హైదరాబాద్‌లో ‘ద క్వారమ్‌’ క్లబ్‌

ABN , First Publish Date - 2022-12-08T04:26:08+05:30 IST

ప్రీమియం అతిథ్య రంగంలోని వర్క్‌, సోషల్‌ లైఫ్‌స్టైల్‌ క్లబ్‌ కంపెనీ ‘ద క్వారమ్‌’ హైదరాబాద్‌లో రూ.35 కోట్లతో క్లబ్‌ను ఏర్పాటు చేస్తోంది...

హైదరాబాద్‌లో ‘ద క్వారమ్‌’ క్లబ్‌

రూ.35 కోట్లతో ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రీమియం అతిథ్య రంగంలోని వర్క్‌, సోషల్‌ లైఫ్‌స్టైల్‌ క్లబ్‌ కంపెనీ ‘ద క్వారమ్‌’ హైదరాబాద్‌లో రూ.35 కోట్లతో క్లబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ముంబై, గురుగావ్‌ తర్వాత క్లబ్‌ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు ద క్వారమ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ వివేక్‌ నారన్‌ తెలిపారు. కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, పారిశ్రామికవేత్తలు, వెంచర్‌ కాపిటలిస్టు లు, ఇతర ప్రముఖ వ్యక్తులకు వర్క్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఒక వేదిక కల్పించడానికి ఈ క్లబ్‌ దోహదం చేస్తుందని విలేకరుల సమావేశంలో చెప్పారు.

కోరమ్‌కు ఇదే అతిపెద్ద క్లబ్‌ : హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ సమీపంలో రెండు ఫ్లోర్లలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని క్వారమ్‌ ఏర్పాటు చేస్తోంది. బ్లాక్‌స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇండియా భాగస్వామ్యంతో సత్వ గ్రూప్‌ దీన్ని అభివృద్ధి చేస్తోంది. క్వారమ్‌కు ఇదే అతిపెద్ద క్లబ్‌ అవుతుంది. వచ్చే ఏడాది మధ్య నాటికి హైదరాబాద్‌ క్లబ్‌ అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్‌ క్లబ్‌లో ఫౌండర్‌ సభ్యులుగా 500 మంది చేరగలరని అంచనా వేస్తోంది. స్టాండర్డ్‌ సభ్యత్వ రుసుము రూ.3 లక్షలతో పాటు వార్షిక రుసుము రూ.లక్ష ఉంటుంది. క్లబ్‌తో పాటు హైదరాబాద్‌లో 110 సీట్లతో ప్రీమియం వర్కింగ్‌ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌ క్లబ్‌ కోసం 120 మందిని నియమించుకోనున్నట్లు చెప్పారు.

రూ.80 కోట్ల పెట్టుబడులు.. : హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, గోవా, ఢిల్లీలో క్లబ్‌లను ఏర్పాటు చేయాలని క్వారమ్‌ భావిస్తోంది. ఇందుకు వచ్చే అయిదేళ్లలో రూ.80-100 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం 20 వేల మంది సభ్యులను లక్ష్యంగా పెట్టుకుంది. ఫుడ్‌, బేవరేజీస్‌, కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌, ఫ్యాషన్‌ తదితర అన్ని సౌకర్యాలను సభ్యులు పొందవచ్చు.

Updated Date - 2022-12-08T04:43:23+05:30 IST