ఐటీ ఫ్రెషర్లకు రూ.6 లక్షల ప్యాకేజీ!

ABN , First Publish Date - 2022-04-24T06:22:40+05:30 IST

దేశీయ ఐటీ రంగంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఫ్రెషర్ల వార్షిక వేతనాలు పెరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

ఐటీ ఫ్రెషర్లకు రూ.6 లక్షల ప్యాకేజీ!

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ బంపరాఫర్‌  

ఆధునిక టెక్నాలజీ నేర్చుకున్న వారికే.. 

ఈ ఏడాది ఫ్రెషర్లకు వార్షిక వేతనం 15-60 శాతం వరకు పెరిగే అవకాశం 


దేశీయ ఐటీ రంగంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఫ్రెషర్ల వార్షిక వేతనాలు పెరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రాంగణ నియామకా (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌)ల్లో భాగంగా ఐటీ సంస్థలు వార్షిక ప్యాకేజీని 15 శాతం నుంచి 60 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు. కొవిడ్‌ సంక్షోభంతో ఐటీ సేవలకు గిరాకీతో పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల వలసలు (అట్రీషన్‌) కూడా భారీగా పెరిగిన నేపథ్యంలో కంపెనీలు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. నిపుణుల వేటలో భాగంగా ఫ్రెషర్లకు సైతం ఈ ఏడాది నుంచి అధిక ప్యాకేజీ ఆఫర్‌ చేయాలని సంస్థలు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఐటీ రంగంలోని బడా కంపెనీలు ఫ్రెషర్లకు రూ.3.50 లక్షల స్థాయిలో ప్యాకేజీ ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది నుంచి ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగుల వార్షిక వేతనాన్ని రూ.3.65 లక్షల నుంచి రూ.4.25 లక్షలకు పెంచడం జరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మానవ వనరుల విభాగ చీఫ్‌ వీవీ అప్పారావు తెలిపారు.

డేటా అనలిటిక్స్‌, డిజిటల్‌ కంటెంట్‌ వంటి ఆధునిక కోర్సుల కోసం పలు ఇంజనీరింగ్‌ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగిందని, ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసే విద్యార్థులను రూ.6 లక్షల వార్షిక ప్యాకేజీతో కంపెనీలో చేర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, కాగ్నిజెంట్‌ వంటి బడా ఐటీ కంపెనీలు కూడా హెచ్‌సీఎల్‌ బాటలో పయనించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది గ్రాడ్యుయేట్లకు ప్యాకేజీ పెంచేందుకు టీసీఎస్‌ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంటోందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. 


మూడు కంపెనీల్లో 1.35 లక్షల మంది ఫ్రెషర్ల నియామకం: మార్చి త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ప్రకటించిన ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1.35 లక్షల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయి. టీసీఎస్‌ 40,000, ఇన్ఫోసిస్‌ 50,000, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 45,000 నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లో టీసీఎస్‌ 78,000, ఇన్ఫోసిస్‌ 85,000, హెచ్‌సీఎల్‌ 23,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకున్నాయి. అంటే, 2021-22లో ఈ మూడు కంపెనీలే 1.86 లక్షల ప్రాంగణ నియామకాలు చేపట్టాయి.


భారత్‌ వైపు రష్యా  ఐటీ చూపు 

రష్యాకు చెందిన పలు ఐటీ కంపెనీలు భారత్‌ సహా బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాల్లో ఉమ్మడి భాగస్వామ్యాల (జేవీ)ను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నాయి. రష్యాలోని 267 సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న రస్‌సాఫ్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వాలెంటిన్‌ మకరోవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఈమధ్య నిర్వహించిన ‘బెంగాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సదస్సు’లో పాల్గొన్న 5-6 రష్యా ఐటీ కంపెనీలు జాయింట్‌ వెంచర్ల ఏర్పాటు దిశగా పలు భారత కంపెనీలతో చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు.

‘‘రష్యాపై అమెరికా, యూర్‌పలు విధించిన ఆర్థిక ఆంక్షలు సవాళ్లతో పాటు అవకాశాలనూ పంచుతున్నాయి. రష్యా ఐటీ సేవల ఎగుమతుల్లో సగానికి పైగా వాటా అమెరికా, పశ్చిమ ఐరోపాలదే. అయితే, ఆర్థిక ఆంక్షలు ఈ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే, రష్యా ఐటీ కంపెనీలు బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా)లోని ఇతర దేశాల్లోకి విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అందులో భారత్‌ అత్యుత్తమ భాగస్వామిగా కన్పిస్తోందని’’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మకరోవ్‌ వెల్లడించారు. తమ అసోసియేషన్‌లోని ఏడు ఐటీ కంపెనీలిప్పటికే భారత్‌లో స్థిరమైన భాగస్వాములను కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

Read more