విదేశీ ఫండ్స్‌కు ఐడీబీఐ బ్యాంక్‌ ధారాదత్తం?

ABN , First Publish Date - 2022-12-07T02:30:40+05:30 IST

త్వరలో ప్రైవేటుపరం కానున్న ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతానికి పైగా వాటా కలిగి ఉండేందుకు విదేశీ ఫండ్స్‌, పెట్టుబడి సంస్థల కన్సార్షియాన్ని అనుమతించనున్నట్లు..

విదేశీ ఫండ్స్‌కు ఐడీబీఐ బ్యాంక్‌ ధారాదత్తం?

మెజారిటీ వాటా కొనుగోలుకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: త్వరలో ప్రైవేటుపరం కానున్న ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతానికి పైగా వాటా కలిగి ఉండేందుకు విదేశీ ఫండ్స్‌, పెట్టుబడి సంస్థల కన్సార్షియాన్ని అనుమతించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కొత్త ప్రైవేట్‌ బ్యాంక్‌లపై విదేశీ ప్రమోటర్ల యాజమాన్యానికి అనుమతి లే దు. అయితే, ప్రమోటర్ల నివాస నిబంధన కేవ లం కొత్తగా ఏర్పాటు చేసే బ్యాంక్‌లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే ఏర్పాటైన ఐడీబీఐ బ్యాంక్‌ కు కాదని ఆర్థిక శాఖ పరిధిలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపమ్‌) మంగళవారం వివరణ ఇచ్చింది. అంతేకాదు, విదేశాల్లో ఏర్పాటైన ఫండ్లు, పెట్టుబడి సంస్థల కన్సార్షియానికి ప్రమోటర్ల నివాస నిబంధన వర్తించదని కూడా దీపమ్‌ పేర్కొంది.

ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిసి బ్యాంక్‌లోని 60.72 శాతం వాటా విక్రయించనున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఈ అక్టోబరు 7న దీపమ్‌ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 16 నాటికల్లా ఇన్వెస్టర్లు బిడ్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానంగా ఆర్థిక శాఖ తాజా వివరణలు జారీ చేసింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 49.24 శాతం వాటా కలిగి ఉండగా.. ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం చొప్పున వాటా అమ్మకానికి పెట్టాయి. ఈక్విటీ వాటాతోపాటు బ్యాంక్‌ నియంత్రణాధికారాన్ని సైతం కొత్త ఇన్వెస్టర్‌కు బదిలీ చేయనున్నారు.

అయినా.. ప్రైమరీ డీలర్‌గా కొనసాగింపు

ఒకవేళ విదేశీ బ్యాంక్‌ మెజారిటీ వాటా కొనుగోలు చేసినా, ఐడీబీఐ బ్యాంక్‌ తన ప్రైమరీ డీలర్‌ వ్యాపారాన్ని కొనసాగించనుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రైమరీ డీలర్‌ కార్యకలాపాల్లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ కూడా ప్రభుత్వ బాండ్ల వేలంలో పాలుపంచుకుంటుంది. విదేశీ బ్యాంక్‌ నియంత్రణలోకి వెళ్లినా ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైమరీ డీలర్‌ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే, ప్రైమరీ డీలర్లు ప్రభుత్వ బాండ్ల క్రయ విక్రయాలు జరిపే ఆర్‌బీఐ రిజిస్టర్‌ సంస్థలని దీపమ్‌ స్పష్టం చేసింది.

Updated Date - 2022-12-07T02:37:38+05:30 IST