ఉక్కు గరం గరం

ABN , First Publish Date - 2022-03-05T09:07:55+05:30 IST

దేశీయ మార్కెట్లో ఉక్కు ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో స్టీల్‌ తయారీ కంపెనీలు హాట్‌ రెడ్‌ కాయిల్‌ (హెచ్‌ఆర్‌సీ), టీఎంటీ బార్ల ధరను టన్నుకు రూ.5,000..

ఉక్కు గరం గరం

రూ.5,000 వరకు పెరిగిన టన్ను స్టీల్‌ 

మున్ముందు మరింత ఎగబాకే అవకాశం 

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ ప్రభావం 


న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో ఉక్కు ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో స్టీల్‌ తయారీ కంపెనీలు హాట్‌ రెడ్‌ కాయిల్‌ (హెచ్‌ఆర్‌సీ), టీఎంటీ బార్ల ధరను టన్నుకు రూ.5,000 వరకు పెంచాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ఎదురవుతున్న సరఫరా అవాంతరాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతుండటంతో మున్ముందు వారాల్లో స్టీల్‌ ఉత్పత్తుల ధరలు మరింత ఎగబాకవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హెచ్‌ఆర్‌సీ ధర టన్నుకు దాదాపు రూ.66,000, టీఎంటీ బార్లు రూ.65,000కు చేరుకుందని వారు చెప్పారు.


యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి సరుకుల సరఫరాకు అవాంతరాలు ఎదురవుతున్నాయని, తత్ఫలితంగా తయారీ వ్యయం గణనీయంగా పెరిగిందని స్టీల్‌ ఉత్పత్తి రంగానికి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. స్టీల్‌ తయారీ ప్లాంట్లకు అవసరమైన కీలక ముడిసరుకుల్లో ఒకటైన బొగ్గు ధర టన్నుకు 500 డాలర్లు పలుకుతోందని, కొద్ది వారాల క్రితంతో పోలిస్తే బొగ్గు రేటు 20 శాతం మేర పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ బొగ్గు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ప్రధానంగా ఆస్ట్రేలియాతోపాటు దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా నుంచి మన దేశంలోకి పెద్దఎత్తున బొగ్గు దిగుమతి అవుతుంది. 


అన్ని కమోడిటీల ధరలు పైపైకే..

‘‘రష్యా, ఉక్రెయిన్‌ స్టీల్‌ తయారీ, ఎగుమతిదారులతోపాటు ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గు, సహజవాయువు వంటి కమోడిటీల సరఫరాదారులు కూడా. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం సరఫరా-గిరాకీ పరిస్థితులతో పాటు తయారీ వ్యయం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపనుంద’’ ని టాటాస్టీల్‌ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్‌ అన్నారు. నరేంద్రన్‌ వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ సభ్యులు కూడా. యుద్ధ ప్రభావంతో సరఫరా ఇబ్బందులు పెరిగాయని, అన్ని కమోడిటీల ధరలు అనూహ్యంగా పెరిగాయని ఏఎంఎన్‌ఎ్‌స ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రంజన్‌ ధార్‌ అన్నారు.


ఇతర రంగాలకూ ఇబ్బందే..

హెచ్‌ఆర్‌సీ, టీఎంటీ బార్లను వాహనం, ఉపకరణాల తయారీతోపాటు నిర్మాణ రంగాల్లో ఉపయోగిస్తారు. వీటి ధరల పెరుగుదలతో ఈ రంగాల్లో తయారీ వ్యయం కూడా పెరుగుతుంది. దాంతో వాహనాలు, కన్స్యూమర్‌ గూడ్స్‌, ఇళ్ల ధరలు కూడా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. 


‘చిప్‌’లకు మరింత కొరత 

కొవిడ్‌ సంబంధిత ఆంక్షల కారణంగా కుంటుపడిన ప్రపంచ సరఫరా వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. అంతలోనే మొదలైన రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తో సరఫరా అవాంతరాలు మళ్లీ పెరిగాయి. పర్యవసానంగా చిప్‌ల కొరత మరింత తీవ్రతరం కానుందని మూడీస్‌ అనలిటిక్స్‌ తాజా నివేదిక హెచ్చరించింది. ఎందుకంటే, సెమీకండక్టర్ల (చిప్‌) తయారీకి అవసరమైన కీలక ముడిసరుకులైన పల్లాడియం, నియాన్‌ గ్యాస్‌ను సరఫరా చేసే దేశాల్లో రష్యా, ఉక్రెయిన్‌ ప్రధానమైనవి. ప్రపంచంలో చిప్‌ల తయారీకి అవసరమైన పల్లాడియం సరఫరాలో 44 శాతం వాటా రష్యాదే. కాగా, ఉక్రెయిన్‌ 70 శాతం నియాన్‌ గ్యాస్‌ను సరఫరా చేస్తుంది. మొబైల్‌ ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల నుంచి వాహనాల వరకు పలు ఉత్పత్తుల తయారీకి ఈ చిప్‌లు అత్యవసరం. చిప్‌ల కొరత పెరిగితే  ఈ రంగాల ఉత్పత్తిపైనా ప్రభావం చూపనుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. 


వాహన రంగంపై తీవ్ర ప్రభావం 

వాహన తయారీ రంగంపై రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం రెండు విధాలుగా ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. చిప్‌లు, తదితర విడిభాగాల సరఫరాకు అవాంతరాలతోపాటు దేశీయంగా స్టీల్‌ ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో కంపెనీలు ఏప్రిల్‌లో వాహన ధరలను మరింత పెంచే అవకాశాలున్నాయి. జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ తమ మోడళ్ల రేట్లు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.


ఇందుకు తోడు ఇంధన ధరలూ పెరగనుండటం వాహన కొనుగోలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే, తాజా ఉద్రిక్తతల కారణంగా గడిచిన కొన్ని వారాల్లో ముడి చమురు ధరల భారీగా పెరిగింది. గురువారం 120 డాలర్లకు చేరువైన బ్రెంట్‌ క్రూడాయిల్‌.. ప్రస్తుతం 114 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. గత ఏడాది నవంబరు 4వ తేదీ నుంచి యథాతథంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వచ్చేవారంలో భారీగా పెరిగే అవకాశం ఉంది.


 వచ్చే సోమవారంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగియగానే వడ్డింపు ప్రారంభం కావచ్చన్న అంచనాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత క్రూడ్‌ ధరల ప్రకారం.. దేశీయ ఇంధన కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై నష్టాన్ని పూడ్చుకోవాలంటే ధరను రూ.12కు పైగా పెంచాల్సి రావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తాజా నివేదిక పేర్కొంది. 

Read more