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతికంగా దివాలా తీసిన విమానయాన కంపెనీలు కూడా వ్యాపార విస్తరణకు పోవడం కేవలం భారత్‌లో మాత్రమే చూస్తున్నట్టు ఆ సంస్థ దక్షిణాసియా సీఈఓ కపిల్‌ కౌల్‌ అన్నారు.


భారత విమానయాన కంపెనీలు కనీసం 4 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపోయే నిధులనైనా రిజర్వుగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థల లైసెన్సులు ఏడాదికి ఒకసారి రెన్యూవల్‌ చేస్తే, భారత్‌లో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దీంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో పడిన విమానయాన సంస్థలను చివర్లోగానీ గుర్తించలేక పోతున్నట్టు చెప్పారు.

Updated Date - 2022-10-17T09:32:48+05:30 IST