మహా మాంద్యం ముంచుకొస్తోంది

ABN , First Publish Date - 2022-10-07T09:14:28+05:30 IST

ఆర్థిక మాంద్యం ముప్పు రోజు రోజుకీ పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కూడా ఇదే అభిప్రాయానికి వచ్చింది.

మహా మాంద్యం ముంచుకొస్తోంది

రూ.327 లక్షల కోట్ల జీడీపీ హాంఫట్‌  జూ  ఐఎంఎఫ్‌ ఎండీ

వాషింగ్టన్‌: ఆర్థిక మాంద్యం ముప్పు రోజు రోజుకీ పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కూడా ఇదే అభిప్రాయానికి వచ్చింది. ప్రపంచ దేశాలకు పెద్ద ఆర్థిక మాంద్యం పొంచి ఉందని ఆ సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జీ వా హెచ్చరించారు. ఈ మాంద్యం కారణంగా  ప్రపంచ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 2026 నాటికి దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.327.76 లక్షల కోట్లు) మేరకు తరిగిపోతుందన్నారు. ‘మాంద్యానికి దారితీసే రిస్క్‌ పెరుగుతోంది’ అని జార్జిటౌన్‌ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె హెచ్చరించారు. ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది ప్రపంచ జీడీపీలో మూడో వంతు వాటా ఉన్న దేశాల జీడీపీ వరుసగా రెండు  త్రైమాసికాలు మైనస్‌ స్థాయికి పడిపోతుందని జార్జీవా చెప్పారు.  


వృద్ధి రేటుకీ ఎసరు: ఈ సంవత్సరం ప్రపంచ జీడీపీ వృద్ధిరేటును కూడా ఐఎంఎఫ్‌ 3.2 శాతానికి కుదించేసింది. వచ్చే ఏడాది ఇది మరింత తగ్గి 2.9 శాతం మించక పోవచ్చునని ఆమె అన్నారు. ప్రపంచ జీడీపీ అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించడం ఈ ఏడాది వరుసగా ఇది నాలుగోసారి. నవంబరు నుంచి రోజువారీ చమురు ఉత్పత్తి 20 లక్షల పీపాలు తగ్గిస్తున్నట్టు ఒపెక్‌ దేశాలు బుధవారం ప్రకటించాయి. ఆ మరుసటి రోజే ఐఎంఎఫ్‌ ఎండీ ఆర్థిక మాంద్యం హెచ్చరిక చేయడం విశేషం. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతోనే ఈ ఆర్థిక మాంద్యం ముప్పు ఏర్పడిందని జార్జీవా స్పష్టం చేశారు.

Read more