మార్కెట్‌ లాంగ్‌ జంప్‌

ABN , First Publish Date - 2022-08-31T09:40:25+05:30 IST

వడ్డీరేట్లపై అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ ప్రకటించిన అభిప్రాయానికి మార్కెట్లు సోమవారం ఎంత తీవ్రంగా ప్రతిస్పందించాయో ..

మార్కెట్‌ లాంగ్‌ జంప్‌

సెన్సెక్స్‌ 1564, 

నిఫ్టీ 446 పాయుంట్లు పైకి

రూ.5.68 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: వడ్డీరేట్లపై అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ ప్రకటించిన అభిప్రాయానికి మార్కెట్లు సోమవారం ఎంత తీవ్రంగా ప్రతిస్పందించాయో మంగళవారం అంతకు మించిన పునరుజ్జీవం సాధించాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఆయిల్‌ కంపెనీల షేర్లలో విలువ ఆధారిత కొనుగోళ్లు సాగడం ఇందుకు కలిసొచ్చింది. దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా అంతే వేగంగా లాభాల్లోకి అడుగపెట్టడం భారత మార్కెట్‌కు ఉత్తేజం ఇచ్చింది.


ఇంట్రాడేలో ఏకంగా 1627.16 పాయింట్లు దూసుకుపోయిన సెన్సెక్స్‌ చివరికి 1564.45 పాయింట్ల లాభంతో 59537.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 446.40 పాయింట్ల లాభంతో 17759.30 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లు, నిఫ్టీలోని 50 షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. మే 20వ తేదీ తర్వాత మార్కెట్‌ సూచీలు నమోదు చేసిన గరిష్ఠ లాభం ఇదే. ఈ జోరుతో సెన్సెక్స్‌లో లిస్టింగ్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.5,68,305.56 కోట్లు పెరిగి  రూ.2,80,24,621.83 కోట్లకు చేరింది. 

 

దూసుకుపోయిన రూపాయి:

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కూడా అదే జోరును ప్రదర్శించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ పునరుజ్జీవం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుతో డాలర్‌ మారకంలో రూపాయి 39 పైసలు లాభపడి 79.52 వద్ద రెండు వారాల గరిష్ఠ స్థాయిలో ముగిసింది. ఆరంభంలో 79.92 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 79.44ని నమోదు చేసింది. 


5న టీఎంబీ  ఇష్యూ ప్రారంభం:

తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ (టీఎంబీ) పబ్లిక్‌ ఇష్యూ 5వ తేదీన ప్రారంభమై 7వ తేదీన ముగియనుంది. ఇష్యూలో షేరు ధర శ్రేణి రూ.500-525గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ.832 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూ లో భాగంగా 1.58 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నారు. 


టాప్‌ 10లోకి అదానీ ట్రాన్స్‌మిషన్‌

మార్కెట్‌ విలువపరం గా అదానీ ట్రాన్స్‌మిషన్‌ టాప్‌ 10 కంపెనీల జాబితాలో చేరింది. రూ.4.43 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో టాప్‌ 10 కంపెనీల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మంగళవారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు 3.05 శాతం లాభపడి రూ.3971.65 వద్ద ముగిసింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,43,034.65 కోట్లుగా నమోదైంది.  ఇంట్రాడేలో అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.4,041.90ని తాకింది. కాగా ఎల్‌ఐసీ టాప్‌ 10 జాబితా నుంచి వెలుపలికి వచ్చింది. రూ.4,26.020.22 కోట్లతో 11వ స్థానంలో ఉంది. ఆర్‌ఐఎల్‌ రూ.17,85,412.57 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. 


అక్టోబరు 17న అదానీ ఓపెన్‌ ఆఫర్‌ 

ఎన్‌డీటీవీలో అదనంగా 26 శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్‌ అక్టోబరు 17న ఓపెన్‌ ఆఫర్‌ను ప్రారంభించనుంది. నవంబరు 1తో ముగియనున్న ఈ ఆఫర్‌లో భాగంగా ఎన్‌డీటీవీకి చెందిన 1.67 కోట్ల షేర్లను ఒక్కోటీ రూ.294 చొప్పున కొనుగోలు చేయనుంది. ఇందుకోసం మొత్తం రూ.493 కోట్ల వరకు వెచ్చించనుంది. అదానీ గ్రూప్‌ ఈ ఓపెన్‌ ఆఫర్‌ నిర్వహణ బాధ్యతలను జేఎం ఫైనాన్షియల్‌కు అప్పగించింది.

Updated Date - 2022-08-31T09:40:25+05:30 IST