TCS: ‘‘అలా చేస్తే టెకీల కెరీర్‌లు నాశనం..మళ్లీ జాబ్ దొరకడం కష్టం..’’

ABN , First Publish Date - 2022-10-18T01:28:41+05:30 IST

టీసీఎస్(TCS) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణియన్ మూన్‌లైటింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మూన్‌లైటింగ్ ఉద్యోగులపై కఠిన చర్యలు(Strict action) తీసుకుంటే వారి కెరీర్‌లు(Career) నాశనమవుతాయని(Ruin) చెప్పారు.

TCS:  ‘‘అలా చేస్తే టెకీల కెరీర్‌లు నాశనం..మళ్లీ జాబ్ దొరకడం కష్టం..’’

ముంబై: ప్రస్తుతం ఐటీ రంగంలో చర్చ అంతా మూన్‌లైటింగ్(Moon lighting) చుట్టూనే తిరుగుతోంది. తమ సంస్థలోని ఉద్యోగులు మరో సంస్థలో పనిచేయడాన్ని కొన్ని టెక్ సంస్థలు అనుమతించట్లేదు. ఇప్పటికే విప్రో(Wipro), ఇన్ఫోసిస్(Infosys) మూన్‌లైటింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. కంపెనీ గోప్యతకు భంగం కలిగించే చర్యలు సమర్థించలేమని స్పష్టం చేశాయి. తాజాగా టీసీఎస్(TCS) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణియన్ మూన్‌లైటింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మూన్‌లైటింగ్ ఉద్యోగులపై కఠిన చర్యలు(Strict action) తీసుకుంటే వారి కెరీర్‌లు(Career) నాశనమవుతాయని(Ruin) చెప్పారు. ఇటువంటి విషయాల్లో ఉద్యోగుల పట్ల కాస్తంత సానుభూతితో వ్యవహరించాలని, వారిని అర్థం చేసుకోవాలని తెలిపారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. 


కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే హక్కు కంపెనీలకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే..యువ ఉద్యోగులపై ఇటువంటి చర్యలు ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్నారు.‘‘ఉద్యోగుల కెరీర్‌లు నాశనమైపోతాయి. మరో కంపెనీ వారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే.. వాళ్లకు ఉద్యోగం రాకపోవచ్చు. కెరీర్ నాశనమవుతంది. చిన్న వయసులోనే వారిని ఇలా శిక్షించలేం కాబట్టి.. ఈ విషయంలో సానుభూతితో వ్యవహరించాలి. ’’ అని పేర్కొన్నారు. సంస్థలకు, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే విధానాలను కొన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయని చెప్పిన ఆయన..మూన్‌లైటింగ్‌ను టీసీఎస్ ఆమోదించదని తేల్చి చెప్పారు. తమ సంస్థ కస్టమర్ల సమాచారం ఎట్టిపరిస్థితుల్లోనే భద్రంగా ఉండాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం సంస్కృతి కారణంగానే మూన్‌లైటింగ్ తెరపైకి వచ్చిందని సుబ్రమణియన్ చెప్పారు. ఇంట్లోంచి పని చేసే సమయంలో ఉద్యోగులకు కొంత ఖాళీ సమయం ఉంటుందని తెలిపారు. దీంతో.. వారు మరో సంస్థకు పనిచేస్తూ ఆర్థికప్రయోజనాలు పొందుతున్నారని చెప్పారు. టీసీఎస్‌లో ప్రస్తుతం ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గత 18 నెలల్లో కంపెనీ కొత్తగా 1.35 లక్షల మందిని ఉద్యోగంలోకి తీసుకుంది. 



Updated Date - 2022-10-18T01:28:41+05:30 IST