పెద్దబ్బాయికి జియో పగ్గాలు

ABN , First Publish Date - 2022-06-29T09:18:15+05:30 IST

దేశంలో అత్యంత విలువైన కంపెనీగా పేరున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ..

పెద్దబ్బాయికి జియో పగ్గాలు

వ్యాపార వారసత్వ ప్రణాళికకు శ్రీకారం చుట్టిన ముకేశ్‌ అంబానీ 


రిలయన్స్‌ జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్‌ అంబానీ నియామకం 

కంపెనీ బోర్డుకు ముకేశ్‌ బైబై

స్వతంత్ర డైరెక్టర్‌గా కేవీ చౌదరి 


న్యూఢిల్లీ: దేశంలో అత్యంత విలువైన కంపెనీగా పేరున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ.. వ్యాపార వారసత్వ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. తన కుమారుడు ఆకాశ్‌ అంబానీకి టెలికాం వ్యాపార విభాగమైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ పగ్గాలు అప్పగించారు. కంపెనీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీని బోర్డు చైర్మన్‌గా నియమించేందుకు ఈ నెల 27న జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మంగళవారం సమాచారం అందించింది. కాగా, కంపెనీ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి ముకేశ్‌ అంబానీ వైదొలిగారు. ఇక కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా పంకజ్‌ మోహన్‌ పవార్‌ను ఐదేళ్ల కాలానికి నియమించారు. మాజీ ఆర్థిక కార్యదర్శి రమీందర్‌ సింగ్‌ గుజ్రాల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మాజీ చీఫ్‌ కేవీ చౌదరి స్వతంత్ర డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వీరిద్దరు ఇప్పటికే ఆర్‌ఐఎల్‌ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. జియో బోర్డు నుంచి తప్పుకున్నప్పటికీ, ముకేశ్‌ అంబానీ ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌, ఎండీగా కొనసాగుతారు. అంతేకాదు, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌తో పాటు ఇతర డిజిటల్‌ సేవలన్నింటిని ఒకే గూటికి చేర్చి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌)కు సైతం ముకేశే చైర్మన్‌గా ఉన్నారు. 


గతంలోనే సంకేతాలు.. 

వారసత్వ ప్రణాళికపై ముకేశ్‌ గతంలో రెండు సందర్భాల్లో సంకేతాలిచ్చారు. రిలయన్స్‌ వ్యవస్థాపకులు ధీరూభాయ్‌ అంబానీ పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది డిసెంబరు 28న జరిగిన రిలయన్స్‌ ఫ్యామిలీ డే కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కంపెనీ ప్రస్తుతం నాయకత్వ పరివర్తన ప్రక్రియలో ఉందన్నారు. అంతేకాదు, సమీప భవిష్యత్‌లో తన వారసులు కంపెనీలో మరింత కీలక పాత్ర పోషించనున్నారని 2021 జూన్‌లో జరిగిన కంపెనీ వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో ముకేశ్‌ పేర్కొన్నారు. 


మూడు ప్రధాన విభాగాలుగా ఆర్‌ఐఎల్‌

దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఇంధన శుద్ధి, పెట్రో కెమికల్స్‌, రిటైల్‌, టెలికాం, డిజిటల్‌ సేవలు, మీడియా, పునరుత్పాదక ఇంధన రంగాల్లోకి విస్తరించింది. తన వ్యాపారాలను ప్రధానంగా మూడు బోర్డులుగా విభజించింది. ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రోకెమికల్‌ (ఓ2సీ), రిటైల్‌, టెలికాం సహా డిజిటల్‌ సేవలు ప్రధానమైనవి. రిటైల్‌, డిజిటల్‌ సేవల విభాగాలు ఆర్‌ఐఎల్‌ పూర్తి అనుబంధ విభాగాలు కాగా.. ఓ2సీతో పాటు కొత్తగా ప్రారంభించిన పునరుత్పాదక ఇంధన వ్యాపారాలు ఆర్‌ఐఎల్‌ బోర్డు పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ మూడు బోర్డు వ్యాపారాల పరిమాణం దాదాపు సమానంగా ఉంది. 


ఈషాకు రిటైల్‌.. అనంత్‌కు ఎనర్జీ!?

65 ఏళ్ల ముకేశ్‌కు ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి ఆకాశ్‌, కూతురు ఈషా కవలలు. చిన్నబ్బాయి అనంత్‌. ఆకాశ్‌కు టెలికాం వ్యాపార సారథ్యం అప్పగించిన ముకేశ్‌  కూతురు ఈషాకు రిటైల్‌ వ్యాపార బాధ్యతలు అప్పగించవచ్చన్న అంచనాలున్నాయి. పిరామల్‌ గ్రూప్‌ అధిపతి అజయ్‌ పిరామల్‌ కుమారుడైన ఆనంద్‌ పిరామల్‌ను ఈషా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 30 ఏళ్లు. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)తో పాటు జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) బోర్డుల్లో 2014 అక్టోబరు నుంచే ఈషా, ఆకాశ్‌ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. చిన్నబ్బాయి అనంత్‌కు ఈ మధ్యనే ఆర్‌ఆర్‌వీఎల్‌ బోర్డులో స్థానం లభించింది.. జేపీఎల్‌లో 2020 మే నుంచే డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఆకాశ్‌, ఈషా ఇద్దరూ టెలికాం, రిటైల్‌ వ్యాపార కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకుంటుండగా.. అనంత్‌ ఓ2సీ, పునరుత్పాదక ఇంధన వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నాడు. 


గతమే

గుణపాఠంగా.. 


గతంలో తనకు ఎదురైన అనుభవాలే గుణపాఠంగా ముకేశ్‌ అంబానీ చాలా ముందు జాగ్రత్తగా, పక్కాగా వారసత్వ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారని విశ్లేషకులంటున్నారు. ఎందుకంటే, ఆర్‌ఐఎల్‌ వ్యవస్థాపకులైన ధీరూభాయ్‌ అంబానీ 2002లో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ధీరూభాయ్‌ పెద్ద కుమారుడు ముకేశ్‌, చిన్న కుమారుడు అనిల్‌ అంబానీ అప్పటికే రిలయన్స్‌ కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. అయితే, తండ్రి మరణం తర్వాత ఇరువురి మధ్య విభేదాలు పొడచూపాయి. తండ్రి వీలునామా కూడా రాయకపోవడంతో వ్యాపారాలపై ఆధిపత్య పోరు మొదలైంది. చివరికి 2005లో తల్లి కోకిలా బేన్‌ ఇద్దరికీ ఆస్తులు పంచి ఇచ్చారు. ముకేశ్‌కు రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, టెక్స్‌టైల్‌ వ్యాపారాలు దక్కగా.. అనిల్‌కు టెలికమ్యూనికేషన్స్‌, అసెట్‌మేనేజ్‌మెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, విద్యుత్‌ వ్యాపారాలు లభించాయి. గడిచిన 17 ఏళ్లలో ముకేశ్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీ స్‌ను దిగ్గజ కంపెనీగా అభివృద్ధి చేశారు. సంప్రదాయ ఇంధన వ్యాపారంతో పాటు రిటైల్‌, టెలికాం, తాజాగా పునరుత్పాదక ఇంధన విభాగాల్లోకీ ప్రవేశించారు. కాగా, అనిల్‌ వ్యాపారాలు క్రమంగా అప్పుల్లో కూరుకుపోయి చివరికి దివాలా తీశాయి. కంపెనీ కార్పొరేట్‌ పాలనను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపర్చేందుకు ముకేశ్‌ 2019 నుంచే ఆర్‌ఐఎల్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రక్షాళన ప్రారంభించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 32.97 శాతం వాటాను గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలకు విక్రయించారు.

 రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారంలోనూ పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అంతేకాదు, మూలధన సమీకరణ లేదా రుణాల తిరిగి చెల్లింపులు వంటి విషయాల్లో గ్రూప్‌ కంపెనీలు పరస్పరం ఆధారపడే అవసరం లేకుండా పూర్తి స్వతంత్ర బోర్డు వ్యాపారాలుగా మార్చారు. అంతేకాదు, కంపెనీలో కుటుంబ వాటాను కూడా క్రమంగా పెంచుకుంటూ వస్తున్నారు. 2019 మార్చి నాటికి రిలయన్స్‌లో 47.27 శాతంగా ఉన్న అంబానీ కుటుంబ వాటా ప్రస్తుతం 50.6 శాతానికి పెరిగింది

Updated Date - 2022-06-29T09:18:15+05:30 IST