భారత్‌కు చమురు సెగ

ABN , First Publish Date - 2022-06-11T09:26:37+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. మన దేశం కొనుగోలు చేసే బ్యారల్‌ చమురు (ఇండియన్‌ బాస్కెట్‌) సగటు ధర పదేళ్ల గరిష్ఠ..

భారత్‌కు చమురు సెగ

బ్యారల్‌ ధర 121 డాలర్లు

పదేళ్లలో ఇదే గరిష్ఠ ధర

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. మన దేశం కొనుగోలు చేసే బ్యారల్‌ చమురు (ఇండియన్‌ బాస్కెట్‌) సగటు ధర పదేళ్ల గరిష్ఠ స్థాయి 121.28 డాలర్లకు చేరింది. శుక్రవారం ఒక దశలో ఇది 122.80 డాలర్లకు చేరినా తర్వాత కొద్దిగా దిగొచ్చింది.


పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (పీపీఏసీ) శుక్రవారం ఈ వివరాలు విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25-మార్చి 29 మధ్య ఇది 111.86 డాలర్లు, మార్చి 30-ఏప్రిల్‌ 27 మధ్య 103.44 డాలర్ల వద్ద ఉంది. రష్యాపై ఆంక్షలు, ఒపెక్‌ దేశాల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో గత నెల రెండో వారం నుంచి ముడి చమురు ధర సెగలు కక్కుతోంది. 


ధరలు పెంచని ఓఎంసీలు: ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ) మాత్రం ఈ ఏడాది ఏప్రిల్‌ 6 నుంచి ధరలు పెంచకుండా యథాతథ స్థితిని కొనసాగి స్తున్నాయి. లీటరు పెట్రోల్‌పై రూ.18, లీటర్‌ డీజిల్‌పై రూ.21 నష్టం వస్తున్నా ఓఎంసీలు ధరలు పెంచడం లేదు. ప్రభుత్వ పరోక్ష ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని వేరే చెప్పనవసరం లేదు. 


ద్రవ్యోల్బణ భయం:

దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఏ మాత్రం సాహసించడం లేదు. అలా పెంచితే రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత కోరలు చాస్తుందని భయపడుతోంది. ఏప్రిల్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటటికే ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా, దేశీయ మార్కెట్లో పెట్రో ధరలు పెంచితే రిటైల్‌ ద్రవ్యోల్బణం తొమ్మిది శాతానికి ఎగబాకుతుందనే అంచనాలు ప్రభుత్వాన్ని ఠారెత్తిస్తున్నాయి. అయితే పెట్రోల్‌, డీజిల్‌పై నష్టాలను ఆయిల్‌ కంపెనీలు ఎంత కాలం భరించగలవన్నదే ప్రధాన ప్రశ్న. 

Read more