చమురు ధరలకు మాంద్యం దెబ్బ

ABN , First Publish Date - 2022-07-06T09:12:48+05:30 IST

ముడి చమురు మార్కెట్‌కీ ‘ఆర్థిక మాంద్యం’ భయం పట్టుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో 142 డాలర్లకు చేరిన బ్యారల్‌ చమురు ధర మంగళవారం నాటికి 100 డాలర్లకు దిగొచ్చింది.

చమురు ధరలకు మాంద్యం దెబ్బ

డిసెంబరు నాటికి బ్యారల్‌ ధర 65 డాలర్లకు!

వచ్చే ఏడాదికి 45 డాలర్లకు చేరే చాన్స్‌ 

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సిటీ అంచనా 


లండన్‌: ముడి చమురు మార్కెట్‌కీ ‘ఆర్థిక మాంద్యం’ భయం పట్టుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో 142 డాలర్లకు చేరిన బ్యారల్‌ చమురు ధర మంగళవారం నాటికి 100 డాలర్లకు దిగొచ్చింది. అయితే మాంద్యం భయాలు నిజమైతే మాత్రం బ్యారల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు ధర ఈ ఏడాది చివరి నాటికి 65 డాలర్లకు, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి 45 డాలర్లకు దిగొచ్చే అవకాశం ఉందని  అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ ‘సిటీ గ్రూప్‌’ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఇదంతా ఒపెక్‌, రష్యా వంటి దేశాలు చమురు ఉత్పత్తికి కోత పెట్టకపోతేనే సాధ్యమని స్పష్టం చేసింది. 


   తగ్గిన డిమాండ్‌

మాంద్యం భయాలతో చమురు డిమాండ్‌ ఇప్పటికే తగ్గుముఖం పట్టిన విషయాన్ని సిటీ గ్రూప్‌ గుర్తు చేసింది. సరఫరా ఆటంకాలూ ఇందుకు తోడయ్యాయి. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాల ఆంక్షలతో రష్యా చమురు, గ్యాస్‌ ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఈయూ దేశాలు కాదనడంతో రష్యా ప్రస్తుతం తన చమురులో ఎక్కువ భాగాన్ని డిస్కౌంట్‌ ధరలతో భారత్‌, చైనాలకు ఎగుమతి చేస్తోంది. 


భారత్‌కు మేలే  

సిటీ అంచనాల ప్రకారం బ్యారల్‌ చమురు ధర 45-65 డాలర్లకు దిగొస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఉపశమనం కానుంది. మన చమురు అవసరాల్లో 85 శాతానికి దిగుమతులే దిక్కు. చమురు సెగ పెరిగినప్పుడల్లా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) జీడీపీలో 1.2 శాతంగా ఉన్న కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌).. చమురు సెగతో ఈ ఆర్థిక సంవత్సరం 3.2 శాతానికి చేరుతుందని అంచనా. బ్యారల్‌ చమురు ధర 45-65 డాలర్లకు దిగొస్తే మాత్రం మాంద్యం ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తేలిగ్గా బయటపడే అవకాశం ఉంది. రూపాయి పతనానికి ఫుల్‌స్టాప్‌ పడడంతో పాటు ఎఫ్‌పీఐల కొనుగోళ్లూ పుంజుకుంటాయని భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-06T09:12:48+05:30 IST