వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయ్
ABN , First Publish Date - 2022-06-25T09:21:31+05:30 IST
రష్యా, అర్జెంటీనా దేశాల నుంచి పొద్దుతిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) వంట నూనె భారత్‌కు సరఫరా కావడంతో పాటు ఉక్రెయిన్‌లో కూడా పరిస్థితులు కుదుటపడుతున్నాయి.

సరఫరా మెరుగవుతోంది
జెమినీ ఎడిబల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి
సన్‌ప్లవర్ ఆయిల్ విభాగంలో ‘ఫ్రీడమ్’ నెం.1
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రష్యా, అర్జెంటీనా దేశాల నుంచి పొద్దుతిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) వంట నూనె భారత్‌కు సరఫరా కావడంతో పాటు ఉక్రెయిన్‌లో కూడా పరిస్థితులు కుదుటపడుతున్నాయి. అక్కడ ప్రస్తు తం పంట కోతకు వచ్చింది. కొత్త పంట కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు కొద్ది నెలల్లో మరింత తగ్గనున్నాయని జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి తెలిపారు. ‘ఫ్రీడమ్’ బ్రాండ్‌తో జెమినీ ఎడిబల్స్.. సన్‌ఫ్లవర్, ఇతర వంట నూనెలను విక్రయిస్తోంది. స్వల్ప కాలంలో నిత్యావసర వస్తువుల ఽగిరాకీలో మార్పు ఉండదు. సరఫరాలో తేడాల వల్లే ధరల్లో మార్పు లు వస్తాయి. ప్రస్తుతం సరఫరా మెరుగుపడుతున్నందున వంట నూనెల ధరలు మరింత తగ్గగలవని చెప్పారు. రిఫైన్డ్ ఆయిల్ క్యాన్స్ ప్యాక్ (ఆర్‌ఓసీపీ) మార్కెట్‌పై నీల్సన్ ఐక్యూ సమీకరించిన డేటా ఆధారంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో అమ్మకాల పరిమాణపరంగా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ దేశంలో నెం.1గా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
టన్ను 1,200 డాలర్లకు: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి సన్‌ఫ్లవర్ నూనె టన్ను ధర 1,800 డాలర్లు ఉందని.. ఇది 1,200 డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు. అలానే సోయా నూనె 1,500 డాలర్ల నుంచి 1,200 డాలర్లకు, పామాయిల్ 1,300 డాలర్ల నుంచి 1,000 డాలర్లకు కొద్దినెలల్లో చేరే వీలుందని చెప్పారు. కంపెనీ 80 శాతం సన్‌ఫ్లవర్ నూనెను ఉక్రెయిన్ నుంచి కొనుగోలు చేస్తోందన్నారు.
ఈ ఏడాది రూ.12,000 కోట్ల టర్నోవర్: భవిష్యత్తులో ధరలు తగ్గినప్పటికీ.. అమ్మకాల పరిమాణం పెరగడం వల్ల కంపెనీ టర్నోవర్ రూ.12,000 కోట్లకు చేరగలదని ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.10,500 కోట్లు ఉంది. 7.72 లక్షల టన్నుల వంట నూనెలను విక్రయించింది. పబ్లిక్ ఇష్యూకు సంబంధించి మాట్లాడుతూ.. ప్రతిపాదనల్లో మార్పులు చేసి కొద్ది రోజుల క్రితం సెబీకి సమర్పించామని చౌదరి తెలిపారు. రూ.2,500 కోట్ల పబ్లిక్ ఇష్యూలో సగం మొత్తాన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రొటెరా తన వాటాలను విక్రయించుకోవడం ద్వారా పొందనుందని చెప్పారు.
తెలంగాణలో రూ.500 కోట్లతో యూనిట్
ఫ్రీడమ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో రెండు, కృష్ణపట్నంలో ఒక యూనిట్ ఉంది. ముడి వంట నూనెలను దిగుమతి చేసుకుని ఇక్కడ ప్రాసెస్ చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిసా, కర్ణాటకల్లో వంట నూనెలను విక్రయిస్తోంది. అయితే.. తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరిస్తున్నందున ఇక్కడ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాదాపు 50 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వంట నూనెల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రదీప్ తెలిపారు. ఈ యూనిట్ సామర్థ్యం రోజుకు 1,000 టన్నులు ఉంటుంది. ప్రభుత్వం మూడు నెలల్లో భూమి కేటాయించి అన్నీ సవ్యంగా సాగితే.. రెండేళ్లలో తెలంగాణలో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.