ఈసారి 6.9 శాతం వృద్ధి

ABN , First Publish Date - 2022-12-07T02:18:51+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాను 6.9 శాతానికి పెంచుతున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది...

ఈసారి 6.9 శాతం వృద్ధి

అంచనాలను మెరుగుపర్చిన ప్రపంచ బ్యాంక్‌

సంక్షోభ కాలంలో భారత్‌కిదే తొలి అప్‌గ్రేడ్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాను 6.9 శాతానికి పెంచుతున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. అంతర్జాతీయ సంక్షోభాల నుంచి త్వరగా కోలుకోగలగడంతోపాటు రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలకు మించి నమోదవడంతో పూర్తి ఏడాది అంచనాలను పెంచుతున్నట్లు మంగళవారం నాటి నివేదికలో పేర్కొంది. ఈ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 13.5 శాతంగా నమోదైన వృద్ధిరేటు రెండో త్రైమాసికంలో 6.3 శాతానికి తగ్గింది. మైనింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ రంగాల పనితీరు కుంటుపడటం ఇందుకు ప్రధాన కారణం. అయినప్పటికీ, విశ్లేషకుల అంచనాలను అందుకోగలిగింది. ఈ సంక్షోభ కాలంలో మొదటిసారిగా ఓ అంతర్జాతీయ ఏజెన్సీ భారత వృద్ధి అంచనాలను మెరుగుపర్చింది. ఇదే ప్రపంచ బ్యాంక్‌.. అక్టోబరులో విడుదల చేసిన నివేదికలో భారత వృద్ధి అంచనాను 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా మళ్లీ 6.9 శాతానికి మెరుగుపర్చింది.

ఫిచ్‌ అంచనా 7%

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అంతేకాదు, ఈ ఏడాది భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వర్ధమాన దేశంగా నిలవనుందని పేర్కొంది. అయితే, వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల వృద్ధి అంచనాలకు మాత్రం కోత పెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.2 శాతానికి, 2024-25లో 6.9 శాతానికి పరిమితం కావచ్చునంది. కాగా వృద్ధిరేటు 2023-24లో 6.7 శాతం, 2024-25లో 7.1 శాతం ఉండవచ్చునని పేర్కొంది.

Updated Date - 2022-12-07T02:37:14+05:30 IST