టఫే చేతికి ఫోర్సియా ఇండియా
ABN , First Publish Date - 2022-12-31T03:21:54+05:30 IST
ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల తయారీ కార్యకలాపాలు నిర్వహించే టఫే సంస్థ..
న్యూఢిల్లీ: ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల తయారీ కార్యకలాపాలు నిర్వహించే టఫే సంస్థ.. ఫ్రాన్స్‌కు చెందిన గ్లోబల్ ఆటోమోటివ్ సరఫరా గ్రూప్ ఫోర్వియాకు చెందిన భారత ఇంటీరియర్ సిస్టమ్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. అయి తే డీల్ విలువ ఎంత అన్నది వెల్లడించలేదు. మహారాష్ట్రలోని చకాన్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, తమిళనాడుల్లో ఫోర్వియా గ్రూప్ అనుబంధ విభాగం ఫోర్సియాకు గల తయారీ యూనిట్లు ఈ డీల్‌లో భాగంగా టఫే చేతికి వస్తాయి. వీటిలో చకాన్, అనంతపురం ప్లాంట్ల లావాదేవీ పూర్తయిందని, తమిళనాడు ప్లాంట్‌కు సంబంధించిన లావాదేవీని కూడా త్వరలో పూర్తి చేస్తామని టఫే ప్రకటించింది. టఫే ట్రాక్టర్ల వ్యాపారంతో పాటు ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ వ్యాపారం, ఆటోమోటివ్ ఇంజనీర్డ్ ప్లాస్టిక్ వ్యాపారం ఉన్నాయి. ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలకు ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఇంజనీర్డ్ ప్లాస్టిక్ విడిభాగాలు టఫే సరఫరా చేస్తుంది. టఫే ప్లాస్టిక్ బిజినెస్, ఫోర్సియాకు చెందిన ఇంటీరియర్ సిస్టమ్స్ వ్యాపారం రెండింటినీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల తమ కస్టమర్లకు మరింత ప్రయోజనం కలుగుతుందని టఫే తెలిపింది.