7th pay commission: జీతం బకాయిలపై పన్ను మినహాయింపు పొందండిలా..

ABN , First Publish Date - 2022-08-26T01:49:18+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన జీతాలు, పెన్షన్లు అందుకుంటున్నారు.

7th pay commission: జీతం బకాయిలపై పన్ను మినహాయింపు పొందండిలా..

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం 7వ వేతన సంఘం(7th Pay Commission) సిఫార్సు చేసిన జీతాలు, పెన్షన్లు అందుకుంటున్నారు. సిఫార్సులు ఆలస్యంగా అమలుపరచడంతో వర్తింపు కాలం (retrospective) బకాయి జీతాలు, పెన్షన్ల(Salary Arrears)ను కేంద్రం(Central Govt) చెల్లిస్తోంది. అయితే బకాయిలు మునుపటివే అయినప్పటికీ ఈ ఏడాదే చెల్లిస్తున్నందున ఉద్యోగులు లేదా పెన్షనర్లు పన్నులు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను స్లాబుల్లో మార్పులే ఇందుకు కారణంగా ఉంది. అయినప్పటికీ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 89 కింద ఉద్యోగులు లేదా పెన్షనర్లు పన్ను మినహాయింపు పొందేందుకు ఒక మార్గం  ఉంది. అదే సెక్షన్ 89(1) కింద అడ్వాన్స్ జీతం లేదా ఫ్యామిలీ పెన్షన్ బకాయి చెల్లింపులపై ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవడం. మరి పన్ను మినహాయింపులు పొందేందుకు ఉద్యోగులు ఏం చేయాలో ఓ లుక్కేద్దాం..


జీతం లేదా పెన్షన్ బకాయిలపై పన్ను మినహాయింపు పొందాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్(Income Tax department) ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌పై 10ఈ ఫామ్ తప్పనిసరిగా నింపాల్సి ఉంటుంది. ఫామ్ 10ఈ సమర్పించకుండా ఉద్యోగులు పన్ను ఉపశమనం పొందడం వీలుపడదు. ఆ తర్వాత రిఫండ్ పొందేందుకు ఉద్యోగి తన ఐటీఆర్ ఫైలింగ్‌లో పన్ను మినహాయింపు కాలమ్‌లో వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.


పాటించాల్సిన స్టెప్స్..

ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఫామ్ 10ఈ ఫైల్ చేయవచ్చు.

1. http://www.incometax.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.

2. ఈ-ఫైల్ ట్యాబ్‌పై క్లిక్ చేసి.. ఫామ్స్ జాబితాలో ‘‘tax Exemption and Reliefs/Form 10E" సెలెక్ట్ చేసుకోవాలి.

3. అంచనా ఏడాది సెలెక్ట్ చేసుకుని.. కంటీన్యూపై క్లిక్ చేయాలి.

4. ఫామ్ 10ఈలో వేర్వేరు 5 బకాయిలకు సంబంధించిన అనుబంధ ఫామ్స్ ఉంటాయి. Annexure-I సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అడ్వాన్స్ శాలరీ లేదా బకాయిలకు సంబంధించినది.

5. ఫామ్ 10ఈ ఆటోమేటిక్‌గా సెక్షన్ 89 కింద ఎంత మొత్తంలో పన్ను మినహాయింపు లభిస్తుందో లెక్కగడుతుంది.

6. ఫామ్ 10ఈ ఫైల్ చేసిన తర్వాత.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) క్లెయిమ్ చేసుకోవాలి. ఫామ్ 10 వివరాలను ఐటీఆర్‌లోని పన్ను మినహాయింపు కాలమ్‌లో వెల్లడించాలి. 


కాగా 7వ వేతన సంఘాన్ని ఫిబ్రవరి 2014లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంఘం సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే.. ఆగస్టు తొలివారంలో కేంద్ర ఆర్థిక శాఖా సహాయమంత్రి పంకజ్ చౌదరీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశ్యంలేదని, అలాంటి ప్రతిపాదనేమీలేదని స్పష్టతనిచ్చారు.

Updated Date - 2022-08-26T01:49:18+05:30 IST