ఆంధ్రా షుగర్స్ ఖ్యాతి విశ్వవ్యాపితం
ABN , First Publish Date - 2022-08-12T09:56:53+05:30 IST
వ్యవసాయ పారిశ్రామిక విప్లవం తీసుకురావటంతో పాటు అంతరిక్ష (రాకెట్) ప్రయోగాలకు అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా ఆంధ్రా షుగర్స్ ఖ్యాతి విశ్వవ్యాపితమైందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల నరేంద్రనాధ్ చౌదరి అన్నారు.

సంస్థ చైర్మన్, ఎండీ నరేంద్రనాధ్ చౌదరి
తణుకు: వ్యవసాయ పారిశ్రామిక విప్లవం తీసుకురావటంతో పాటు అంతరిక్ష (రాకెట్) ప్రయోగాలకు అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా ఆంధ్రా షుగర్స్ ఖ్యాతి విశ్వవ్యాపితమైందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల నరేంద్రనాధ్ చౌదరి అన్నారు. గురువారం నాడిక్కడ ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రనాఽధ్ మాట్లాడుతూ.. స్వాతంత్యానికి పూర్వమే 1947 ఆగస్టు 11న తణుకులోని వెంకటరాయపురం కేంద్రంగా ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్‌ను పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు, డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ ప్రారంభించారన్నారు. ఆ తర్వాత దశలవారీగా కంపెనీ కార్యకలాపాలను విస్తరించుకుంటూ పోయారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల్లో కంపెనీ అనుబంధ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని చౌదరి వివరించారు.
సంస్థ ప్రస్తుతం రసాయన ఎరువులు, బల్క్‌డ్రగ్స్, రాకెట్ ఇంధనం, జల,పవన విద్యుదుత్పత్తి సహా పలు రంగాల్లో కార్యకలాలు సాగిస్తోంది. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, ముళ్లపూడి వెంకట రమణమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆసుపత్రి, సాంస్కృతిక కళా వేదికలను ఏర్పాటు చేసినట్లు చౌదరి తెలిపారు. కాగా ఆంధ్రా షుగర్స్ 75వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్దాపకులు పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు, ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ స్మారక పోస్టల్ స్టాంప్‌ను భీమవరం పోస్టల్ సూపరింటెండెంట్ పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. కాగా సంస్థకు 40 ఏళ్లు పైబడి ఉద్యోగ సేవలదించిన 72 మందిని, పదవీ విరమణ చేసిన 808 మంది ఉద్యోగులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాధ్, ముళ్లపూడి తిమ్మరాజా, పెండ్యాల అచ్యుతరామయ్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెండ్యాల వెంకట కృష్ణరంగారావు, వీఎస్ రాజు, డీ మంజులత, వైస్ ప్రెసిడెంట్ వీవీఎస్ విశ్వనాధ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.