Indian tech industry: ఈ ఏడాది పండుగ చేసుకున్న ఫ్రెషర్లు!

ABN , First Publish Date - 2022-12-16T18:08:00+05:30 IST

నిజానికి ఈఏడాది ఉద్యోగులకు ఏమంత కలిసి రాలేదు. టెక్ కంపెనీ ఉద్యోగులందరూ

Indian tech industry: ఈ ఏడాది పండుగ చేసుకున్న ఫ్రెషర్లు!

న్యూఢిల్లీ: నిజానికి ఈఏడాది ఉద్యోగులకు ఏమంత కలిసి రాలేదు. టెక్ కంపెనీ ఉద్యోగులందరూ భయంభయంగానే గడిపారు. ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో? ఎప్పుడు ఎలాంటి కబురు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన మధ్య గడిపారు. భయపడినంతా జరిగింది. ట్విట్టర్‌తో మొదలైన ఉద్యోగాల కోత ఆ తర్వాత మరిన్ని సంస్థలకు పాకింది. అమెజాన్, యాపిల్, గూగుల్, అడోబ్, సేల్స్‌ఫోర్స్, లెనోవో, మెటా వంటి కంపెనీలన్నీ కలిసి వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు ఇందుకు పురిగొల్పినట్టు పేర్కొన్నాయి.

పరిస్థితులు ఇలా ఉంటే మరోవైపు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3.82 లక్షల మంది ఫ్రెషర్లకు దేశీయ టెక్ కంపెనీలు ఉద్యోగాలు కల్పించినట్టు ‘నాస్కామ్’ పేర్కొంది. అంతేకాదు, సమీప భవిష్యత్తులో 70 శాతానికిపైగా ‘జెన్ జడ్’ (1997-2012 మధ్య పుట్టిన వారు) విద్యార్థులు టెక్ కంపెనీల్లో సెటిలైపోతారని ఓ నివేదికలో తెలిపింది.

నాస్కామ్ నివేదిక ప్రకారం.. టెక్ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా ఫ్రెషర్స్ నియామకాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఉద్యోగాల్లో ‘జెన్ జడ్’ (Gen Z) ఉద్యోగుల వాటా 18-20 శాతానికి పెరగ్గా, మిలీనియల్స్ (1980-1990 మధ్య జన్మించినవారు) వాటా 68-70 శాతంగా ఉంది.

నిజానికి యజమానులు కనుక తమకు సరైన ప్రాధాన్యం ఇస్తే చేరిన తొలి ఉద్యోగంలో రెండేళ్లకు పైగానే పనిచేసేందుకు 79 శాతం మంది జెన్ జడ్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్టు నాస్కామ్ (Nasscom) సర్వే పేర్కొంది. 2021లో మిలీనియల్స్, జెన్ జడ్ షేర్‌లో భారత్ వాటా 52 శాతం. ప్రపంచ సగటులో ఇది 47 శాతం కావడం గమనార్హం.

మరింత పెరగనున్న వాటా

ఇదే ధోరణి 2030 వరకు కొనసాగే అవకాశం ఉంది. అప్పటికి ఇండియా జెన్ జడ్, మిలీనియల్ (Millennial) పాప్యులేషన్ 50 శాతంగా ఉంటుంది. ప్రపంచ సగటుతో 46తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ కొత్త తరాలు భారతదేశ భవిష్యత్తును ప్రపంచంలోని ప్రతిభా కేంద్రంగా ఎలా రూపొందిస్తాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుందని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీత అన్నారు.

కార్యాలయాల్లో పనిచేసేందుకే మొగ్గు

బ్రాండ్ విలువ.. మిలీనియల్స్, జనరేషన్ జడ్ రెండింటికీ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉండగా.. ఓ కంపెనీని ఎంచుకోవడంలో జన్ జడ్ పాప్యులేషన్ కల్చర్, ఎథిక్స్, లెర్నింగ్, గ్రోత్ వంటివాటిని ప్రామాణికంగా తీసుకుంటోంది. కార్యాలయాల్లో పనిచేసేందుకు జన్ జడ్ ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 85 శాతం మంది పూర్తిగా ఆఫీసు, లేదంటే హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జన్ జడ్ ఉద్యోగులు సానుకూల పని, జీవన సమతౌల్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. విభిన్న పని వాతావరణాన్ని కోరుకుంటారని, ప్రధాన విలువలకు అనుగుణంగా ఉంటారని ఇండీడ్ సేల్స్ హెడ్ శశికుమార్ అన్నారు.

Updated Date - 2022-12-16T18:16:08+05:30 IST