భారత మార్కెట్‌పై మళ్లీ ఎఫ్‌పీఐల మోజు

ABN , First Publish Date - 2022-11-17T04:52:40+05:30 IST

భారత మార్కెట్‌పై ఎఫ్‌పీఐలు తిరిగి మోజు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంచి వృద్ధిని నమోదు చేయడానికి... ఇదే కారణం...

భారత మార్కెట్‌పై మళ్లీ ఎఫ్‌పీఐల మోజు

క్యూ2 నాటికి పెట్టుబడులు

రూ.46.41 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: భారత మార్కెట్‌పై ఎఫ్‌పీఐలు తిరిగి మోజు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంచి వృద్ధిని నమోదు చేయడానికి ఇదే కారణం. వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగిసే నాటికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు 56,600 కోట్ల డాలర్లకు (రూ.46.41 లక్షల కోట్లు) చేరాయి. ఒక్క నవంబరు నెలలోనే ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు 353 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేశారు. అయితే ఈ పెట్టుబడులు మార్చి త్రైమాసికంలో నమోదైన 61,200 కోట్ల డాలర్లు, 2021 డిసెంబరు త్రైమాసికంలో నమోదైన 65,400 కోట్ల డాలర్ల కన్నా తక్కువే. 2021 సెప్టెంబరు త్రైమాసికం నాటికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు 66,700 కోట్ల డాలర్లున్నాయి. తాజాగా ఎఫ్‌పీఐలు పెట్టిన పెట్టుబడులతో భారత ఈక్విటీ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ 16.95 శాతం నుంచి 16.97 శాతానికి పెరిగింది. వరుసగా మూడు త్రైమాసికాలు క్షీణించిన పెట్టుబడులు సెప్టెంబరు త్రైమాసికంలో పుంజుకున్నాయని మార్నింగ్‌ స్టార్‌ ఒక నివేదికలో తెలిపింది. అయితే ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా ఉంటూ భారత మార్కెట్‌లో తమ పెట్టుబడులు క్రమంగా విస్తరించుకుంటూ వస్తున్నాయంటున్నారు. ప్రధానంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్న కారణంగా ఆందోళన కలిగించే స్థాయికి పెరిగిన కరెంట్‌ ఖాతా లోటు, తగ్గుతున్న కరెన్సీ విలువ కారణంగా వారు ఆచి తూచి అడుగేస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. దీనికి తోడు ప్రపంచం యావత్తు అస్థిరతలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో వారికి భారత ఈక్విటీ మార్కెట్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఎఫ్‌పీఐల్లో విదేశీ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలదే పెద్దవాటా కాగా బీమా కంపెనీలు, హెడ్జ్‌ఫండ్‌లు, సావెరీన్‌ వెల్త్‌ఫండ్లు భారీ ఎఫ్‌పీఐల్లో ఉన్నాయి.

సెన్సెక్స్‌ మరో ఆల్‌ టైమ్‌ హై

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మళ్లీ రికార్డుల ప ర్వం ప్రారంభమైంది. ఆటుపోట్ల నడుమ సెన్సె క్స్‌ బుధవారం మరో ఆల్‌టైమ్‌ హై వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ షేర్ల మద్దతుతో 107.73 పాయింట్ల లాభంతో 61,980.72 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గత 52 వారాల్లో ఎన్నడూ లేని విధంగా 62,052.57 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ మాత్రం 6.25 పాయింట్ల స్వల్ప లాభంతో 18,409.65 వద్ద ముగిసింది. నాటో సభ్య దేశం పోలెండ్‌పై క్షిపణుల దాడి వార్తలు, మార్కెట్‌ను కొద్దిగా వణికించాయి. దీంతో యూరోపియన్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టగా, ఆసియాలో జపాన్‌ తప్ప మిగిలిన ప్రధాన మార్కెట్లన్నీ బుధవారం నష్టాలతో ముగిశాయి. అయినా సెన్సెక్స్‌ కొద్దిపాటి లాభాలతో మరో ఆల్‌టైమ్‌ హైకి చేరడం విశేషం. అక్టోబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మా ర్కెట్‌ సెంటిమెంట్‌ను కొద్ది గా పెంచింది. తాజా అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సూచీలు ఈ వారం మరింత ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఐపీఓల శుభారంభం

బుధవారం లిస్టయిన బికాజీ ఫుడ్స్‌, మేదాంత నిర్వహణలోని గ్లోబల్‌ హెల్త్‌ కంపెనీల షేర్లు షేర్లు లాభాలతో లిస్టయ్యాయి. గ్లోబల్‌ హెల్త్‌ కంపెనీ షేర్లు బీఎ్‌సఈలో 19 శాతం లాభంతో రూ.336 వద్ద లిస్టయి, చివరికి 23.71 శాతం లాభంతో రూ.415.65 వద్ద క్లోజయ్యాయి. బికాజీ ఫుడ్స్‌ కంపెనీ షేర్లూ ఏడు శాతం లాభంతో రూ.321.15 వద్ద లిస్టయ్యాయి. చివరికి ఇష్యూ ధర రూ.300 కంటే 5.82 శాతం లాభంతో రూ.317.45 వద్ద క్లోజయ్యాయి.

Updated Date - 2022-11-17T04:55:05+05:30 IST