ఐఫోన్‌ 14 వచ్చేసిందోచ్‌..

ABN , First Publish Date - 2022-09-08T06:50:02+05:30 IST

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ బుధవారం నాడు ఐఫోన్‌ 14 సిరీస్‌ మోడళ్లను ఆవిష్కరించింది.

ఐఫోన్‌ 14 వచ్చేసిందోచ్‌..

నాలుగు మోడళ్లను  ఆవిష్కరించిన యాపిల్‌ 

యాపిల్‌ వాచ్‌ 8 సిరీస్‌, ఎయిర్‌పాడ్స్‌ ప్రో 2 కూడా.. 


కాలిఫోర్నియా(అమెరికా): ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ బుధవారం నాడు ఐఫోన్‌ 14 సిరీస్‌ మోడళ్లను ఆవిష్కరించింది. ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 14 ప్లస్‌ పేర్లతో మొత్తం నాలుగు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వెల్లడించారు. 5జీ ఆధారిత కనెక్టివిటీ, ఈ-సిమ్‌, క్రాష్‌ డిటెక్షన్‌, నెట్‌వర్క్‌ కనెక్టివిటీ లేని చోట కూడా శాటిలైట్‌ ద్వారా ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ సర్వీస్‌ (తొలుత అమెరికా, కెనడాలోనే.. రెండేళ్లపాటు ఉచిత సేవ) వంటి ఫీచర్లతో వీటిని డిజైన్‌ చేశారు. 5 రంగుల్లో లభ్యం కానున్నాయి. ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌ వేరియంట్లు ఏ15 బయోనిక్‌ చిప్‌లతో డిజైన్‌ చేయగా.. ప్రో సిరీస్‌ వేరియంట్లను మాత్రం ఆధునిక ఏ16 బయోనిక్‌ చిప్‌తో అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 


యాపిల్‌ వాచ్‌ 8 సిరీస్‌: స్మార్ట్‌వాచ్‌ 8 సిరీ్‌సను యాపిల్‌ ఆవిష్కరించింది. ఈసీజీ సెన్సర్‌, బాడీ టెంపరేచర్‌ సెన్సర్స్‌, వెహికిల్‌ క్రాష్‌ సెన్సర్స్‌, మహిళల రుతుక్రమంపై ఖచ్చితమైన సమచారం అందించగలగడంతోపాటు మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 36 గంటలపాటు పనిచేయగలదు. ఇంటర్నేషనల్‌ రోమింగ్‌కు కూడా సపోర్ట్‌ చేయగలదు. 4 రంగుల్లో లభిస్తుంది. జీపీఎస్‌ వేరియంట్‌ ధర 399 డాలర్లు కాగా.. జీపీఎస్‌ ప్లస్‌ సెల్యులార్‌ వేరియంట్‌ రేటు 499 డాలర్లు. భారత్‌లో ప్రారంభ ధరను రూ.45,900గా నిర్ణయించారు.  బుధవారం నుంచే బుకింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈనెల 16 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు, వాచ్‌ ఎస్‌ఈ 2(జీపీఎస్‌ వెర్షన్‌  249 డాలర్లు, సెల్యులార్‌ వెర్షన్‌ 299 డాలర్లు)ను సైతం అందుబాటులోకి తెచ్చింది. అలాగే, యాపిల్‌ వాచ్‌ అలా్ట్ర మోడల్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర 799 డాలర్లు. బుకింగ్‌ నేడే ప్రారంభం. విక్రయాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అలా్ట్ర వాచ్‌ భారత్‌లో రూ.89,900కు లభించనుంది. 


ఎయిర్‌పాడ్స్‌ ప్రో 2: యాపిల్‌ రెండో తరం ఎయిర్‌పాడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాక్టివ్‌ నాయిస్‌ కాన్సిలేషన్‌, టచ్‌ కంట్రోల్‌, స్పాషియల్‌ ఆడియో వంటి ఆధునిక ఫీచర్లతో డిజైన్‌ చేసింది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 30 గంటల వరకు పనిచేస్తుంది. ధర 249 డాలర్లు. భారత్‌లో రూ.26,900కు లభించనుంది. ఈనెల 9 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. 

Read more