మస్క్‌ చేజారిన ప్రపంచ కుబేర కిరీటం

ABN , First Publish Date - 2022-12-15T01:39:54+05:30 IST

అమెరికన్‌ విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లాతో పాటు సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేర కిరీటాన్ని కోల్పోయారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌ టైం జాబితాలో ఆయన రెండో స్థానానికి...

మస్క్‌ చేజారిన ప్రపంచ కుబేర కిరీటం

  • బ్లూంబర్గ్‌ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి జారిన టెస్లా అధిపతి

  • నం.1 స్థానానికి ఎగబాకిన బెర్నార్డ్‌ అర్నో

అమెరికన్‌ విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లాతో పాటు సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేర కిరీటాన్ని కోల్పోయారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌ టైం జాబితాలో ఆయన రెండో స్థానానికి జారుకున్నారు. ఈ మధ్య కాలంలో వేగంగా తగ్గుతూ వచ్చిన మస్క్‌ సంపద.. ఈ నెల 14 నాటికి 16,400 కోట్ల డాలర్లకు పడిపోయింది. మంగళవారం నాడు 395 కోట్ల డాలర్ల మేర పతనమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 10,700 కోట్ల డాలర్లకు పైగా క్షీణించింది. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావంతో అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీల షేర్ల ధరలు భారీగా తగ్గడంతో పాటు ట్విటర్‌ కొనుగోలు డీల్‌ మస్క్‌ వ్యక్తిగత ఆస్తికి భారీగా గండి కొట్టింది. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ ఫ్యాషన్‌ ఉత్పత్తుల దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ బెర్నార్డ్‌ అర్నో 17,100 కోట్ల డాలర్ల వ్యక్తిగత ఆస్తితో ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానానికి ఎగబాకారు. ప్రపంచంలో అతిపెద్ద లగ్జరీ ఫ్యాషన్‌ ఉత్పత్తుల తయారీదారైన ఎల్‌వీఎంహెచ్‌లో అర్నో 48 శాతం వాటా కలిగి ఉన్నారు. లగ్జరీ ఫ్యాషన్‌ వస్త్రాలు, వాచీలు, తోలు ఉత్పత్తులు, వైన్‌, అత్తర్లు, ఆభరణాలు, సౌందర్య ఉత్పత్తులు సహా పలు రకాల వస్తువులను ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. లూయీ విట్టన్‌, క్రిస్టియన్‌ డియోర్‌, మార్క్‌ జాకబ్స్‌, ఫెండీ, బల్గరీ, టిఫనీ అండ్‌ కో వంటి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నీ ఈ కంపెనీకి చెందినవే.

Updated Date - 2022-12-15T08:55:08+05:30 IST