సెన్సెక్స్ మళ్లీ 60,000 పైకి
ABN , First Publish Date - 2022-08-18T12:02:05+05:30 IST
వరుసగా నాలుగో రోజూ లాభాల్లో పయనించిన సెన్సెక్స్.. నాలుగు నెలల విరామం (ఈ ఏడాది ఏప్రిల్ 5) తర్వాత మళ్లీ 60,000 ఎగువకు చేరుకుంది. నిఫ్టీ 18,000 మైలురాయికి చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటుండటం ఇందుకు..

18,000 స్థాయికి చేరువైన నిఫ్టీ
4 రోజుల్లో రూ.7.41 లక్షల కోట్లు సంపద
ముంబై: వరుసగా నాలుగో రోజూ లాభాల్లో పయనించిన సెన్సెక్స్.. నాలుగు నెలల విరామం (ఈ ఏడాది ఏప్రిల్ 5) తర్వాత మళ్లీ 60,000 ఎగువకు చేరుకుంది. నిఫ్టీ 18,000 మైలురాయికి చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటుండటం ఇందుకు దోహదపడింది. రూపాయి బలోపేతం, ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపర్చాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ 417.92 పాయింట్ల లాభంతో 60,260.13 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు ఎగబాకి 17,944.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ లాభాలు నమోదు చేసుకోవడం వరుసగా ఇది ఏడో రోజు.
గడిచిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.7.41 లక్షల కోట్లు పెరిగి రూ.279.85 లక్షల కోట్లు దాటింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 23 లాభపడగా, బజాజ్ ఫిన్సర్వ్ 5.74 శాతం ఎగిసి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. మిడ్‌క్యాప్ సూచీ 0.64 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈ టెలికాం, ఐటీ, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1 శాతానికి పైగా ఎగబాకాయి.
టాప్-100లోకి ట్రెంట్ : టాటా గ్రూప్‌నకు చెందిన రిటైల్ విక్రయ వ్యాపార కంపెనీ ట్రెంట్ షేర్లు బీఎ్‌సఈ ఇంట్రాడేలో రూ.1,482.90 వద్ద సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయి ని నమోదు చేసుకున్నాయి. చివరికి షేరు ధర 4.60 శాతం లాభంతో రూ.1,475.10 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.52,437.96 కోట్లుగా నమోదైంది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా దేశంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలోకి తాజాగా ట్రెంట్ కూడా చేరింది. గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో ట్రెంట్ షేరు 11 శాతం మేర పుంజుకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 39 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
29 పైసలు బలపడిన రూపాయి: ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ కాస్త బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు పుంజుకుని రూ.79.45 వద్ద ముగిసింది.