ఎల్‌ఐసీ వాటాదారులకు భారీ నజరానా!

ABN , First Publish Date - 2022-10-29T01:13:05+05:30 IST

పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)లో నిండా మునిగిన వాటాదారులను మంచి చేసుకునేందుకు భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) సిద్ధమవుతోంది.

ఎల్‌ఐసీ వాటాదారులకు భారీ నజరానా!

త్వరలో బోనస్‌ లేదా డివిడెండ్‌

ప్రత్యేక ఖాతాకు రూ.1.8 లక్షల కోట్లు బదిలీ?

ముంబై: పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)లో నిండా మునిగిన వాటాదారులను మంచి చేసుకునేందుకు భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం తన నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఫండ్‌లో ఉన్న రూ.11.57 లక్షల కోట్ల నిధుల్లో రూ.1.8 లక్షల కోట్లు వాటాదారుల నిధికి బదిలీ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. బోనస్‌ షేర్లు లేదా భారీ డివిడెండ్‌ రూపంలో వాటాదారులకు ఈ మొత్తాన్ని బదిలీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వంగానీ, ఎల్‌ఐసీ గానీ ఈ వార్తలపై అధికారికంగా నోరుమెదపడం లేదు.

ఎందుకంటే ?

ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీ షేర్లు పొందిన మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీ ఒక్కో షేరును రూ.949కి జారీ చేసింది. శుక్రవారం బీఎ్‌సఈలో ఎల్‌ఐసీ షేరు రూ.592 వద్ద క్లోజైంది. దీని ప్రకారం ఐపీఓ ద్వారా ఈ షేర్లు పొంది ఇప్పటికీ తమ వద్ద ఉంచుకున్న ఇన్వెస్టర్లు 35 శాతం (దాదాపు రూ.2.23 లక్షల కోట్లు) నష్టపోయారు. మంచి ఫండమెంటల్స్‌ ఉన్న ఎల్‌ఐసీ ఇష్యూ ఇలా నట్టేట ముంచుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కళ్లు చెదిరే లాభాలు పంచకపోయినా.. అసలుకు ఢోకా ఉండదని భావించారు. లిస్టింగ్‌ తర్వాత ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. దీంతో ఏదో ఒకటి చేసి తమను ఆదుకోవాలని మదుపరుల నుంచి ఎల్‌ఐసీపై ఒత్తిడి పెరిగింది. ఇన్వెస్టర్ల నష్టాలను కొంతలో కొంతైనా తగ్గించేందుకే ఈ ప్రత్యేక ఫండ్‌ ద్వారా బోనస్‌ షేర్లు లేదా భారీగా ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించాలని ఎల్‌ఐసీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కంపెనీకీ లాభమే

బోనస్‌ లేదా భారీ డివిడెండ్‌ చెల్లించడం ఇన్వెస్టర్లతో పాటు ఎల్‌ఐసీకీ కలిసి రానుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ నికర విలువ (నెట్‌వర్త్‌) రూ.10,500 కోట్లు. నాన్‌ పార్టిసిపేషన్‌ ఫండ్‌ నుంచి రూ.1.8 లక్షల కోట్లు వాటాదారుల నిధికి బదిలీ చేస్తే.. ఎల్‌ఐసీ నెట్‌వర్త్‌ అమాంతం 18 రెట్లు పెరుగుతుందని అంచనా. అదే జరిగితే ఎల్‌ఐసీ షేర్లు మార్కెట్లో ఫ్యాన్సీగా మారే అవకాశం ఉంది. ఈ వార్తలతో ఎల్‌ఐసీ షేరు త్వరలోనే రూ.840 వరకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-10-29T08:42:12+05:30 IST