రికార్డు స్థాయికి ప్రత్యక్ష నగదు బదిలీలు

ABN , First Publish Date - 2022-09-19T06:34:40+05:30 IST

దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీలు (డీబీటీ) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు (ఈ నెల 18 నాటికి) ప్రత్యక్ష నగదు బదిలీలు రూ.25 లక్షల కోట్లు దాటాయి.

రికార్డు స్థాయికి ప్రత్యక్ష నగదు బదిలీలు

రూ.25 లక్షల కోట్లకు చేరిక

న్యూఢిల్లీ: దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీలు (డీబీటీ) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు (ఈ నెల 18 నాటికి) ప్రత్యక్ష నగదు బదిలీలు రూ.25 లక్షల కోట్లు దాటాయి. లక్షల మంది లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తం బదిలీ అయ్యిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సాధారణ బడ్జెట్‌ మొత్తం రూ.39.45 లక్షల కోట్లుగా ఉండగా దానికి చేరువలో డీబీటీ ద్వారా చేసిన మొత్తం ఉండటం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్లు బదిలీ చేయగా 2020-21 నాటికి ఇది 5.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక గడచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈ మొత్తం ఏకంగా 6.3 లక్షల కోట్లకు పెరిగిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటి వరకు లబ్దిదారుల ఖాతాల్లో  ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.2.35 లక్షల కోట్లు జమ చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 73 కోట్ల మంది నగదు రూపం లో డీబీటీ ద్వారా లబ్ది పొందినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్‌ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించటం ద్వారా సుమారు రూ.2.2 లక్షల కోట్ల మేర ఆదా చేసినట్లు వెల్లడించింది. 

Updated Date - 2022-09-19T06:34:40+05:30 IST